ఏసీబీ వలలో రొంపల్లి వీఆర్‌ఓ

ఏసీబీ వలలో రొంపల్లి వీఆర్‌ఓ - Sakshi


బంట్వారం: భూమి మ్యుటేషన్ కోసం ఓ రైతు నుంచి రూ. 3 వేలు లంచం తీసుకుంటూ రొంపల్లి వీఆర్‌ఓ శివకుమార్ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్, బాధితుడి కథనం ప్రకారం.. మండల పరిధిలోని రొంపల్లి గ్రామానికి చెందిన దరిపురం నర్సింలు గతేడాది మే నెలలో రెండెకరాల 32 గుంటాల పొలాన్ని ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేసి తన భార్య శశికళ పేరున రిజిస్ట్రేషన్ చేయించాడు.



భూమి మ్యుటేషన్(మార్పిడి) కోసం ఆయన అదే నెల 30న ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. దానికి సంబంధించిన పత్రాలను బంట్వారం తహశీల్దార్ కార్యాలయంలో సమర్పించా డు. దీనిపై విచారణ జరిపి మ్యుటేషన్ చేయాలని తహసీల్దార్ శ్రీనివాస్ రొంపల్లి వీఆర్‌ఓ  శివకుమార్‌కు సూచించారు. వీఆర్‌ఓ శివకుమార్ 6 నెలలుగా రైతు నర్సింలును కార్యాలయానికి తిప్పించుకున్నాడు. దీంతో విసుగు చెందిన నర్సింలు ఈనెల 27న వీఆర్‌ఓను గట్టిగా ప్రశ్నించగా.. డబ్బులు ఇవ్వందే పనులు ఎలా చేస్తారు..? అంటూ సమాధానమిచ్చాడు.

 

రూ. 6 వేలు లంచంగా ఇస్తే పని అవుతుందని చెప్పాడు. అంత డబ్బు ఇచ్చుకోలేనని నర్సింలు వీఆర్‌ఓను బతిమాలాడు. చేసేది లేక చివరికి రూ.4 వేలు ఇస్తానని అంగీకరించాడు. వీఆర్‌ఓ  తీరుతో విసుగు చెందిన రైతు రెండు రోజుల క్రితం నగరంలో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వారి సూచన మేరకు గురువారం నర్సింలు వీఆర్వోకు డబ్బులిచ్చేందుకు బంట్వారం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు.



ఓ గదిలో ఉన్న వీఆర్‌ఓ శివకుమార్ దగ్గరకు వెళ్లగా జనాలు ఎక్కువగా కనిపించారు. కొద్దిసేపు నిరీక్షించమంటూ వీఆర్‌ఓ రైతు నర్సింలుకు కనుసైగ చేశాడు. అందరూ వెళ్లిపోయాక నర్సింలు రూ. 3 వేలు వీఆర్‌ఓ శివకుమార్ చేతికిచ్చాడు. రూ. 4 వేలు చెప్పాను కదా అంటూ వీఆర్‌ఓ నర్సింలును గద్దించాడు.



‘నా దగ్గర ఇంతే ఉన్నాయి సార్..’ అంటూ నర్సింలు ప్రాధేయపడడంతో వీఆర్‌ఓ డబ్బులు తీసుకొని తన జేబులో పెట్టుకున్నాడు. అప్పటికే మాటువేసిన హైదరాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్, ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి, సునీల్‌లు వీఆర్‌ఓ  శివకుమార్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన వద్ద ఉన్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు. వీఆర్వో చేతులను కెమిక ల్‌తో పరీక్షించగా డబ్బులు తీసుకున్నట్లుగా తేలింది.  

 

కోర్టులో హాజరుపరుస్తాం..

వీఆర్‌ఓ శివకుమార్ రైతు నర్సింలు నుంచి రూ.3 వేలు తీసుకున్నట్లు నిర్ధారణ జరిగిందని ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్ తెలిపారు. లంచగొండి వీఆర్‌ఓను శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. అవినీతి అధికారుల గురించి 9440446140 నంబర్‌లో సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. ఏసీబీ అధికారులకు వీఆర్వో పట్టుబడడం స్థానికంగా కలకలం రేగింది. ఎక్కడ చూసినా జనం ఈ విషయమే చర్చించుకుంటూ కనిపించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top