శుభాల సంరంభం షురూ!

శుభాల సంరంభం షురూ!


పవిత్ర రమజాన్‌ అత్యంత శుభప్రదమైన నెల. శుభాల సిరులు వర్షించే వరాల వసంతం. మానవుల మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి, జీవనసాఫల్యానికి అవసరమైన అనేక విషయాలు దీనితో ముడిపడి ఉన్నాయి. ఈనెలలోనే పవిత్రఖురాన్‌ అవతరించింది. ఇది మొత్తం మానవాళికీ మార్గదర్శకజ్యోతి. ఈనెలలోనే ‘రోజా’ వ్రతం విధిగా నిర్ణయించబడింది.


ఈనెలలోనే వెయ్యినెలలకన్నా విలువైన రాత్రి అనిచెప్పబడిన ‘లైలతుల్‌ ఖద్ర్‌/షబెఖద్ర్‌’ ఉంది. ఈ నెలలోచేసే ఒక్కోమంచిపనికి అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుంది. ఒకవిధిని ఆచరిస్తే 70 విధులు ఆచరించినదానికి సమానంగా పుణ్యం లభిస్తుంది. విధికానటువంటి ఒక చిన్న సత్కార్యం చేస్తే, విధిగా చేసే సత్కార్యాలతోసమానమైన పుణ్యఫలం దొరుకుతుంది. సహజంగా ఈనెలలో అందరూ సత్కార్యాలవైపు అధికంగా మొగ్గుచూపుతారు. దుష్కార్యాలు గణనీయంగా తగ్గుముఖం పడతాయి. సమాజంలో ఒక మంచిమార్పు కనబడుతుంది.



ఫిత్రా ఆదేశాలు కూడా ఈనెలలోనే అవతరించాయి.’ఫిత్రా’ అన్నది పేదసాదల హక్కు. దీనివల్ల వారికి కాస్తంత ఊరటలభిస్తుంది. ఎక్కువశాతం మంది జకాత్‌  కూడా ఈనెలలోనే చెల్లిస్తారు. ఇది కూడా పేదసాదల ఆర్థిక అవసరాలు తీర్చడంలో గణనీయంగా తోడ్పడుతుంది. తరావీహ్‌ నమాజులు కూడా ఈనెలలోనే ఆచరించబడతాయి. అదనపు పుణ్యం మూటకట్టుకోడానికి ఇదొక సువర్ణ అవకాశం. ఈ నెలలో చిత్తశుధ్ధితో రోజా (ఉపవాసదీక్ష) పాటించేవారి గత అపరాధాలన్నీ మన్నించబడతాయి.


ఉపవాసులు ‘రయ్యాన్‌’ అనే ప్రత్యేక ద్వారం గుండా స్వర్గప్రవేశం చేస్తారు. ఈవిధమైన అనేక ప్రత్యేకతలు ఉండబట్టే దేవుడు ఈ నెలను బహుళ ప్రయోజనకారిగా తీర్చిదిద్దాడు. మానవుల ఇహపర ప్రయోజనాలకు, సాఫల్యానికి ఇతోధికంగా దోహదపడే నెల ఈ రమజాన్‌ నెల.కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోడానికి శక్తివంచనలేని కృషిచెయ్యాలి. అలుపెరుగని ప్రయత్నం ఆరంభించాలి.నిజానికి రోజా వ్రతమన్నది కేవలం ముహమ్మద్‌ ప్రవక్త (స) వారి అనుచర సముదాయానికి మాత్రమే పరిమితమైన ఆరాధనకాదు. సార్వజనీనమైన, సార్వకాలికమైన ఆరాధన ఇది. దీనికి చాలా ఘనమైన ప్రాచీన, సామాజిక నేపథ్యముంది. అనాదిగా ఇది అన్ని కాలాల్లో, అన్ని సమాజాల్లో చెలామణిలో ఉన్నట్లు దైవగ్రంథం ద్వారా మనకు తెలుస్తోంది. ఖురాన్‌ (2–183)

– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top