'గోమాంసమేకాదు.. గోపూజనూ అనుమతించం' | haven't gave permission to conduct beef festiwal, osmania university officials | Sakshi
Sakshi News home page

'గోమాంసమేకాదు.. గోపూజనూ అనుమతించం'

Dec 3 2015 4:06 AM | Updated on Sep 3 2017 1:23 PM

'గోమాంసమేకాదు.. గోపూజనూ అనుమతించం'

'గోమాంసమేకాదు.. గోపూజనూ అనుమతించం'

ఓయూలో గోమాంసాన్నేకాదు.. గోపూజ లాంటి కార్యక్రమాలను కూడా అనుమతించబోమని అధికారులు పేర్కొన్నారు.

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో ఈనెల 10వ తేదీన నిర్వహించ తలపెట్టిన 'బీఫ్ ఫెస్టివల్' రగడ రోజురోజుకూ రెట్టింపవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెస్టివల్‌ను నిర్వహిస్తామని ప్రజాస్వామిక సాంస్కృతిక వేదిక(డీసీఎఫ్) సహా పలు దళిత, బహుజన విద్యార్థి సంఘాలు చెబుతుండగా,  ఎలాగైనా అడ్డుకుని తీరుతామని హిందూ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్సిటీ అధికారుల ప్రకటన కీలకంగా మారింది.

 

ఉస్మానియా యూనివర్సిటీలో ‘బీఫ్ ఫెస్టివల్, ‘గో పూజ’ నిర్వహణకు ఎటువంటి అనుమతి లేదని ఆ వర్సిటీ స్పష్టం చేసింది. 10న ఓయూలో తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్, గో పూజ వంటి కార్యక్రమాలతో వర్సిటీకి   సంబంధం లేదని పేర్కొం ది. ఉన్నత విద్య, పరిశోధనల కోసమే వర్సిటీని ఏర్పాటు చేశారని, బీఫ్ ఫెస్టివల్, గో పూజను క్యాంపస్ పరిధిలో చేపట్టేందుకు అనుమతించబోమని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. వర్సిటీలో విద్యాపూరిత వాతావరణం, ప్రశాంతత కొనసాగేందుకు విద్యార్థులు, ఉద్యోగులు సహకరించాలని కోరింది.

ఇదిలా ఉండగా, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ బుధవారం ఓ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ బీఫ్, పోర్క్ వంటి పదార్థాలు ఇంట్లోనో లేదంటే ఫంక్షన్ హాళ్లలో నిర్వహించుకోవాలికానీ విద్యాసంస్థల్లో కాదని అన్నారు. ఓయూలో అలాంటి కార్యక్రమాలు సరికాదని అభిప్రాయపడ్డారు. అయితే ఆయన తెలిపిన అభిప్రాయం వ్యక్తిగతమా? లేక ప్రభుత్వానిదా? అనే స్పష్టతరాలేదు.

ఈనెల 10వ తేదీన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఓయూలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహణకు ముందు డీసీఎఫ్ విస్తృత ప్రచార కార్యక్రమాలను సిద్ధం చేసింది. అందులో భాగంగా ఈ నెల 5న వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు వామపక్ష  విద్యార్థి సంఘాలతోపాటు ఎంఐఎం కూడా మద్దతు ఇస్తోంది. మంగళవారం ఓయూ కవి సమ్మేళనం కూడా నిర్వహించారు. ఏడో తేదీన 5కే రన్ నిర్వహించనున్నట్లు డీసీఎఫ్ నేత దర్శన్ తెలిపారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతోపాటు కేరళకు చెందిన పలువురు రాజకీయ నేతలతోపాటు రాష్ట్రంలోని వివిధ పార్టీల నేతలను కార్యక్రమానికి ఆహ్వానించామన్నారు. నవలా రచయిత అరుంధతి రాయ్ కూడా ఇందుకు హాజరుకానున్నట్లు సమాచారం.
 
బీఫ్ ఫెస్టివల్‌ను ఎలాగైనా అడ్డుకుంటామని హిందూత్వ సంస్థల నేతలు, పలు విద్యార్థి సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ఫెస్టివల్‌ను వ్యతిరేకిస్తూ పలు చోట్ల ఆందోళనలు సైతం నిర్వహించారు. ఓయూలో ఫెస్టివల్ నిర్వహణకు అనుమతి ఇవ్వొందంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, హిందూ జన జాగృతి సమితి ఆధ్వర్యంలో సోమవారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఓయూ ఇన్‌ఛార్జి వీసీ రాజీవ్ ఆర్ ఆచార్యకు వినతి పత్రం అందజేశారు. అంతేగాక ఫెస్టివల్ జరిగే రోజున 'చలో ఓయూ'కు ఎమ్మెల్యే  పిలుపు నిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement