జగన్‌ బెయిల్‌ రద్దుకు సీబీఐ కోర్టు నో

జగన్‌ బెయిల్‌ రద్దుకు సీబీఐ కోర్టు నో - Sakshi


షరతులు ఉల్లంఘించారనడానికి ఆధారాల్లేవు

- బెయిల్‌ రద్దుకు సరైన కారణాలు చూపలేదు

- సీబీఐ పిటిషన్‌ కొట్టివేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు




సాక్షి, హైదరాబాద్‌: మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌రెడ్డితో తన పత్రిక, టీవీలో ఇంటర్వ్యూ ఇప్పించడం ద్వారా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించి బెయిల్‌ షరతులను ఉల్లంఘించారని, ఆయన బెయిల్‌ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. బెయిల్‌ షరతులు ఉల్లఘించారనడానికి ఆధారాల్లేవని, బెయిల్‌ రద్దుకు సీబీఐ సరైన కారణాలను చూపలేకపోయిందని న్యాయమూర్తి వెంకటరమణ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.



జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ సీబీఐ గతంలో దాఖలు చేసిన పిటిషన్లపై ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తన నిర్ణయాన్ని శుక్రవారం ప్రకటించారు. రమాకాంత్‌రెడ్డితో చేసిన ఇంటర్వూ్య సాక్షులను ప్రభావితం చేయాలన్న ముందస్తు ప్రణాళికతో చేసినట్లుగా లేదని... మాజీ సీఎస్‌గా పనిచేసిన రమాకాంత్‌రెడ్డిని ప్రభావితం చేసి ఈ ఇంటర్వూ్య ఇప్పించి ఉంటారని భావించలేమని పేర్కొన్నారు. అలాగే సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ సీసీ నెంబర్‌ 8లో రమాకాంత్‌రెడ్డి సాక్షిగా లేరని... ఈ చార్జిషీట్‌లోనే బెయిల్‌ రద్దు కోరుతూ సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసిందని, అయితే బెయిల్‌ రద్దుకు సీబీఐ సరైన కారణాలు చూపలేదని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా మే 15 నుంచి జూన్‌ 15 మధ్య 15 రోజులపాటు కుటుంబంతో న్యూజిలాండ్‌కు వెళ్లేందుకు జగన్‌కు ప్రత్యేక కోర్టు అనుమతించింది. పర్యటన వివరాలను, ఫోన్‌ నంబర్‌ను కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని ఆదేశించింది.



సీబీఐది దురుద్దేశం...

ప్రత్యేక కోర్టు బెయిల్‌ మంజూరు సందర్భంగా విధించిన ఏ షరతులనూ ఉల్లంఘించలేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. సాక్షి, పత్రిక, టీవీల నిర్వహణతోగానీ, రోజువారీ కార్యకలాపాలతోగానీ జగన్‌కు ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ సంబంధం లేదని తెలిపారు. ‘ఇప్పుడు జగన్‌పై ఆరోపణలు చేస్తున్న సీబీఐ...దర్యాప్తు సమయంలో మీడియాను ఆయుధంగా వాడుకుంది. జగన్‌కు వ్యతిరేకంగా కొన్ని అంశాలను మీడియాకు వెల్లడిస్తూ పారదర్శకమైన విచారణకు భంగం కలిగించింది. జగన్‌కు వ్యతిరేకంగా ఏదో జరిగి పోతోందంటూ మీడియాలో కథనాలు వచ్చినా పట్టించుకోలేదు. సీబీఐ అవాస్తవాలు, ఊహాజనితమైన అంశాలతో బెయిల్‌ రద్దు చేయాలని కోరుతోంది. మాజీ సీఎస్‌ రమాకాంత్‌రెడ్డితో ఉద్దేశపూర్వకంగా సాక్షిలో ఇంటర్వ్యూ ఇప్పించారనడం అవాస్తవం.



రమాకాంత్‌రెడ్డిని జగన్‌ ఎప్పుడూ కలవలేదు. సీబీఐ ఆరోపిస్తున్నట్లుగా ప్రకటన ఇవ్వాలని కోరలేదు. సాక్షి టీవీని ఇందిరా టెలివిజన్‌ నిర్వహిస్తుంది. సీబీఐ చెబుతున్నట్లుగా జగతి పబ్లికేషన్‌తో సంబంధం లేదు. ‘సాక్షి’ ఎడిటోరియల్‌ బోర్డు పర్యవేక్షణలో నడుస్తుంది. ఫ్రీలాన్సర్‌గా పనిచేసే జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు ప్రముఖులతో ఇంటర్వూ్యలు చేస్తుంటారు. గతంలోనూ ఓ చానల్‌లో ఇంటర్వూ్యలు చేశారు. అయినా ఇంటర్వూ్యలో కొమ్మినేని అడిగిన ప్రశ్నలకు గానీ, రమాకాంత్‌రెడ్డి ఇచ్చిన సమాధానాలతోగానీ జగన్‌కు సంబంధం లేదు. ఇంటర్వూ్యను పూర్తిగా పరిశీలించండి. అందులో కావాలని ఒక అంశం గురించి ప్రస్తావించలేదు. రమాకాంత్‌రెడ్డి ఐఏఎస్‌గా ఎంపికైనప్పటి నుంచి పదవీ విరమణ చేసే వరకూ ఆయన ఏఏ హోదాల్లో,  ఎక్కడెక్కడ పనిచేశారు. ఏఏ ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశారు తదితర  విషయాలను అడిగారు. ఈ ఇంటర్వూ్య ప్రాసిక్యూషన్‌పైనా, సాక్షులపైనా ప్రభావం చూపుతుందనడం అవాస్తవం. రమాకాంత్‌రెడ్డి తన ఇంటర్వూ్యలో అప్పటి సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ గురించి మాత్రమే ప్రస్తావించారు.

దర్యాప్తు అధికారి గురించిగానీ, కేసు పూర్వాపరాల గురించి మాట్లాడలేదు’ అని వివరించారు.

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top