బంగ్లా... భళా!

బంగ్లా... భళా!


స్కాట్లాండ్‌పై ఘన విజయం

 నలుగురు బ్యాట్స్‌మెన్ అర్ధసెంచరీలు

 కోయెట్జర్ సెంచరీ వృథా


 

 గతంలో భారీ లక్ష్యాన్ని ఛేదించిన దాఖలాల్లేకపోయినా... కళ్ల ముందు కొండంత స్కోరు కనిపిస్తున్నా... బంగ్లాదేశ్ ఏమాత్రం తడబడలేదు. సమష్టిగా ఆడుతూ... మంచి భాగస్వామ్యాలు జోడిస్తూ.. అనుభవంతో అనుకున్న ఫలితాన్ని సాధించింది. తమీమ్ ఇక్బాల్ నిలకడకు మరో ముగ్గురి అర్ధసెంచరీలు తోడవడంతో స్కాట్లాండ్‌పై సులభంగా నెగ్గింది. మరోవైపు కోయెట్జర్ 156 పరుగులతో... టెస్టులు ఆడని దేశాల క్రికెటర్లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు సాధించాడు. అయితే స్కాట్లాండ్‌కు అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచకప్ మ్యాచ్ విజయం మాత్రం దక్కలేదు.

 

 నెల్సన్: కళ్ల ముందు భారీ లక్ష్యం ఉన్నా... సమష్టి కృషితో రాణించిన బంగ్లాదేశ్... ప్రపంచకప్‌లో రెండో విజయాన్ని అందుకుంది. తమీమ్ ఇక్బాల్ (100 బంతుల్లో 95; 9 ఫోర్లు, 1 సిక్స్), మహ్మదుల్లా (62 బంతుల్లో 62; 6 ఫోర్లు, 1 సిక్స్)ల సమయోచిత బ్యాటింగ్‌తో గురువారం జరిగిన       గ్రూప్-ఎ  లీగ్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో స్కాట్లాం డ్‌ను ఓడించింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండింటిలో విజయాలు సాధించిన బంగ్లా క్వార్టర్స్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.

 

 టాస్ గెలిచి బంగ్లా ఫీల్డింగ్ ఎంచుకోగా... స్కాట్లాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 318 పరుగులు చేసింది. ఓపెనర్ కోయెట్జర్ (134 బంతుల్లో 156; 17 ఫోర్లు, 4 సిక్సర్లు) కెరీర్ బెస్ట్ నమోదు చేశాడు. మమ్‌సేన్ (38 బంతుల్లో 39; 2 ఫోర్లు, 1 సిక్స్), మకన్ (50 బంతుల్లో 35; 2 ఫోర్లు, 1 సిక్స్)లు ఫర్వాలేదనిపించారు. ఆరంభంలో బంగ్లా బౌలర్ల స్వింగ్ ధాటికి 9.5 ఓవర్లలో స్కాట్లాండ్ 38 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే కోయెట్జర్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో యాంకర్ పాత్ర పోషించాడు. మమ్‌సేన్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 113 బంతుల్లో 141 పరుగులు జోడించాడు. 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రూబెల్ బౌలింగ్‌లో  సిక్సర్‌తో కోయెట్జర్ కెరీర్‌లో రెండో సెంచరీ సాధించాడు. చివర్లో బెరింగ్టన్ (16 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్సర్లు), క్రాస్ (14 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్) వేగంగా ఆడటంతో స్కాట్లాండ్ 300  దాటింది. తస్కిన్ 3, నాసిర్ 2 వికెట్లు తీశారు.

 

 తర్వాత బంగ్లాదేశ్ 48.1 ఓవర్లలో 4 వికెట్లకు 322 పరుగులు చేసి గెలిచింది. తమీమ్, మహ్మదుల్లాకు తోడుగా ముష్ఫీకర్ (42 బంతుల్లో 60; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), షకీబ్ (41 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), షబ్బీర్ (40 బంతుల్లో 42 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు)లు వేగంగా ఆడారు. ఓపెనర్లలో సౌమ్య సర్కార్ (2) రెండో ఓవర్‌లోనే అవుటైనా... మహ్మదుల్లా, తమీమ్‌లు రెండో వికెట్‌కు 139 పరుగులు జోడించి పటిష్టమైన పునాది వేశారు.

 

  తర్వాత మిడిలార్డర్ సాయంతో ముష్ఫీకర్ లక్ష్యాన్ని ఛేదించుకుంటూ వెళ్లాడు. తమీమ్‌తో కలిసి మూడో వికెట్‌కు 48 బంతుల్లో 57; షకీబ్‌తోకలిసి నాలుగో వికెట్‌కు 39 బంతుల్లో 46 పరుగులు జోడించి అవుటయ్యాడు. చివరకు 72 బంతుల్లో 72 పరుగులు చేయాల్సిన దశలో షకీబ్, షబ్బీర్‌లు నిలకడగా ఆడి 61 బంతుల్లోనే అజేయంగా 75 పరుగులు చేసి జట్టును గెలిపించారు. డేవికి 2 వికెట్లు దక్కాయి.

 

 2 ప్రపంచకప్‌లో రెండో అత్యధిక ఛేజింగ్ (319) చేసిన జట్టుగా బంగ్లాదేశ్ రికార్డు. 2011లో ఐర్లాండ్ 329 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌పై ఛేదించింది. అలాగే బంగ్లాకు ఇదే అతి పెద్ద లక్ష్యఛేదన.

 

 స్కోరు వివరాలు

 స్కాట్లాండ్ ఇన్నింగ్స్: కోయెట్జర్ (సి) సౌమ్య (బి) నాసిర్ 156; మెక్లీయెడ్ (సి) మహ్మదుల్లా (బి) మొర్తజా 11; గార్డెనర్ (సి) సౌమ్య (బి) తస్కిన్ 19; మకన్ (సి) అండ్ (బి) షబ్బీర్ 35; మమ్‌సేన్ (సి) సౌమ్య (బి) నాసిర్ 39; బెరింగ్టన్ (సి) ముష్ఫీకర్ (బి) తస్కిన్ 26; క్రాస్ (సి) షబ్బీర్ (బి) తస్కిన్ 20; డేవి నాటౌట్ 4; హక్ (సి) సౌమ్య (బి) షకీబ్ 1; ఇవాన్స్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (50 ఓవర్లలో 8 వికెట్లకు) 318. వికెట్ల పతనం: 1-13; 2-38; 3-116; 4-257; 5-269; 6-308; 7-312; 8-315. బౌలింగ్: మొర్తజా 8-0-60-1; షకీబ్ 10-0-46-1; తస్కిన్ 7-0-43-3; రూబెల్ హుస్సేన్ 8-0-60-0; మహ్మదుల్లా 5-0-29-0; షబ్బీర్ 7-0-47-1; నాసిర్ హుస్సేన్ 5-0-32-2. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ ఎల్బీడబ్ల్యు (బి) డేవి 95; సౌమ్య సర్కార్ (సి) క్రాస్ (బి) డేవి 2; మహ్మదుల్లా ఎల్బీడబ్ల్యు (బి) వార్డ్‌లా 62; ముష్ఫీకర్ (సి) మెక్లీయెడ్ (బి) ఇవాన్స్ 60; షకీబ్ నాటౌట్ 52; షబ్బీర్ నాటౌట్ 42; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (48.1 ఓవర్లలో 4 వికెట్లకు) 322. వికెట్ల పతనం: 1-5; 2-144; 3-201; 4-247. బౌలింగ్: వార్డ్‌లా 9.5-0-75-1; డేవి 10-0-68-2; ఇవాన్స్ 10-1-67-1; మకన్ 7-0-45-0; హక్ 10-0-49-0; బెరింగ్టన్ 2-0-18-0.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top