స్నాక్ సెంటర్

స్నాక్ సెంటర్ - Sakshi


చీజీ ఎగ్ టోస్ట్

కావల్సినవి: బ్రెడ్ స్లైసెస్ - 3, గుడ్లు - 3, తురిమిన చీజ్ - అర కప్పు, ఉప్పు - పావు టీ స్పూన్, వెన్న - 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు - పావు కప్పు (కావాలనుకుంటేనే), సన్నగా తరిగిన కొత్తిమీర - పావు కప్పు (కావాలనుకుంటేనే), మిరియాల పొడి - అర టీ స్పూన్

 

తయారీ: ముందుగా బ్రెడ్‌స్లైసెస్‌కు ఇరువైపుల వెన్న రాసుకోవాలి. తర్వాత స్పూన్‌లాంటి పరికరంతో బ్రెడ్ స్లైస్ మధ్యలో గుంటలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో బ్రెడ్ ముక్కలో.. ఒక్కో గుడ్డును కొట్టి పోయాలి. తర్వాత వాటిపై చీజ్ తురుము, తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి వేయాలి. కావాలంటే క్యారెట్ తురుమును కూడా వేసుకోవచ్చు. ఇవేవీ వద్దనుకుంటే... ఉప్పు, చీజ్‌ను మాత్రం  వేసుకున్నా సరిపోతుంది. ఆపైన ఈ బ్రెడ్ ముక్కలను టోస్టర్‌లో టోస్ట్ చేసుకోవచ్చు. అలాగే అవన్‌లో 10 నిమిషాల పాటు బేక్ కూడా చేసుకోవచ్చు. కచ్చితంగా చీజ్ మాత్రం కరిగేలా చూసుకోవాలి. వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే ఏదైనా సాస్‌తో సర్వ్ చేసుకుంటే, ఆ టేస్ట్ అదిరిపోతుంది.

 

ఆలూ సాబుదానా వడ

కావల్సినవి: సగ్గు బియ్యం (సాబుదానాలు) - ఒకటిన్నర కప్పు, ఉడికించిన బంగాళదుంపలు (చిదుముకోవాలి) - 1 కప్పు, తరిగిన పచ్చిమిర్చి - రెండు టీ స్పూన్లు, తరిగిన కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా

 

తయారీ: ముందుగా సగ్గు బియ్యాన్ని రెండు గంటల పాటు నానబెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెలో చిదిమిన బంగాళదుంపలు, నానిన సగ్గు బియ్యం, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకొని, ఫొటోలో కనిపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. ఆపైన వాటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. వాటిని వేడివేడిగా ఉన్నప్పుడు ఏదైనా చట్నీ లేదా సాస్‌తో సర్వ్ చేసుకోవాలి.

 

పాఠోళీ

కావల్సినవి: బియ్యం - 1 కప్పు, పసుపు లేదా అరటి ఆకులు - 10, నెయ్యి - సరిపడా, ఉప్పు - తగినంత, బెల్లం తురుము - 6 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి తురుము - 1 కప్పు

 

తయారీ: ముందుగా బియ్యాన్ని రెండు గంటల పాటు నానబెట్టాలి. నానిన బియ్యాన్ని నీళ్లు కలుపుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. దాంట్లో ఉప్పు వేసి  కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ ఆన్ చేసి, ప్యాన్ పెట్టి అందులో ఎండు కొబ్బరి తురుమును కాస్తంత వేయించాలి. ఆపైన అందులోనే బెల్లం తురుమును వేడి చేసి, చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పసుపు లేదా అరటి ఆకులకు నెయ్యి రాయాలి. దానికి బియ్యం పిండిని రాసి, వాటిపై బెల్లం మిశ్రమాన్ని వేయాలి. ఆపైన ఆకును మడిచి పక్కన పెట్టుకోవాలి. ఓ పెద్ద గిన్నెలో కొన్ని నీళ్లు పోసి, అందులో ఓ ప్లేట్ లేదా గిన్నెను పెట్టాలి. ఆ వాటిపై ఈ ఆకులను పెట్టి మూత పెట్టాలి. (ఇడ్లీల్లాగే వీటినీ స్టీమ్‌పై ఉడికించాలి). 10-15 నిమిషాల తర్వాత వాటిని బయటికి తీసి, ఆకులను తొలగించాలి. అంతే ఎంతో రుచికరమైన పాఠోళీలు రెడీ.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top