జెండావిష్కరణలో వివాదం


సూర్యాపేటలో కాంగ్రెస్‌ నేతల అరెస్ట్‌.. దామోదర్‌రెడ్డి ధర్నా

 

సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట పబ్లిక్‌ క్లబ్‌లో జెండావిష్కరణ అంశం వివాదాస్పదంగా మారింది. జెండావిష్కరణను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ మంగళవారం కాంగ్రెస్‌ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో పాల్గొన్న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకునే క్రమంలో గాయపడటంతో పాటు స్పృహ కోల్పోయారు. ఆయనను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని కిమ్స్‌కు తరలించారు.

 

అసలేం జరిగిందంటే..: సూర్యాపేట పట్టణంలో క్లబ్‌ అపెక్స్‌ కమిటీ, కాంగ్రెస్‌ నాయకుడు వేణారెడ్డి వర్గం మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. వేణురెడ్డి కాంగ్రెస్‌ నాయకులతో కలసి క్లబ్‌లో మంగళవారం ఉదయం జెండా ఎగుర వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వేణారెడ్డి, కాంగ్రెస్‌ నాయకులను అరెస్టు చేసి మేళ్లచెరువు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌ నాయకుల అరెస్టును నిరసిస్తూ సూర్యాపేటలోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి కార్యకర్తలతో కలసి నిరసనకు దిగారు. కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతి సంఘీభావంగా నిరసనలో పాల్గొన్నారు.



కాంగ్రెస్‌ కార్యకర్తల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు.. దామోదర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్‌ కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాటలో దామోదర్‌రెడ్డి తలకు గాయం కావడంతో స్పృహతప్పి పడిపోయారు. వెంటనే ఆయన్ను పోలీసు వ్యాన్‌లో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ కిమ్స్‌ ఆస్పపత్రికి తరలించారు. దామోదర్‌రెడ్డి అరెస్టును ఎమ్మెల్యే పద్మావతితోపాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఖండించారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అంతకుముందు ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నిర్బంధాలతో కాంగ్రెస్‌ పార్టీని ఎవరూ ఏం చేయలేరన్నారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top