ప్రతిష్టాత్మకంగా రాహుల్‌ సభ

ప్రతిష్టాత్మకంగా రాహుల్‌ సభ - Sakshi


- టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపు

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడతాం

- పార్టీ శ్రేణుల్లో విశ్వాసం పెంచడానికి ప్రజాగర్జన

- పీసీసీ అనుబంధ సంఘాలు, జిల్లాల నేతలతో భేటీ




సాక్షి, హైదరాబాద్‌: మూడేళ్ల కాలంలో కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అనుసరించిన ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో పాటు పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని పెంచడానికి సంగారెడ్డిలో నిర్వహించబోయే తెలంగాణ ప్రజాగర్జనను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని టీపీసీసీ చీఫ్‌ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. పీసీసీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, పలు జిల్లాల పార్టీ ముఖ్యులతో గాంధీభవన్‌లో మంగళవారం వేర్వేరుగా సమావేశమయ్యారు. ఏఐసీసీ కార్యదర్శి రామచంద్ర కుంతియాతో పాటు పలువురు ముఖ్యనేతలు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు, విధానాలపై సంగారెడ్డిలో జరిగే సభలో చార్జిషీట్‌ ప్రకటిస్తామన్నారు.



ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలైన నల్లధనం తెప్పిస్తామని, ఉద్యోగాలను ఇస్తామని, ఉపాధి కల్పిస్తామని, ధరలను నియంత్రిస్తామని, నోట్ల రద్దు, కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ముగాయడం, రైతులపై నిర్లక్ష్యం, ఆత్మహత్యలు వంటి అంశాలను ప్రజల్లో ఎండగడతామని చెప్పారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక విధానాలు, రైతుల ఆత్మహత్యలు, రైతులకు బేడీలు వేయడం, మద్దతుధర ఇవ్వకపోవడం, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు, కేజీ టు పీజీ ఉచిత విద్య, నిరుద్యోగం, ఫీజుల రీయింబర్స్‌మెంటు, ధర్నాచౌక్‌ వంటి అంశాలపై బహిరంగ సభలో ప్రజల ముందు పెడతామని ఉత్తమ్‌ చెప్పారు.



కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు రెండు లక్షల రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ. మూడు వేల భృతి, పంటలకు మద్దతు ధర, లక్షన్నర ఉద్యోగాలను వెంటనే చేపడతామన్నారు. సంగారెడ్డి వేదిక కాంగ్రెస్‌ పార్టీకి ఎంతో సెంటిమెంట్‌ ఉన్న ప్రాంతమని, ఇందిరాగాంధీ ఈ ప్రాంతంలో సమావేశం నిర్వహిస్తే కాంగ్రెస్‌ పార్టీ బలోపేతమైందని, తిరుగు లేకుండా అధికారంలో ఉందని చెప్పారు. సమావేశంలో అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎం.కోదండరెడ్డి, చిత్తరంజన్‌ దాస్, ఆరేపల్లి మోహన్, అనిల్‌కుమార్‌యాదవ్, నేరేళ్ల శారద, కె.జనార్దన్‌రెడ్డి, ఫకృద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.



మహిళల రిజర్వేషన్లకు మద్దతు

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల చట్టం తీసుకురావడానికి కాంగ్రెస్‌ సంపూర్ణ మద్దతునిస్తుందని ఉత్తమ్‌ ప్రకటించారు. చట్టసభలలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కావాలంటూ టీపీసీసీ మహిళా విభాగం మంగళవారం ప్రారంభించిన సంతకాల సేకరణలో ఉత్తమ్, కుంతియా తదితరులు సంతకాలు చేశారు.



నియోజకవర్గాలవారీగా సమావేశాలు

సంగారెడ్డిలో జరగనున్న సమావేశానికి ఏర్పాట్లు, జనసమీకరణపై నియోజకవర్గ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించుకోవాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  సూచించారు. రంగారెడ్డి, మహబూబ్‌ నగర్, హైదరాబాద్‌ జిల్లాల ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని ప్రతీ పల్లె నుంచి పది మంది తప్పకుండా సమావేశానికి వచ్చేలా చూడాలని, పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలని సూచించారు. ఈ నెల 25న జిల్లాల్లో, 27న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సభలను నిర్వహించాలని ఆయన ఆదేశించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top