ఏ ఫిర్యాదులు తీసుకోకండి...

ఏ ఫిర్యాదులు    తీసుకోకండి...


సిబ్బందికి లోకాయుక్త మౌఖిక ఆదేశాలు !

లోకాయుక్త రాజీనామాపై శుక్రవారం సైతం కొనసాగిన ఆందోళనలు


 

బెంగళూరు: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లోకాయుక్త న్యాయమూర్తి వై.భాస్కర్‌రావు లోకాయుక్తలో ఫిర్యాదుల స్వీకరణకు తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు సమాచారం. స్వయంగా లోకాయుక్త పైనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే వరకు ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు స్వీకరించరాదని ఆయన లోకాయుక్త సిబ్బందికి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. లోకాయుక్త వై.భాస్కర్‌రావు కుమారుడు   అశ్విన్‌రావుపై కోట్ల రూపాయల్లో అవినీతి ఆరోపణలు వస్తుండడంతో పాటు ఇందుకు భాస్కర్‌రావు సైతం మద్దతుగా నిలిచారనే ఆరోపణల మధ్య లోకాయుక్త రాజీనామా చేయాలంటూ ప్రజాసంఘాలు, న్యాయవాదులు లోకాయుక్త కార్యాలయంతో పాటు ఆయన నివాసం ఎదుట సైతం నిరసనకు దిగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారుల అవినీతికి సంబంధించి ఆర్‌టీఐ కార్యకర్తలు, సాధారణ ప్రజలు ఇచ్చే ఫిర్యాదులను స్వీకరించవద్దని, ఎలాంటి విచారణను చేపట్టవద్దని లోకాయుక్త భాస్కర్‌రావు, లోకాయుక్త ఏడీజీపీ ప్రేమ్‌శంకర్ మీనాను ఆదేశించినట్లు సమాచారం. దీంతో ఫిర్యాదులు చేసేందుకు వస్తున్న సామాన్యులను లోకాయుక్త కార్యాలయం ఎదుట ఉన్న పోలీసులు బయటి నుంచే పంపించి వేస్తున్నారు. తమను ఇబ్బంది పెట్టే అవినీతి అధికారుల గురించి ఫిర్యాదు చేసేందుకు ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి నగరానికి వచ్చిన సామాన్యులు తమ ఫిర్యాదులు నమోదు చేసుకోకుండానే వెనక్కు పంపేస్తుండడంతో ఏం చేయాలో దిక్కుతోచక తీవ్ర ఆవేదనతో లోకాయుక్త కార్యాలయం నుంచి వెనుదిరుగుతున్నారు.



శుక్రవారం సైతం కొనసాగిన ఆందోళనలు....

ఇక లోకాయుక్త వై.భాస్కర్‌రావు తక్షణమే రాజీనామా చేయాలనే డిమాండ్‌తో శుక్రవారం సైతం ఆందోళనలు కొనసాగాయి. లోకాయుక్త రాజీనామాను డిమాండ్ చేస్తూ కర్ణాటక రక్షణా వేదిక కార్యకర్తలు నగరంలో ర్యాలీని నిర్వహించారు. గాంధీనగర నుంచి ర్యాలీగా బయలుదేరిన కరవే కార్యకర్తలు లోకాయుక్త కార్యాలయానికి చేరుకొని, లోకాయుక్తను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో కొంతమంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక బార్‌కౌన్సిల్ సభ్యులు సైతం లోకాయుక్త కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ కేసును సీబీఐకి అప్పగించే వరకు తమ పోరాటాన్ని ఆపబోమని న్యాయవాదులు, ప్రజాసంఘాల నేతలు తెలిపారు. ఇక లోకాయుక్త పై వచ్చిన ఆరోపణలను సాకుగా చూపుతూ కొన్ని చిన్న చేపలను బలిపశువులు చేసి ఎన్నో పెద్ద తిమింగళాలు తప్పించుకునే ప్రయత్నం చేస్తునానయని ‘న్యాయక్కాగి నావు’ సంస్థ విమర్శించింది. శుక్రవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ పదాధికారుల్లో ఒకరైన అగ్ని శ్రీధర్ మాట్లాడుతూ....‘ఎంతో కాలంగా లోకాయుక్తలో అవినీతి జరుగుతూనే ఉంది. ఈ అవినీతిని అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఇందుకు ప్రజల నుంచి భారీ ఎత్తున స్పందన రావాలి’ అని పేర్కొన్నారు. కాగా, ఈ విషయంపై ప్రముఖ న్యాయవాది ఎ.కె.సుబ్బయ్య స్పందిస్తూ అవినీతి ఆరోపణలు వచ్చినంత మాత్రాన లోకాయుక్త పదవిలో ఉన్న వారు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఆరోపణలు రుజువైతేనే రాజీనామా కోరాల్సి ఉంటుందంటూ భాస్కర్‌రావుకు మద్దతుగా నిలిచారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top