ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినట్టే..


18 రోజుల సమావేశాలపై సీఎల్పీ సంతృప్తి



సాక్షి, హైదరాబాద్‌: ప్రజల సమస్యలపై ప్రభు త్వాన్ని ప్రశ్నించడంతోపాటు పలు అంశాల్లో పరిష్కారాలను చూపించే విధంగా శాసనసభ సమావేశాల్లో వ్యవహరించినట్టుగా కాంగ్రెస్‌ శాసనసభాపక్షం (సీఎల్పీ) సంతృప్తిని వ్యక్తం చేస్తోంది. గతంలో కంటే 18 రోజులపాటు జరిగిన ఈ సమావేశాలు టీఆర్‌ఎస్‌పై రాజకీ యంగా దాడిని పెంచడానికి, కాంగ్రెస్‌ శాసన సభ్యుల పనితీరును మెరుగు పర్చుకోవడానికి ఉపయోగపడినట్టుగా అంచనా వేస్తోంది. ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం చెందినట్టుగా ప్రజల్లో రుజువు చేయగలిగామనే సంతృప్తితో ఉన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను మార్చి నెలాఖరులోగా చెల్లిస్తామని ప్రభుత్వం తో చెప్పించగలగడం కాంగ్రెస్‌పార్టీ శాసనస భపక్షం సాధించిన విజయమేననే అంచనాలో ఉంది.



నిజాం షుగర్స్‌ను తెరిపించడం సాధ్యం కాదని చెప్పించడం ద్వారా టీఆర్‌ఎస్, సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన మాటను అమలు చేయడంలో విఫలమయ్యారనే అంశాన్ని అసెంబ్లీ సాక్షిగా రుజువు చేశామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. భూసేకరణ చట్టం–2013పై టీఆర్‌ఎస్‌ వైఖరిని ప్రజల్లో ఎండగట్టడానికి శాసనసభలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఉపయోగపడుతుందని అంచనా వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టం–2013 కంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టం ఎలా మెరుగైందో చెప్పలేక, అధికార టీఆర్‌ఎస్‌ సభను వాయిదా వేసుకున్నదని కాంగ్రెస్‌ సభ్యులు ఆరోపిస్తున్నారు.



పార్లమెంటులో తెచ్చిన భూసేకరణ చట్టానికి సవరణా, రాష్ట్ర ప్రభుత్వమే కొత్తచట్టం చేస్తున్నదా అన్న సీఎల్పీ ప్రశ్నతో టీఆర్‌ఎస్‌ అవగాహనారాహిత్యం శాసనసభ సాక్షిగా తేలిపోయిందని విశ్లేషిస్తున్నారు. దీనిపై చర్చ సందర్భంగానే పార్లమెంటులో తాడూబొంగరం లేనివారు చేసిన చట్టం అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన ప్రసంగం కూడా పలు విమర్శలకు, ఆగ్రహానికి కారణమైందని కాంగ్రెస్‌ సభ్యులు వాదిస్తున్నారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top