ముంబయ్ అత్తవారిల్లు... తమిళనాడు పుట్టినిల్లు - శ్రీదేవి

ముంబయ్ అత్తవారిల్లు... తమిళనాడు పుట్టినిల్లు - శ్రీదేవి


 ‘‘చాలా ఏళ్ల తర్వాత తమిళంలో చే స్తున్న సినిమా ఇది.  ముంబయ్ నా అత్తవారిల్లు అయితే.. తమిళనాడు నా పుట్టినిల్లు. విజయ్ చాలా అంకితభావం ఉన్న నటుడు. ఓ మంచి టీమ్‌తో వర్క్ చేసిన ఫీలింగ్ కలిగింది’’ అని సీనియర్ నటి శ్రీదేవి అన్నారు. విజయ్, శ్రుతీహాసన్, హన్సిక నాయకా నాయికలుగా శ్రీదేవి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘పులి’.

 

 శింబుదేవన్ దర్శకత్వంలో ఎస్.కె.టి స్టూడియోస్ పతాకంపై శిబు తమీన్స్, పి.టి. సెల్వకుమార్ తమిళంలో నిర్మించిన ఈ చిత్రాన్ని ఎస్వీఆర్ మీడియా పతాకంపై సి.జె. శోభ తెలుగులో విడుదల చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక ఆదివారం చెన్నైలో జరిగింది. హీరో విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్, ఆయన  సతీమణి సంగీతా విజయ్ పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ -‘‘నాకు చాలా కాలంగా చారిత్రక నేపథ్యంలో కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా ఓ సినిమా చేయాలని కోరిక ఉండేది.

 

 ‘పులి’ చిత్రంతో అది కాస్తా తీరిపోయింది. శ్రుతీహాసన్, హన్సిక ఇద్దరూ పోటీపడి నటించారు. సీనియర్ నటి శ్రీదేవి గారు నా సినిమాలో నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ కథ వినగానే వెంటనే చేయడానికి అంగీకరించడం విశేషం. పరీక్ష రాశాం. రిజల్ట్ ప్రేక్షకుల చేతిలో ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కథానాయికలు శ్రుతీహాసన్, హన్సిక, తమిళ గీత రచయిత వైరముత్తు, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top