ఢిల్లీ ‘పంతం’ నెగ్గింది

ఢిల్లీ ‘పంతం’ నెగ్గింది - Sakshi


వయసు 18 ఏళ్లు... అనుభవం రెండే ఐపీఎల్ మ్యాచ్‌లు... అయినా ఏ మాత్రం తడబాటు లేదు... భారత క్రికెట్‌కు ఐపీఎల్ ద్వారా లభించిన మరో ఆణిముత్యంలా... రిషబ్ పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. తన సంచలన స్ట్రోక్స్‌తో గుజరాత్‌పై ఢిల్లీకి ఘన విజయాన్ని అందించాడు.

 

* గుజరాత్‌పై డేర్‌డెవిల్స్ ప్రతీకారం

* 8 వికెట్లతో ఘన విజయం

* రాణించిన రిషబ్, డికాక్


రాజ్‌కోట్: సరిగ్గా వారం క్రితం హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ అద్భుతంగా పోరాడినా గుజరాత్ లయన్స్ చేతిలో ఓడిపోయింది. కానీ ఈసారి మాత్రం ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా డేర్‌డెవిల్స్ చెలరేగిపోయారు. బౌలర్ల సమష్టి కృషికి న్యాయం చేస్తూ... ఓపెనర్లు రిషబ్ పంత్ (40 బంతుల్లో 69; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), డికాక్ (45 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్సర్) చెలరేగడంతో ఢిల్లీ ఎనిమిది వికెట్లతో గుజరాత్ లయన్స్‌ను ఓడించింది.

 

సౌరాష్ట్ర క్రికెట్ సంఘం స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకోగా... గుజరాత్ లయన్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేసింది. ఫామ్‌లో ఉన్న విదేశీ స్టార్స్ డ్వేన్ స్మిత్ (15), మెకల్లమ్ (1), ఫించ్ (5) విఫలం కావడంతో నాలుగు ఓవర్లలోపే మూడు ప్రధాన వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రైనా (20 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్సర్) అండతో దినేశ్ కార్తీక్ (43 బంతుల్లో 53; 5 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను సరిదిద్దాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. కార్తీక్, జడేజా (26 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్సర్) కలిసి ఐదో వికెట్‌కు 52 పరుగులు జతచేయడంతో గుజరాత్‌కు ఓ మాదిరి స్కోరు వచ్చింది. నదీమ్ రెండు వికెట్లు తీయగా... జహీర్, మోరిస్, షమీ, మిశ్రా ఒక్కో వికెట్ పడగొట్టారు.

 

ఢిల్లీ డేర్‌డెవిల్స్ 17.2 ఓవర్లలో రెండు వికెట్లకు 150 పరుగులు చేసి మరో 16 బంతులు మిగిలుండగానే గెలిచింది. పంత్, డికాక్ తొలి వికెట్‌కు 13.3 ఓవర్లలో 115 పరుగులు జోడించారు. కేవలం 25 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసిన పంత్... ఇన్నింగ్స్ ఆద్యంతం ఆకట్టుకునే షాట్లు ఆడాడు. ఇన్నింగ్స్‌కు యాంకర్ పాత్ర పోషించిన డికాక్ కొద్దిలో అర్ధసెంచ రీని కోల్పోయాడు. ఆరు పరుగుల వ్యవధిలో ఓపెనర్లు అవుటైనా... శామ్సన్ (13 బంతుల్లో 19 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్), డుమిని (7 బంతుల్లో 13 నాటౌట్; 2 ఫోర్లు) కలిసి లాంఛనాన్ని పూర్తి చేశారు.

 

స్కోరు వివరాలు:-

గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ (సి) మోరిస్ (బి) నదీమ్ 15; మెకల్లమ్ (బి) జహీర్ 1; ఫించ్ (సి) పంత్ (బి) నదీమ్ 5; రైనా (స్టం) డికాక్ (బి) మిశ్రా 24; దినేశ్ కార్తీక్ (బి) షమీ 53; రవీంద్ర జడేజా నాటౌట్ 36; ఫాల్క్‌నర్ (బి) మోరిస్ 7; ఇషాన్ కిషన్ రనౌట్ 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఏడు వికెట్లకు) 149.

వికెట్ల పతనం: 1-17; 2-17; 3-24; 4-75; 5-127; 6-138; 7-149.

బౌలింగ్: నదీమ్ 3-0-23-2; మోరిస్ 4-0-32-1; జహీర్ 4-0-27-1; షమీ 4-0-31-1; అమిత్ మిశ్రా 3-0-19-1; డుమిని 2-0-14-0.

 

ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) స్మిత్ (బి) కౌశిక్ 46; రిషబ్ పంత్ (సి) కార్తీక్ (బి) జడేజా 69; సంజు శామ్సన్ నాటౌట్ 19; డుమిని నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (17.2 ఓవర్లలో 2 వికెట్లకు) 150.  వికెట్ల పతనం: 1-115; 2-121.

బౌలింగ్: ప్రవీణ్ 2-0-20-0; ధావల్ 2-0-24-0; రైనా 4-0-34-0; కౌశిక్ 4-0-29-1; డ్వేన్ స్మిత్ 2-0-12-0; ఫాల్క్‌నర్ 1-0-9-0; జడేజా 2.2-0-21-1.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top