మీరే కారణం...కాదు మీరే!


కోల్‌కతా : బెంగాల్ యువ క్రికెటర్ అంకిత్ కేసరి విషాదం జరిగి ఒక రోజు కూడా గడవక ముందే అతని మృతికి కారణమంటూ ఆరోపణల పర్వం మొదలైంది. అటు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్), ఇటు ఏఎంఆర్‌ఐ, నైటింగేల్ ఆస్పత్రి వర్గాలు తమ తప్పేమీ లేదని... అవతలివారే కారణమని చెబుతున్నాయి. మైదానంలో గాయపడగానే ముందుగా ఏఎంఆర్‌ఐ ఆస్పత్రికి అంకిత్‌ను తీసుకెళ్లగా... ఆ తర్వాత ఈస్ట్ బెంగాల్ జట్టు అధికారి సదానంద్ ముఖర్జీ ‘రిస్క్ బాండ్’పై సంతకం చేసి మరీ అతడిని నైటింగేల్ ఆస్పత్రికి మార్పించారు.



తాము చికిత్స చేసే అవకాశం కూడా ఇవ్వకుండానే కేసరిని మార్చారని ఏఎంఆర్‌ఐ సీఈఓ రూపక్ బారువా ఆరోపించారు. ‘మా డాక్టర్లు ఎప్పటికప్పుడు అంకిత్ ఆరోగ్యాన్ని సమీక్షిస్తూనే ఉన్నారు. అప్పటికే కొన్ని పరీక్షలు జరిపినా, సీటీ యాంజియో సహా మరికొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే మా పనిని పూర్తిగా చేయనీయకుండా అతడిని తీసుకెళ్లారు’ అని ఆయన చెప్పారు. అయితే దీనిని ఖండిస్తూ ‘ఏఎంఆర్‌ఐ డాక్టర్లు ఆరోగ్యంపై మాకు ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు.



పైగా మెరుగైన వైద్యం కోసం మరో చోటికి తరలించాలని వారే సూచించారు’ అని సదానంద్ అన్నారు. అంకిత్‌ను తమ ఆస్పత్రికి తెచ్చినప్పటినుంచి అతని ప్రాణం కాపాడేందుకు తాము అన్ని రకాలుగా ప్రయత్నించామని నైటింగేల్ హాస్పిటల్ స్పష్టం చేసింది. మరో వైపు మెరుగైన వైద్యం కోసమే నైటింగేల్ ఆస్పత్రికి తరలించామే తప్ప దానితో తమకు ఉన్న ఒప్పందం వల్ల కాదని ‘క్యాబ్’ సంయుక్త కార్యదర్శి సుబీర్ గంగూలీ స్పష్టం చేశారు.

 

ఏ సహాయమైనా చేస్తాం

హఠాన్మరణం చెందిన అంకిత్ కుటుంబానికి కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తరఫున ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని కెప్టెన్ గౌతం గంభీర్ అన్నాడు. ‘ఆ కుర్రాడు మన మధ్య లేడు. ఈ వార్తతో నేను ఎంతో చలించిపోయా. ఆ కుటుంబం వేదన తీరనిది. అయితే వారికి మేం చేయగలిగిన సాయం అంతా చేస్తాం. ఇందులో కేకేఆర్ జట్టు సభ్యులందరి భాగస్వామ్యం ఉంటుంది’ అని గంభీర్ వెల్లడించాడు.

 

మరో కుర్రాడు ఆస్పత్రిలో...

కోల్‌కతా : అంకిత్ మృతి తర్వాతి రోజు మంగళవారం కోల్‌కతాలో రాహుల్ ఘోష్ అనే యువ క్రికెటర్ మైదానంలో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీస్ ఏసీ, విజయ్ స్పోర్ట్స్ క్లబ్ జట్ల మధ్య స్థానిక లీగ్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కవర్స్ ఏరియాలోకి బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి అనూహ్యంగా బౌన్స్ కావడంతో కళ్లు మూసుకొని రాహుల్ తప్పించుకునే ప్రయత్నం చేయగా, బంతి అతని చెవి కింది భాగంలో బలంగా తాకింది. ‘సీటీ స్కాన్, ఎంఆర్‌ఐలలో ఏ రకమైన సమస్యా లేదని తేలింది. అంతర్గతంగా కూడా ఎలాంటి గాయాలు లేవు. పరిస్థితి నిలకడగానే ఉన్నా ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు. అతడిని పర్యవేక్షణ కోసం ఐసీయూలోనే ఉంచాం’ అని వైద్యులు తెలిపారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top