సామాన్యుల కోసం క్యాంటీన్లు

సామాన్యుల కోసం క్యాంటీన్లు


ఆప్  సర్కారు యోచన



♦ భోజనం ధర రూ. 3-5 మధ్య 

♦ సీఎం ఆదేశం మేరకు {పతిపాదనల్ని రూపొందించిన డీడీసీ!

♦ క్యాంటీన్ ఏర్పాటుకు రూ.10-15 లక్షల అంచనా వ్యయం    

♦ షీలా హయాంలో  30 చోట్ల ‘జన్ ఆహార్’

♦ రూ. 18కే అప్పట్లో భోజనం

♦ ఇప్పుడు అదే బాటలో కేజ్రీవాల్

♦ ఇవి అందుబాటులోకి వస్తే ‘జన్ ఆహార్’ పక్కకే!

 

 సాక్షి, న్యూఢిల్లీ : సామాన్యుడి కోసం నగరంలో త్వరలో క్యాంటీన్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తోంది. ఈ క్యాంటీన్ల ద్వారా రూ. 3 నుంచి రూ. 5కు  సామాన్యులకు భోజనం అందించాలని ప్రభుత్వం ఆశిస్తోంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశం మేరకు ఢిల్లీ డైలాగ్ కమిషన్ ఈ క్యాంటీన్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించిందని అంటున్నారు.



పేదలకు చౌకగా ఆహారాన్ని అందించడం కోసం షీలాదీక్షిత్ అధికారంలో ఉండగా జన్ ఆహార్ పథకాన్ని ప్రారంభించిన సంగతి విదితమే. ఈ పథకం కింద ఇప్పటికీ 30 చోట్ల భోజనం లభిస్తోంది. జన్ ఆహార్ కింద ఆరు పూరీలు, కూర, పప్పు రూ .18కి విక్రయిస్తున్నారు. ఐదు రూపాయలు అదనంగా చెల్లిస్తే రైతా కూడా లభిస్తుంది. ఆమ్ ఆద్మీ  క్యాంటీన్లను ప్రారంభించాలన్న ప్రభుత్వ యోచనతో జన్ ఆహార్ పథకం మూలనపడే సూచనలు కనిపిస్తున్నాయి.



 అన్నాడీఎంకే సర్కారు తమిళనాడులో నడిపే అమ్మ క్యాంటీన్లపై అధ్యయనం చేసిన  ఢిల్లీ డైలాగ్ కమిషన్ గత నెల 19న ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించినట్లు తెలిసింది. ఒక్కొక్క క్యాంటీన్ ఏర్పాటుకు రూ. 10 లక్షల నుంచి 15 లక్షల మేర ఖర్చవుతుందని అంచనా వేశారు. తొలుత 10-15 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని డీడీసీ ప్రతిపాదించిందని చెబుతున్నారు. క్రమేణా రాజధానిలో మొత్తం 200 క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ఆప్ సర్కారు ఆశిస్తోంది. క్యాంటీన్లలో అమ్మే భోజనం గరిష్ట ధర రూ. 5కు మించకూడదని కూడా ఆప్ సర్కారు భావిస్తోంది. ఈ క్యాంటీన్లలో ఉదయం వేళల్లో పూరీ,  కూర, పచ్చడి, మధ్యాహ్న సమయంలో అన్నం, పప్పు, రాత్రి రొట్టె, కూర, పప్పు లభిస్తాయి. ఆస్పత్రులతోపాటు ఖాళీగా ఉన్న ప్రభుత్వ  కార్యాలయ భవనాల్లోనూ ఈ క్యాంటీన్లను నెలకొల్పుతారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top