మహిళలు వంటింటికే పరిమితమైతే వేధింపులుండవ్‌

మహిళలు వంటింటికే పరిమితమైతే వేధింపులుండవ్‌ - Sakshi


ఉద్యోగాలు, వ్యాపారాలంటూ తిరగడం వల్లే మహిళలకు వేధింపులు

షెడ్‌లో ఉంచితేనే వాహనానికి భద్రత..

  ఆడవాళ్ల పరిస్థితి కూడా అంతే..!

వేధించే వారిని ధైర్యంగా ఎదుర్కోవాలి

మీట్‌ ది ప్రెస్‌లో స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు  




సాక్షి, అమరావతి : ‘ఒక వాహనం కొని షెడ్‌లో ఉంచితే ప్రమాదాలు జరగవు.. అదే వాహనాన్ని బయటకు తీసుకెళ్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. మహిళల పరిస్థితి కూడా అంతే.. వారు వంటింటికే పరిమితమైతే వేధింపులుండవు. ప్రస్తుతం మహిళలు ఉద్యోగాలు, వ్యాపారాలు అంటూ బయట తిరుగుతున్నందునే వేధింపులకు గురవుతున్నారు. అలాగని వారు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకోకూడదని నా ఉద్దేశం కాదు. వేధించే వారిని ధైర్యంగా ఎదుర్కోవాలి.. ’ అని అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు.



బుధవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమానికి స్పీకర్‌ హాజరై మీడియాతో మాట్లాడారు. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలతో పాటు బాల్య వివాహాలు, అక్రమ రవాణా తదితర వాటిని అరికట్టాలంటే చట్టాలు ఒక్కటే ఉంటే సరిపోదన్నారు. ఆ చట్టాలు అమలు కావాలంటే ముఖ్యంగా మహిళల్లో ధైర్యం రావాలన్నారు. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు మూడు రోజుల పాటు జాతీయ మహిళా పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.



గతంలో 12 గంటల పాటు పనిచేసే తనకు స్పీకర్‌గా ప్రస్తుతం పెద్దగా పని ఉండటం లేదన్నారు. ఆ సమయంలో ఆలోచించి శాసనసభ ద్వారా ‘మహిళా సాధికారత’ అనే అంశంపై సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుందనుకొని ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశాలకు దేశ, విదేశాల నుంచి 60 మందికి పైగా ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఏపీయూడబ్లూజే రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు, ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు కె.జయరాజ్, బొంతా విలియం పాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top