'టీడీపీ' దౌర్జన్యంపై స్పందించిన హైకోర్టు

'టీడీపీ' దౌర్జన్యంపై స్పందించిన హైకోర్టు - Sakshi


హైదరాబాద్: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి బాలసుబ్రహ్మణ్యంపై టీడీపీ నేతల దౌర్జన్యంపై హైకోర్టు స్పందించింది. విజయవాడ ఆర్టీఏ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం‌, ఆయన గన్‌మెన్ దశరథపై టీడీపీ ఎంపీ, కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు దాడి కేసును హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. 'ఐపీఎస్‌పై గుండాగిరి' అని ప్రచురితమైన సాక్షి కథనాన్ని పిల్‌గా కోర్టు స్వీకరించింది. వచ్చే మంగళవారం ఈ కేసును ధర్మాసనం విచారణ జరపనుంది.



'నువ్వు గడ్డి తింటున్నావు. గడ్డి తిని ఇతర రాష్ట్రాలకు చెందిన అక్రమ బస్సులను నడిపి స్తున్నావు. ఎంపీని నేను ఆఫీసుకు వస్తుంటే వెళ్లిపోతున్నావా?... ప్రజాప్రతినిధి అంటే నీకు లెక్కలేదా? నీ సంగతి తేలుస్తా' అని విజయవాడ టీడీపీ ఎంపీ, కేశినేని ట్రావెల్స్‌ అధినేత కేశినేని శ్రీనివాస్‌(నాని) రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి బాల సుబ్రహ్మణ్యంపై విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. అదే సమయంలో 'ఏం నీకు కొమ్ములొచ్చాయా...? పై నుంచి దిగివచ్చావా..? ఏం బతుకు నీది?' అంటూ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కమిషనర్‌ను తూలనాడుతూ చిందులు తొక్కడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.



కేశినేని నాని, బొండా ఉమా, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, పోలీస్‌ హౌసింగ్‌బోర్డు చైర్మన్‌ నాగుల్‌ మీరా, విజయవాడ మేయర్‌ కోనేరు శ్రీధర్‌ దాదాపు 200 మంది కార్యకర్తలతో కలసి కమిషనర్‌ను విజయవాడ నడిరోడ్డుపై దిగ్బంధించారు. సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిని దాదాపు రెండు గంటలపాటు నిలబెట్టిమరీ దుర్భాషలాడుతూ తీవ్రంగా అవమానించారు. ఐపీఎస్ అధికారిపై గత నెలలో జరిగిన ఈ దాడి ఘటనను హైకోర్టు సీరియస్‌గా పరిగణించింది. సాక్షి కథనాన్ని పిల్‌గా స్వీకరించిన హైకోర్టు వచ్చే మంగళవారం ఈ కేసుపై విచారణ చేపట్టనుంది.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top