స్మృతి-ప్రియాంక డిష్షుం, డిష్షుం! | Sakshi
Sakshi News home page

స్మృతి-ప్రియాంక డిష్షుం, డిష్షుం!

Published Mon, May 23 2016 11:58 AM

స్మృతి-ప్రియాంక డిష్షుం, డిష్షుం!

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోమవారం ఉదయం ట్విట్టర్‌ దుమ్ముదులిపారు. వస్తూవస్తూనే రాహుల్‌గాంధీపై  పదునైన వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడ్డారు. దీనికి దీటుగా అటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది బదులిచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరి వాడీవేడి విమర్శలు, వాగ్వాదాలతో ట్విట్టర్‌ వేడెక్కింది.

తనపై నిర్భయ తరహాలో అత్యాచారం చేస్తామంటూ సోషల్‌ మీడియాలో బెదిరింపులు వచ్చినట్టు తాజాగా రాసిన ఓ వ్యాసంలో ప్రియాంక చతుర్వేది పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆమె రాసిన వ్యాసం ట్విట్టర్‌లో ట్రెండ్‌ అయింది. ఈ నేపథ్యంలో ప్రియాంకపై దాడి చేస్తే అది మహిళల గౌరవంపై దాడి, అదే స్మృతి ఇరానీపై దాడి చేస్తే ఆమోదయోగ్యమా? అంటూ షెఫాలి వైద్య ట్విట్టర్‌లో ప్రశ్నించారు. దీంతో ప్రియాంక జోక్యం చేసుకొని తనకు ఎలాంటి సెక్యూరిటీ లేదని, కానీ స్మృతికి జెడ్‌ కేటగిరీ భద్రత ఉందని అన్నారు.

దీనికి స్మృతి ఇరానీ స్పందిస్తూ.. తనకు జెడ్‌ కేటగిరీ భద్రత లేదని వివరణ ఇచ్చారు. దీంతో ఈ ఇద్దరి మధ్య ట్విట్టర్‌లో తీవ్ర వాగ్వాదమే నడిపించింది. మీకు జెడ్‌ కేటగిరీ భద్రత లేకపోయినా అసలు సెక్యూరిటీ లేకుండా ఉండదు కదా అని ప్రియాంక పేర్కొనగా.. నా భద్రత గురించి ఎందుకు ఆరా తీస్తున్నావు? ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? అని స్మృతి వ్యంగ్యంగా ప్రశ్నించారు. దానికి ప్రియాంక బదులిస్తూ.. నాకు అంత తీరిక లేదు. మీరేం భయపడకండి. ఎప్పటిలాగే క్యాంపస్‌లలో రచ్చ చేయడంపై దృష్టి పెట్టండని చురకలంటించారు. స్మృతి కౌంటర్‌ ఇస్తూ అది మీ రాహుల్‌గాంధీ విశిష్టత. అసోంలో ఓడిపోవడం కూడా ఆయన ఘనతేనంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రియాంక బదులిస్తూ మీరు ఓడిపోయినప్పటికీ క్యాబినెట్‌ మంత్రి కాలేదా అని కౌంటర్‌ ఇచ్చారు. ఈ మొత్తానికి ఈ వాగ్వాదం ట్విట్టర్‌ను కాసేపు వేడెక్కించింది.

Advertisement
Advertisement