సింధు... కొత్త చరిత్ర

సింధు... కొత్త చరిత్ర - Sakshi


  మకావు ఓపెన్‌లో టైటిల్ సొంతం  

    వరుసగా మూడో ఏడాదీ విజేత  

    ‘హ్యాట్రిక్’ సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు


 

 స్వల్ప వ్యవధిలోనే చిరస్మరణీయ విజయాలు సాధించి... తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధు మరో అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ స్థాయిలో ఒకే టోర్నమెంట్‌ను వరుసగా మూడుసార్లు సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా ఆమె చరిత్ర సృష్టించింది. ఆదివారం ముగిసిన మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో సింధు మూడోసారి చాంపియన్‌గా నిలిచింది. 2013, 2014లోనూ ఈ టోర్నీలో విజేతగా నిలిచిన సింధు తాజా విజ యంతో ‘హ్యాట్రిక్’ సాధించింది.

 

 మకావు: అంచనాలను నిజం చేస్తూ... ఆద్యంతం అద్వితీయ ప్రదర్శనతో అలరిస్తూ... భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఎట్టకేలకు ఈ ఏడాది తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం ముగిసిన మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో ఈ హైదరాబాద్ అమ్మాయి చాంపియన్‌గా నిలి చింది. 66 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఐదో సీడ్, ప్రపంచ 12వ ర్యాంకర్ సింధు 21-9, 21-23, 21-14 తో ఆరో సీడ్ మినత్సు మితాని (జపాన్)పై విజయం సాధిం చింది.

 

  తద్వారా వరుసగా మూడో ఏడాది ఈ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో ఏ విభాగంలోనైనా ఒకే అంతర్జాతీయ టోర్నమెంట్‌ను వరుసగా మూడుసార్లు సాధించి న తొలి భారతీయ ప్లేయర్‌గా 20 ఏళ్ల అరుదైన గుర్తింపు పొందింది. గతంలో సైనా నెహ్వాల్ ఇండోనేసియా సూపర్ సిరీస్ టోర్నీలో వరుసగా నాలుగేళ్లపాటు (2009, 2010, 2011, 2012) ఫైనల్‌కు చేరుకొని మూడుసార్లు టైటిల్ సాధించింది. అయితే 2011లో సైనా రన్నరప్‌గా నిలువడంతో ఆమెకు ‘హ్యాట్రిక్’ అవకాశం చేజారింది. విజేతగా నిలిచిన సింధుకు 9000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 6 లక్షలు) లభించింది.

 

 కళ్లు చెదిరే స్మాష్‌లు...

 గాయాల సమస్య... ఆటలో నిలకడలేమి... ఇతరత్రా కారణాలతో ఈ ఏడాది అంతగా ఆకట్టుకోలేకపోయిన సింధు మకావు ఓపెన్‌లో ఎట్టకేలకు తన టైటిల్ లోటును తీర్చుకుంది. రెండుసార్లు డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సింధు మ్యాచ్ మ్యాచ్‌కూ తన ఆటతీరును మెరుగుపర్చుకొని మూడోసారి విజేతగా నిలిచింది. మినత్సు మితానితో జరిగిన ఫైనల్లో సింధు కళ్లు చెదిరే స్మాష్‌లు, నియంత్రణతో కూడిన ప్లేసింగ్ షాట్‌లు, సుదీర్ఘ ర్యాలీల్లో పైచేయి సాధించి సత్తా చాటుకుంది. తొలి గేమ్ ఆరంభంలోనే సింధు 5-1తో ముందంజ వేసి అదే జోరును కొనసాగించింది. ఒకదశలో సింధు కొట్టిన శక్తివంతమైన స్మాష్‌లకు మితాని చేతులెత్తేసింది.  

 

 రెండో గేమ్‌లో మితాని తేరుకొని సింధుకు గట్టిపోటీనిచ్చింది. ఈ గేమ్‌లో కూడా సింధు తన దూకుడును కొనసాగించగా... మితాని సంయమనంతో ఆడటంతో గేమ్ నువ్వా నేనా అన్నట్లు సాగింది. అయితే కీలకదశలో సింధు పైచేయి సాధించి విజయానికి చేరువైంది. అయితే మ్యాచ్‌ను తొందరగా ముగించాలనే తాపత్రయంలో సింధు రెండుసార్లు (20-19, 21-20) మ్యాచ్ పాయింట్లను వదులుకొని చివరకు గేమ్‌నే చేజార్చుకుంది. తొలిసారి సింధు షటిల్‌ను బయటకు పంపగా.. రెండోసారి ఆమె కొట్టిన షాట్ నెట్‌ను తాకింది. సింధు చేసిన పొరపాట్లతో మితాని రెండో గేమ్‌లో నెగ్గి ఊపిరి పీల్చుకుంది. నిర్ణాయక మూడో గేమ్‌లో సింధు నిగ్రహంతో ఆడింది. రెండో గేమ్ చివర్లో చేసిన పొరపాట్లను పునరావృతం చేయకుండా జాగ్రత్త పడింది. మూడుసార్లు వరుసగా నాలుగేసి పాయింట్లు సాధించి 14-7తో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా దూకుడుగా ఆడిన సింధు విజయాన్ని ఖాయం చేసుకుంది.

 

 సింధు కెరీర్‌లో ఇది నాలుగో గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్. 2013లో మలేసియా మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలిచిన సింధు ఆ తర్వాత మకావు ఓపెన్‌ను మూడుసార్లు సొంతం చేసుకుంది. 2011 డచ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నీలో... 2012, 2014లలో సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో... ఈ ఏడాది డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో సింధు రన్నరప్‌గా నిలిచింది. వీటితోపాటు 2013, 2014లలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు నెగ్గిన సింధు.. 2014లోనే ఉబెర్ కప్, ఆసియా క్రీడల టీమ్ ఈవెంట్స్‌లో, ఆసియా చాంపియన్‌షిప్‌లో, కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకాలను గెల్చుకుంది.

 

 రూ. 10 లక్షల నజరాన

 మకావు ఓపెన్‌లో విజేతగా నిలిచిన సింధును భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) అధ్యక్షుడు అఖిలేశ్ దాస్‌గుప్తా అభినందించారు. ఆమె విజయానికి ప్రోత్సాహకంగా రూ. 10 లక్షల నగదు పురస్కారాన్ని ప్రకటించారు. మరోవైపు పి.వి.సింధుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఘన విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

 

 ఈ విజయం ఎంతో ప్రత్యేకం

 చాలా సంతోషంగా ఉంది. ఏడాది తర్వాత నాకు దక్కిన విజయమిది. అందులోనూ ఒకే టోర్నీలో హ్యాట్రిక్ సాధించడం నా ఆనందాన్ని రెట్టింపు చేసింది. గత సంవత్సర కాలం నాకు ఏదీ కలిసి రాలేదు.  డెన్మార్క్‌లో ఫైనల్‌కు చేరుకున్నా... టైటిల్ దక్కలేదు. ఒకసారి గాయానికి గురైతే ఆ తర్వాత కోలుకొని మళ్లీ గెలుపు బాట పట్టడం అంత సులువు కాదు. నా విషయంలోనూ అదే జరిగింది. గాయం తగ్గిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఆడలేకపోయాను. తొలి రౌండ్ మహా అయితే రెండో రౌండ్... ఇలా సాగింది నా ప్రయాణం. ఒక దశలో చాలా నిరాశకు గురయ్యాను. కానీ ఇలాంటి సమయంలోనే కోచ్ గోపీచంద్, నా తల్లిదండ్రులు రమణ, విజయ అండగా నిలిచారు. గెలుపోటములు ఆటలో భాగమని, నిరుత్సాహానికి గురి కావద్దని ప్రోత్సహించారు.

 

  కష్టాల సమయంలో ఇతరత్రా కూడా చాలా మంది సహకరించారు. మా ఫిజియోల సహాయంతో పూర్తిగా కోలుకోగలిగాను. ఇలా కమ్‌బ్యాక్ చేశాను కాబట్టి నాకు మకావు విజయం చాలా ప్రత్యేకం. అచ్చి వచ్చిన ఈ చోట ప్రతీసారి గెలవాలని కోరుకుంటున్నా. టోర్నీలో జపాన్ అమ్మాయిలు నాకు గట్టి పోటీనిచ్చారు. సెమీస్ హోరాహోరీగా సాగితే, ఫైనల్ ప్రత్యర్థి కూడా అంత సులువుగా లొంగలేదు. ఇప్పుడు ఫిట్‌నెస్ పరంగా ఎలాంటి సమస్యలు లేవు. ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. వచ్చే వారం ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీలోనూ కూడా ఇదే జోరు కొనసాగించాలని పట్టుదలగా ఉన్నా. ఆ తర్వాత జరిగే ఐబీఎల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. గత ఏడాది టోర్నీ జరగకపోవడం నిరాశ కలిగించింది. అయితే ఇప్పుడు మళ్లీ అవకాశం రావడం సంతోషించదగ్గ విషయం.      -‘సాక్షి’తో పీవీ సింధు

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top