మీట్ మిసెస్ వరూధిని

చందన


కలర్స్

 

ఇంట గెలిచినంత తేలిక కాదు రచ్చ గెలవడం.కానీ చందన  గెలిచి చూపించింది.ఎక్కడో పక్క రాష్ట్రంలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి... ఒకే ఒక్క సీరియల్‌తో తెలుగు నాట చాలా పాపులర్ అయిపోయింది. అచ్చ తెలుగు అమ్మాయిలా అగుపిస్తూ.. అందర్నీ అభిమానుల్ని చేసేసుకుంది. తాను సీరియల్‌లో కనిపించినంత సాఫ్ట్ కాదని... ఇక్కడివారి ఆలోచనా విధానం నచ్చట్లేదని... ఇలా ఇంకా ఎన్నో విషయాలను నిక్కచ్చిగా చెప్పేసింది!

 

‘వరూధినీ పరిణయం’కి ముందు మిమ్మల్ని చూడలేదు?

అవకాశం లేదు. ఎందుకంటే అదే నా మొదటి సీరియల్. నేను తెలుగమ్మాయిని కాదు. కన్నడ పిల్లని. బెంగళూరులోనే పుట్టి పెరిగాను.



మరి తెలుగు సీరియల్‌లో చాన్స్ ఎలా వచ్చింది?

చాలా కన్నడ సినిమాలకి డబ్బింగ్ చెప్పాను. యాంకరింగ్ కూడా చేశాను. ఆ వీడియోస్ యూ ట్యూబ్‌లో ఉన్నాయి. వాటి వల్లే తెలుగులో చాన్స్ వచ్చింది.

     

సీరియల్ అంటేనే పేజీలకు పేజీల డైలాగులు... తెలుగు రాక కష్టపడ్డారా?


వరూధిని నెల్లూరు యాస మాట్లాడుతుంది. భాషే రాదంటే యాస కూడానా అని కంగారు పడ్డాను. కానీ టీమ్ చాలా సపోర్ట్ చేసింది. నాన్న సొంతవూరు ఆంధ్ర బోర్డర్ దగ్గర్లో ఉంటుంది. అక్కడందరూ కన్నడంలో తెలుగు మిక్స్ చేసి మాట్లాడుతుంటారు. అలా తెలుగు తెలుసు. అందుకే త్వరగా వచ్చేసింది.

     

ఇక్కడ మీకు ఏం నచ్చాయి?

{పేమాభిమానాలు. వరూధిని పాత్ర నచ్చడంతో నన్ను తమ సొంత ఇంటి ఆడపిల్లలా చూస్తున్నారు ఎంతోమంది. ఇక నచ్చనిదంటే ఆడపిల్లల పట్ల ఆలోచనా విధానం. ఆడపిల్లలు ఇలాగే ఉండాలి అని ఎన్నో కట్టుబాట్లు. చదువులేనివాళ్లు ఎలా ఆలో చిస్తున్నారో, చదువుకుని ఉన్నత హోదాల్లో ఉన్నవాళ్లు కూడా అలానే ఆలోచిస్తున్నారు. నేను పెరిగిన చోట ఇలా లేదు. అయినా మా రాష్ట్రంతో పోలిస్తే ఇక్కడే ఆడపిల్లలపై జరిగే అకృత్యాలు ఎక్కువ.

     

మేల్ డామినేషన్ మీ ఫీల్డ్‌లో లేదా?

ఎందుకు లేదు? పైగా ప్రొఫెషనల్ జెలస్ కూడా చాలా ఎక్కువ. తేలికగా బురద చల్లేస్తారు. నేను యాక్సిడెంట్ అయ్యి నెల రోజులు షూటింగ్ చేయలేకపోతే నన్ను సీరియల్‌లోంచి తీసేశారు అంటూ పుకారు పుట్టించారు. ఫేస్‌బుక్‌లో నెగిటివ్ కామెంట్లు రాశారు. ఎందుకిదంతా? ఏమైనా కలిసి వచ్చిందా? పోనీ నన్నేమైనా నష్టపర్చగలిగారా? ఇప్పటికీ ‘వరూధిని’ పాత్ర నేనే చేస్తున్నాను.

     

ఇంతకీ మీకు ఒరిజినల్ వరూధిని ఎవరో తెలుసా?

తెలుసు. ప్రవరాఖ్యుడి మనసు గెల్చుకోవడం కోసం చాలా కష్టపడుతుంది వరూధిని. ఈ సీరియల్‌లోనూ అంతేగా. హీరో పార్థూ మనసు కరిగించడానికి నానా కష్టాలూ పడాల్సి వస్తుంది నా పాత్రకి.

     

నిజ జీవితంలో ఎవరైనా నచ్చితే అలా వెంటపడతారా?


లేదు.  అయినా నేను పక్కా టామ్‌బాయ్‌ని. ఆడ పిల్లలా డ్రెస్ చేసుకుంది, ఆడపిల్లలా కనిపించింది కేవలం ఈ సీరియల్ చేయడం మొదలుపెట్టాకే. ఇంకో విషయం చెప్పనా... (నవ్వుతూ) సిగ్గు అనేది ఒకటి ఉంటుందని వరూధిని పాత్ర చేయడం మొదలెట్టాకే నాకు తెలిసింది.

   

అసలు ఆడపిల్లలు ఎలా ఉండాలి? వరూధినిలానా... చందనలానా?


వరూధిని చాలా స్ట్రాంగ్. కానీ పరిస్థితులను బట్టి కరిగిపోతూ ఉంటుంది. నిజానికి ఆడవాళ్లు చేసే తప్పు అదే. తండ్రి దగ్గరో, అన్న దగ్గరో, భర్త దగ్గరో, కొడుకు దగ్గరో... ఎవరో ఒకరి దగ్గర ప్రేమ కోసమో, భద్రత కోసమో లొంగిపోతారు. తమ వ్యక్తిత్వాన్ని మర్చిపోయి వాళ్లకోసం తమను తాము మార్చేసుకుంటారు. మనవాళ్లకు తగ్గట్టుగా మనల్ని మలచుకోవడంలో తప్పు లేదు కానీ మనం మనం కాకుండా పోవడాన్ని మాత్రం నేను ఇష్టపడను. మనం లొంగిపోయిన ఆ ఒక్క క్షణం మన జీవితాన్నే మార్చిపారేస్తుందని ఆడవాళ్లు మర్చిపోకూడదు.



ఇంతకీ మీ ప్రవరాఖ్యుడు ఎలా ఉండాలో చెప్పలేదు?

మా హీరో ‘పార్థూ’లా మాత్రం ఉండకూడదు. నాన్‌వెజ్ తినకూడదు. జంతువుల్ని హింసించడం నాకు నచ్చదు. కూల్‌గా, సింపుల్‌గా ఉండాలి.

   

హిందీ సీరియల్స్ ఫాలో అవుతారా? నార్త్‌లో కాని సౌత్‌లోకాని మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన టీవీ నటి ఎవరు?

హిందీ ఫాలో అవ్వను. తెలుగులో డబ్ అయినవి చూస్తున్నాను. ‘చిన్నారి పెళ్లికూతురు’, ‘గంగ’ చాలా బాగున్నాయి. ఇక నచ్చిన నటి అంటే... కన్నడ నటి శృతినాయుడు నా ఇన్‌స్పిరేషన్. రాధికా పండిట్ కూడా గ్రేట్ యాక్ట్రెస్. ఇక తెలుగులో హరిత. ఏ పాత్రకైనా పర్‌ఫెక్ట్ అనిపిస్తారు.



కన్నడ టీవీ రెమ్యూనరేషన్లకు, తెలుగు టీవీ రెమ్యూనరేషన్లకు తేడా ఎలా ఉంది?

కన్నడంలో వ్యూయర్‌షిప్ తక్కువ. అందుకని బడ్జెట్ కూడా తక్కువ. కానీ తెలుగులో బాగానే ఇస్తున్నారు. ఎంత అని మాత్రం అడక్కండి. (నవ్వుతూ) ఆడవాళ్ల వయసే కాదు... రెమ్యునరేషనూ అడక్కూడదు.



సినిమా చాన్సులేం రాలేదా?

వస్తున్నాయి. కానీ మంచి రోల్ కోసం చూస్తున్నా. ఏదో చేశాం అన్నట్టుగా కాకుండా పర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ చేస్తే మంచిది కదా!

   

రీసెంట్‌గా చూసిన తెలుగు సినిమా ఏంటి? మీకు ఏ హీరో ఇష్టం?

అన్నీ చూశాను. ‘కుమారి 21 ఎఫ్’ అయితే బాగా నచ్చింది. నిజానికది కర్ణాటకలో అయితే ఇంకా పెద్ద హిట్ అయ్యుండేది. ఎందుకంటే అక్కడి మనుషులు ఇక్కడికంటే చాలా ప్రాక్టికల్. ఈ కాన్సెప్టును చక్కగా రిసీవ్ చేసుకునేవారు, యాక్సెప్ట్ చేసేవారు. ఇక హీరో అంటే... ప్రభాస్ ఇష్టం. అలాగే నవీన్ చంద్ర. చాలా మంచి యాక్టర్ తను. కేవలం తన కోసమే ‘అందాల రాక్షసి’ సినిమా 150 సార్లకు పైగా చూశాను.



ఈ రంగంలో వచ్చే అమ్మాయిలకి మీరిచ్చే మెసేజ్?

వృత్తినీ, వ్యక్తిగత జీవితాన్నీ కలపనంత వరకే మనం హ్యాపీగా ఉండగలం. అలాగే మన పని మనం చేసుకుపోవాలి. ఎవరేమన్నా మనసులో పెట్టుకోకూడదు. పెట్టుకుని కుమిలిపోతే ముందుకు సాగలేం. మన ప్రయాణం అక్కడే ఆగిపోతుంది.

     

మరి మీ ప్రయాణం ఎంతవరకూ సాగుతుంది?

నాకు సింగర్ అవ్వాలన్నది లక్ష్యం. అమ్మ క్లాసికల్ మ్యూజిక్ టీచర్ కావడంతో నేను చిన్నప్పట్నుంచే వెస్టర్న్, కర్నాటిక్ నేర్చుకున్నాను. హైదరాబాద్ వచ్చాక ఇన్ఫెక్షన్ వచ్చి స్వరపేటిక బాగా దెబ్బతింది. దాంతో డబ్బింగ్ చెప్పకూడదు, ఐదారేళ్ల వరకూ పాడకూడదు అని చెప్పేశారు డాక్టర్స్. అది నాకు చాలా బాధగా ఉంది. మళ్లీ నా గొంతు సరయ్యి, నేను సింగర్‌ని అయ్యాకే గమ్యం చేరుకున్నట్టు. అంతవరకూ ఈ ప్రయాణం సాగుతూనే ఉంటుంది!

 

ఇంటర్వ్యూ: సమీర నేలపూడి


 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top