కేజ్రీవాల్ రాజీనామాతో విజయావకాశాలు తగ్గాయి


వారణాసి: ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ అవకాశాలకు గండి కొట్టిందన్నారు ఆ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా. ఆప్ గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినంతగా... ఈ ఎన్నికల్లో గెలవకపోవచ్చునన్న సిసోడియా... కేజ్రీవాల్ చేసింది తప్పు కాదన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కేజ్రీవాల్ బరిలో నిలిచిన వారణాసి ఎన్నికల ప్రచారం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రజలను సంప్రదించకుండా రాజీనామా చేసి తప్పు చేశానని కేజ్రీవాల్ ఇంతకుముందే చెప్పిన విషయాన్ని సిసోడియా గుర్తు చేశారు. 

 

 ఇది తమ భవిష్యత్ రాజకీయాలకు శుభ సూచకమేనని అన్నారు. కేజ్రీవాల్ వారణాసిలో గెలిస్తే అది వంద సీట్ల గెలుపుతో సమానమని చెప్పారు. ఢిల్లీ, పంజాబ్‌లో తమ పార్టీ గెలుపుపై ధీమాతో ఉన్నారు. మోడీకి వ్యతిరేకంగా నిలబడటమంటే సాధారణ విషయం కాదని, అయితే ఏ క్షణంలోనైనా ప్రజల అభిప్రాయంలో మార్పు రావొచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 30 తరువాత ప్రచారం తీవ్రస్థాయికి చేరుకోనుంది. ఇంటింటికి ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలో తాము ఇప్పటికే 50 వేల ఇళ్లకు తిరిగామని సిసోడియా చెప్పారు. 450 లోక్‌సభ నియోజకవర్గాల్లో బరిలో ఉండగా, 100 స్థానాలు తమ సొంతమవుతాయని అంచనాకొచ్చామని, అందులో 41 స్థానాల్లో ఎక్కువ అవకాశాలున్నాయని తెలిపారు. తమ దృష్టంతా అమేథి, వారణాసిలపైనేనన్నారు సిసోడియా.

 

 సోమ్‌నాథ్ భారతిపై దాడి

 ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నేత సోమ్‌నాథ్ భారతిపై వారణాసిలో బుధవారం సాయంత్రం దాడి జరిగింది. ఇక్కడి ఆస్సీ ఘాట్ వద్ద ఓ టీవీ చానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన భారతిపై బీజేపీ కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు పగిలిపోగా భారతికి కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. వారణాసిలో తాము చేస్తున్న ప్రచారాన్ని భరించలేకే బీజేపీ ఇలా దాడులకు దిగుతోందని భారతి ఆరోపించారు. 
Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top