నా ఎంపిక షాక్ కు గురిచేసింది! | Sakshi
Sakshi News home page

నా ఎంపిక షాక్ కు గురిచేసింది!

Published Wed, Sep 28 2016 4:39 PM

నా ఎంపిక షాక్ కు గురిచేసింది!

టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గౌతమ్ గంభీర్ భారత జట్టు తరఫున టెస్టు ఆడి రెండేళ్లు దాటిపోయింది. అయినా సరే మరోసారి అతడిపై పూర్తి నమ్మకంతో జట్టులోకి ఆహ్వానించారు. దేశవాళీ లీగ్ క్రికెట్‌లో ఈ సీనియర్ ప్లేయర్ ఫామ్‌ను చూసి జట్టులోకి ఆహ్వానించారా.. లేక  అతడికి వీడ్కోలు మ్యాచ్ లకు ముందే సిద్ధం చేస్తున్నారా అనే సందేహాలు తలెత్తకమానదు. ఏది ఏమైతేనేం.. న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టు సందర్భంగా గాయపడిన లోకేశ్ రాహుల్ స్థానంలో గౌతమ్ గంభీర్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది.

జట్టులో స్థానం కోల్పోయి మళ్లీ చోటు దక్కించుకున్న ఎందరో వెటరన్ ఆటగాళ్ల తరహాలోనే తన ఎంపికపై గంభీర్ హర్షం వ్యక్తంచేశాడు. తొలి టెస్టు ఆడే కుర్రాడు ఎలా ఉంటాడో.. ఆ బ్యాట్స్ మన్ ఏ విధంగా ఫీలవుతాడో.. తాను కూడా ప్రస్తుతం అలాంటి స్థితిలో ఉన్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తన ఎంపికపై షాక్ తో పాటు ఎంతో ఒత్తిడికి గురైన అనుభూతిని పొందినట్లు గౌతీ పోస్ట్ లో పేర్కొన్నాడు. ఎన్నో ఆశలతో మళ్లీ జట్టులోకి వస్తున్నాను. దేశం తరఫున ఆడటంతో ఏ వ్యక్తిని ఎవరూ అడ్డుకోలేరు. టెస్ట్ క్రికెట్, రెడ్ బాల్, భారత్ క్యాప్ మళ్లీ తాను ధరించబోతున్నందుకు బీసీసీఐకి, తనకు అండగా నిలిచిన సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు. శుక్రవారం నుంచి రెండో టెస్టు జరిగే కోల్‌కతాలో గంభీర్ జట్టుతో పాటు చేరతాడన్న విషయం తెలిసిందే. తొలి టెస్టులో కివీస్ పై భారత్ ఘనవిజయం సాధించి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

Advertisement
Advertisement