ప్లీజ్... జర జాగ్రత్త!

ప్లీజ్... జర జాగ్రత్త!


ఆట ఆహ్లాదాన్ని పంచాలి. ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అంతేగానీ విషాదాన్ని నింపకూడదు. ప్రాణాలు చాలా విలువైనవి. ఇవన్నీ పిల్లలకి తెలియదు. క్రికెట్ మత్తులో ఊగిపోతూ మిట్టమధ్యాహ్నం సూర్యుడు నిప్పులు చెరుగుతున్నా ఆడుతూనే ఉంటారు. ఆట ఇచ్చే ‘కిక్’ కోసం ఎన్ని సాహసాలైనా చేస్తారు.

 

 ఆ సంతోషంలో జాగ్రత్తలు మరచి పోతారు. కానీ పెద్దలుగా మనం జాగ్రత్తగా ఉందాం.  వేసవి సెలవులు అంటే ఆటల సమయం... అందులోనూ ఎంత చిన్న పిల్లలైనా ఐపీఎల్ ప్రభావం ఉంటూనే ఉంటోంది. చలో క్రికెట్ మైదాన్ అన్నట్లుగా ఉంది పరిస్థితి. కాబట్టి పిల్లలని ఆటలకు భద్రంగా పంపుదాం.

 

 ప్రతి ఒక్కరూ పదహారేళ్లకే సచిన్‌లా సెంచరీలు కొట్టలేరు. నిజానికి క్రికెటర్ అవ్వాలంటే చిన్నప్పుడే బ్యాట్ పట్టుకుని పరిగెత్తాల్సిన అవసరం లేదు. కాస్త ఆలస్యంగా ఆరంభించినా క్రమపద్ధతిలో శిక్షణ పొందితే చాలు. సచిన్ కూడా 12 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్‌గా బరిలోకి దిగే ముందు వరకు కూడా కోచ్ మార్గదర్శనంలోనే ఆటకు మెరుగులు దిద్దుకున్నాడు. అయితే క్రికెటర్ అవ్వాలనే లక్ష్యం ఒక్కటే ఆట ఆడించదు.

 

 

 గ్రామాల్లో బీళ్లలో, పట్టణాల్లో రోడ్ల మీద, నగరాల్లో గల్లీల్లో నిరంతరం క్రికెట్ నడుస్తూనే ఉంటుంది. ఎండా, వానా తేడా లేకుండా ఆడుతూనే ఉంటారు. ఏ స్థాయిలో ఎక్కడ క్రికెట్ ఆడినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఏం జరుగుతోంది...:  వేసవి సెలవుల్లో హైదరాబాద్‌లాంటి మహా నగరంలో లెక్కపెట్టలేనన్ని సంఖ్యలో సమ్మర్ క్రికెట్ క్యాంప్‌లు ప్రారంభమైపోతాయి.

 

 వేళ్ల మీద లెక్క పెట్టగలిగే కేంద్రాల్లో తప్ప ఎక్కువ భాగం పెద్దగా నియంత్రణ లేకుండా, వ్యక్తిగత శ్రద్ధ చూపించకుండా సాగేవే ఉంటాయి. ఆట సంగతి కాస్త పక్కన పెడితే పిల్లలకు ‘బేసిక్ ప్రొటెక్షన్’ విషయంలో కూడా అక్కడి కోచ్‌లు పెద్దగా పట్టింపు లేకుండా ఉంటారు. పిల్లలు ఎలాంటి కిట్‌లు తెస్తున్నారు, అవి ఎంత వరకు సురక్షితం అనే విషయం పట్టించుకోరు. ఏదో ప్రమాదం జరిగితే తప్ప దానిపై దృష్టి ఉండదు.  ఈ విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

 

 పెద్ద ఖర్చేం కాదు...: సాధారణంగా సమ్మర్ క్యాంప్ తర్వాత చాలా మంది ఆటకు రాకుండా మళ్లీ తమ చదువుల్లో మునిగిపోతారు. కాబట్టి మామూలు కిట్ ఇస్తే మేం నడిపించేస్తాం అని చెప్పి నాసిరకం వాటిపై దృష్టి పెడతారు. ఇది సరైంది కాదు. దీని వల్ల కోరి ప్రమాదాన్ని తెచ్చుకోవడమే. నిజానికి చాలా శిక్షణ కేంద్రాల్లో చిన్నారులు అవగాహనారాహిత్యం కారణంగానో, సరైన మార్గదర్శనం లేకనో బాగానే దెబ్బలు తగిలించుకుంటున్నారు. కానీ వార్తల్లోకి అన్నీ ఎక్కవు కాబట్టి వాటి తీవ్రత ఎవరికీ తెలియడం లేదు.

 

  నాణ్యత గల క్రికెట్ కిట్ ధర మరీ ఎక్కువగా కూడా ఏమీ ఉండదు. కనీసం రూ. 450 నుంచి మంచి హెల్మెట్‌లు లభిస్తాయి. చెస్ట్ గార్డ్, ప్యాడ్‌లు, గ్లవ్‌లు, థై ప్యాడ్, ఆర్మ్ గార్డ్, అబ్డామన్ గార్డ్... ఇలా అన్నీ కలిపినా మొత్తం కిట్ రూ. 3 వేలు దాటదు.  పిల్లలను ప్రమాదాల నుంచి తప్పించేందుకు ఈపాటి విలువ పెద్దది కాదేమో! ఏం చేయాలి...: చిన్న పిల్లలు 7-8 ఏళ్ల వయసు వచ్చే వరకు రబ్బర్ బంతితో క్రికెట్ ఆడుకోవడం మంచిది.

 

 ఈ వయసులో గ్రేస్‌బాల్‌తో, కార్క్ బాల్‌తో ఆడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మాత్రం సరైన రక్షణ సామగ్రి లేకుండా ఆడరాదు. ఈ మధ్య క్రికెట్‌లో ప్రయోగాలు ఎక్కువయ్యాయి. మ్యాక్స్‌వెల్ రివర్స్ స్వీప్ కొట్టాడని... మన గల్లీల్లో పిల్లలు కూడా అవే షాట్లు ఆడుతున్నారు. సరైన ప్రాక్టీస్ లేకుండా  చిన్నప్పుడే అలాంటి ప్రయోగాత్మక షాట్లు ఆడకపోవడం నయం. ఇటీవల క్రికెట్‌లో తరచూ విషాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాల నుంచి మన  పిల్లలను రక్షించుకోవచ్చు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top