నోరెళ్లబెట్టించే సంఘటనలు..


ఎన్నో వింతలకు నిలయం ఈ ప్రపంచం.

 ఎన్నో కథలు.. నమ్మాల్సినవి, నమ్మరానివీ!

 అయితే, అతికొద్ది కథలు మాత్రమే నమ్మశక్యం కానివిగా

 ఉంటూ నమ్మితీరాల్సిందే అనిపిస్తాయి.

 యాదృచ్ఛికమో, ఉద్దేశపూర్వకమో కానీ

 చరిత్రలోని కొన్ని సంఘటనలు నోరెళ్లబెట్టిస్తాయి.

 వాటిలో కొన్నిటిని మనమూ తెలుసుకుందాం..

 ఆశ్చర్యపోదాం! ఊ.. కొడతారా? కొట్టి పారేస్తారా??

 

 రాజు.. రెస్టారెంట్ ఓనర్!

 పద్దెనిమిదో శతాబ్దానికి చెందిన సంఘటన ఇది. ఇటలీ రాజైన ఒకటో ఉంబెర్టో విహారానికి వెళ్లాడు. అందులో భాగంగా జనరల్ ఎమ్మిలో పొంజియా వాగ్లియాతో కలిసి మోంజా నగరానికి చేరుకున్నాడు. స్థానిక రెస్టారెంట్లోకి ప్రవేశించిన రాజుకి సాదర స్వాగతం పలికాడు దాని యజమాని. మహారాజుకి ఏమేం ఇష్టమో తెలుసుకుని వాటిని తయారుచేయాల్సిందిగా సిబ్బందిని ఆదేశించాడు.


మరోవైపు, రెస్టారెంట్ యజమానిని చూసినప్పటినుంచీ రాజు మదిలో ఏదో మెదులుతోంది. దీనికి కారణం అతడు అచ్చు గుద్దినట్టు రాజు ఉంబెర్టోలా ఉండటమే! తొలుత సంశయించిన రాజు.. కొద్దిసేపటికి తన మనసులోని మాటను బయటపెట్టాడు. 'మీరు కాస్త అటుఇటుగా నాలాగే కనిపిస్తున్నారే!' అన్నాడు. దీంతో ఇద్దరి మధ్యా ముచ్చట ప్రారంభమైంది. ఇందులో రాజుకి దిమ్మదిరిగిపోయే నిజాలు తెలిశాయి. 1844 మార్చి 14నే ఇద్దరూ జన్మించారు. అది కూడా ఒకే నగరంలో! మార్గరీటా అనే పేరున్న మహిళలనే వీరు వివాహమాడారు. ఆసక్తికరంగా.. రాజు పట్టాభిషిక్తుడైన రోజు, యజమాని రెస్టారెంట్ తెరచిన రోజు కూడా ఒక్కటే!


ఈ సంఘటన తర్వాత రాజు తరచూ ఆయన గురించి వాకబు చేస్తూ ఉండేవారు. అలా, 1990 జూలై 29 సాయంత్రం రాజుకి ఎవరో వచ్చి రెస్టారెంట్ యజమాని కొద్దిసేపటి క్రితమే మరణించాడని చెప్పారు. ఇది విన్న రాజు ఎంతగానో బాధ పడ్డాడు. అయితే, విచార కరంగా అదే రోజున ఆయన కూడా హత్యకు గురయ్యాడు. గేటానో బ్రెస్కి అనే వ్యక్తి ఉంబెర్టోను నాలుగు రౌండ్లు కాల్చి చంపాడు. ఇలా ఒకే రోజు మొదలైన వీరిద్దరి జీవితాలు.. అనేక సారూప్యతలతో ఒకే రోజున ముగిశాయి.

 

హోటల్ రహస్యం..!

 1953 నాటి సంఘటన.. ఓ వార్తాపత్రికలో రిపోర్టర్‌గా పనిచేసే ‘ఇర్వ్ కుప్‌సినెట్’ బ్రిటన్ మహారాణి రెండో ఎలిజబెత్ పట్టాభిషేకాన్ని కవర్ చేసేందుకు లండన్ చేరుకున్నాడు. నగరంలోని థేమ్స్ నది ఒడ్డున ఉన్న సావోయ్ హోటల్‌లో బసచేసేందుకు నిర్ణయించుకున్నాడు. అత్యంత విలాసవంతమైన ఆ హోటల్‌లో ఓ గదిని ఆయనకు కేటాయించారు సిబ్బంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న ఇర్వ్.. ఊసుపోక తన మంచం పక్కనే ఉన్న టేబుల్ సొరుగులను తెరిచాడు. అందులో కొన్ని వస్తువులున్నాయి. వాటిని పరిశీలించి చూశాడు. ‘హ్యారీ హానిన్’ అనే పేరు రాసి ఉంది వాటిపై! దీంతో ఇర్వ్‌కు ఆ వస్తువులు ఆసక్తికరంగా తోచాయి. ప్రఖ్యాత బాస్కెట్‌బాల్ క్లబ్ హార్లెమ్ గ్లోబ్‌ట్రాటర్స్ క్రీడాకారుడు హ్యారీ హానిన్ పేరు అది. ఇతడు ఇర్వ్‌కు మంచి స్నేహితుడు కూడా!




 రెండు రోజులు గడిచాయి. ఈ సంఘటన అతని మెదడును తొలిచేస్తోంది. వెంటనే హ్యారీకి కాల్ చేశాడు. ‘హాయ్ హ్యారీ! నువ్వెప్పుడైనా సావోయ్ హోటల్‌లో బస చేశావా?’ అని అడిగాడు. దీనికి అవుననే సమాధానం వచ్చింది అటువైపు నుంచి. ఇక, ఇర్వ్ విషయం చెబుదామనుకునే లోపు హ్యారీ నుంచి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ‘‘ఇర్వ్.. నువ్వెప్పుడైనా ప్యారిస్‌లోని లీ మ్యూరైస్ హోటల్‌లో బస చేశావా?’’ అన్నదే ఆ ప్రశ్న. అంతటితో ఆగక.. అక్కడి గదిలో ఇర్వ్ కుప్‌సినెట్ పేరుతో కొన్ని వస్తువులను తాను చూశానని, అందుకే అలా అడగాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నాడు హ్యారీ. దీంతో ఇర్వ్‌కు దిమ్మదిరిగింది! ‘మిస్టరీస్ ఆఫ్ అనెక్స్‌ప్లెయిన్డ్’ పుస్తకంలో ఈ యదార్థ గాథ ప్రచురితమైంది.

 



 

ప్యారిస్‌లో దొరికింది!

ఈ యాదృచ్ఛిక సంఘటన 1920లో జరిగింది. అమెరికా రచయిత్రి అన్నే పార్రిష్ తన భర్తతో కలిసి విహారయాత్రకు ప్యారిస్ వెళ్లారు. అక్కడి పుస్తక విక్రయ కేంద్రాలు వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. వెంటనే ఇద్దరూ వాటిలోకి చొరబడ్డారు. పుస్తకాల పురుగులైన ఈ భార్యాభర్తలు మంచి పుస్తకం కోసం వెదుకులాటలో భాగంగా చివరికి ఓ షాపులో ఆగారు. అందులో అన్నేకు ఓ పుస్తకం దొరికింది. 'జాక్ ఫ్రాస్ట్ అండ్ అదర్ స్టోరీస్' అనే ఆ పుస్తకాన్ని చూడగానే ఆమెకు ఎక్కడలేని సంతోషం కలిగింది. అన్నేకు అత్యంత ఇష్టమైన కథల పుస్తకం అది. అంతేకాదు.., జాక్ ఫ్రాస్ట్ కాపీని చిన్నతనంలో ఆమెకు తల్లిదండ్రులు బహుమతిగా ఇచ్చారు. ఈ పుస్తకంతో తనకు ఎంతో అనుబంధం ఉంది. వాటన్నిటీ గుర్తుకు తెచ్చుకున్న అన్నే.. ఆనంద బాష్పాలు రాలుస్తూ భర్తకు విషయమంతా చెప్పింది. జాక్ ఫ్రాస్ట్‌లో అంత సీనుందా అన్నట్టు ఫేసు పెట్టిన ఆయన పుస్తకాన్ని తెరిచాడు. అంతే.. మరో ఆశ్చర్యం. లోపలి పేజీల్లో 'అన్నే పార్రిష్, 209 ఎన్ వెబర్ స్ట్రీట్, కొలరాడో స్ప్రింగ్స్' అని రాసి ఉంది. అది కూడా అన్నే చేతిరాతతోనే! పదుల ఏళ్ల క్రితం అమెరికాలో పోగొట్టుకున్న పుస్తకం ప్యారిస్‌లో తేలి, మళ్లీ తన చేతికే చిక్కడాన్ని ఈ అమెరికన్ రచయిత్రి చాలా కాలం పాటు నమ్మలేకపోయింది!!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top