హిందూ ధార్మిక వ్యవస్థల రక్షణకు కొత్త చట్టాలు తేవాలి

హిందూ ధార్మిక వ్యవస్థల రక్షణకు కొత్త చట్టాలు తేవాలి


శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి డిమాండ్

సాక్షి, న్యూఢిల్లీ: హిందూ ధర్మానికి ఆటంకం కలగకుండా ఆచారాలను, సంప్రదాయాలను కాపాడడానికి ప్రస్తుతం సెక్యులర్ పరంగా చట్ట సవరణ అవసరమని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. రుషికేష్‌లోని శారదా పీఠంలో నిర్వహించబోయే 21వ చాతుర్మాస దీక్షలో పాల్గొనడానికి బయలుదేరిన ఆయన శనివారం ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ను కలిశారు.



ఏపీలో దేవాలయ భూముల అన్యాక్రాంతం, రామజన్మ భూమి, గోవధ తదితర విషయాలపై చర్చించారు. ఏపీలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ భూములను లీజు పేరిట తెలుగుదేశం ప్రభుత్వం ఇతర మతాలకు చెందిన వారికి, ఆగమాలకు విరుద్ధంగా ఉన్న కొన్ని సంస్థలకు కట్టబెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  దేశంలో సెక్యులర్ పేరిట, ఇతర మతాల ప్రభావంతో హిందూ ధర్మ వ్యవస్థపై అధికారం చెయ్యడానికి ప్రయత్నిస్తూ పీఠాధిపతులు, మఠాధిపతులపై కుట్ర జరుగుతోందన్నారు. నాస్తిక వాదంతో కొందరు దేవాలయ వ్యవస్థలో జోక్యం చేసుకుంటూ సంప్రదాయాలను, ఆచారాలను మంట కలుపుతున్నారని స్వామి చెప్పారు.



హిందూ సంప్రదాయాలను, ఆచారాలను కాపాడడానికి చట్ట సవరణకు బీజేపీ సహకారం కోసం రాం మాధవ్‌ను కలసినట్లు ఆయన తెలిపారు. గోవధలను నివారించడానికి, సెక్యులర్ పేరిట కొన్ని ప్రభుత్వాలు చేస్తున్న అరాచకాలను అరికట్టడానికి చట్టాన్ని సవరించాల్సిన అవసరముందన్నారు. త్వరలోనే ప్రధాని, రాష్ట్రపతిలను కలిసి హిందూ ధర్మ, ధార్మిక వ్యవస్థలను కాపాడడానికి కొత్త చట్టాలు తేవాలని కోరనున్నట్లు స్వామి తెలిపారు. హైందవ సనాతన ధర్మ సంస్థలను, వ్యవస్థలను కాపాడడానికి బీజేపీ ప్రభుత్వం సహకరిస్తుందని రాం మాధవ్ చెప్పారు. స్వామి చెప్పిన విషయాలను ప్రధాని తదితర పెద్దలతో మాట్లాడి పరిష్కారం చూపుతామన్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top