ఇక యువీ పాత్ర కష్టమే?

ఇక యువీ పాత్ర కష్టమే? - Sakshi


న్యూఢిల్లీ:  భారత క్రికెట్‌ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సీనియర్‌ ఆటగాళ్లు ఎమ్మెస్‌ ధోని, యువరాజ్‌ సింగ్‌లపై కీలక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఇటీవల  మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌లో జరిగే 2019 వన్డే వరల్డ్‌ కప్‌ను దృష్టిలో ఉంచుకొని సెలక్టర్లు, మేనేజ్‌మెంట్‌ ఈ దిశగా ఆలోచించాలని ద్రవిడ్ పేర్కొన్నాడు.



దాదాపు మూడేళ్ల విరామం తర్వాత.. ఈ ఏడాది ఆరంభంలో భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న యువీ తన స్థానాన్ని ఎంతో కాలం నిలుపులేకపోయాడు. తాజాగా శ్రీలంకతో ఐదు వన్డేల  సిరీస్ కు ఎంపిక చేసిన జట్టులో యువీకి స్థానం దక్కలేదు. చివరిగా జూన్ లో వెస్టిండీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో ఆడిన యువీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అంతకుముందు చాంపియన్స్‌ ట్రోఫీలో పాక్‌పై అర్ధ సెంచరీ చేసిన యువరాజ్‌ చివరి ఏడు వన్డేల్లో 162 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దాంతో యువీని ఎంపిక చేయడానికి సెలక్టర్లు ఆసక్తి చూపలేదు.



అదే సమయంలో భారత క్రికెట్ జట్టు సెలక్టర్లు.. వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని జట్టును ఎంపిక చేశారనేది క్లియర్ గా కనబడింది. ఇక్కడ ప్రస్తుతం టెస్టు సిరీస్ ఆడుతున్న కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ లతో పాటు, ఎంతో కాలంగా స్థానం కోసం ఎదురుచూస్తున్న మనీష్ పాండేకు చోటు కల్పించారు. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన ముక్కోణపు సిరీస్ టైటిల్ ను భారత -ఎ జట్టు సాధించిన సంగతి తెలిసిందే. ఆ టైటిల్ సాధించడంలో మనీష్ కీలక పాత్ర పోషించాడు. దాంతో అతని ఎంపికకు మార్గం సుగుమం అయ్యింది.



మరొకవైపు భారత జట్టులో తీవ్ర పోటీ నెలకొంది. భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించే క్రికెటర్లు తమను తాము నిరూపించుకుంటూ జట్టులో పాతుకుపోతున్నారు. ఈ క్రమంలో వెటరన్ ఆటగాళ్లకు ఇక చోటు కష్టంగానే కనబడుతోంది. ప్రస్తుత వన్డే సిరీస్ కు మహేంద్ర సింగ్ ధోనిని ఎంపిక చేసినప్పటికీ, అతను వచ్చే వరల్డ్ కప్ ఆడతాడా అనేది ప్రశ్నార్థకమే. ప్రస్తుతం 36వ ఒడిలో ఉన్న యువరాజ్ మాత్రం ఇక భారత జట్టు  జెర్సీ ధరించడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో భారత క్రికెట్‌కు సంబంధించి రోడ్‌ మ్యాప్‌ను చూస్తే యువీ పాత్ర ఇక కనిపించకపోవచ్చు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top