ఆయనవి సిగ్గుమాలిన పనులు.. పైశాచిక ఆనందం

ఆయనవి సిగ్గుమాలిన పనులు.. పైశాచిక ఆనందం - Sakshi


పార్టీలు మారినప్పుడు పదవులకు రాజీనామా చేసి.. మళ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలవడం రాజకీయాల్లో నిబద్ధతకు చిహ్నమని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మూడుసార్లు తన పదవులకు రాజీనామా చేశారని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వం నుంచి బయటకు రాగానే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, సిద్దిపేట నుంచి పోటీ చేసి గెలిచారని, అలాగే ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసి మళ్లీ గెలిచారని అన్నారు. దానం నాగేందర్‌ను వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నప్పుడు కూడా ఆయనతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించారని, మళ్లీ ఎన్నికలు పెడితే నాగేందర్ ఓడిపోయారని చెప్పారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి, కేసీఆర్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని ఆయన స్పష్టం చేశారు.



ఎన్నికలకు ముందు, ఆ తర్వాత తెలంగాణలో జరిగిన పరిణామాల సందర్భంలో చంద్రబాబు మాట్లాడిన మాటలు, ఆయన చేసిన సిగ్గుమాలిన పనులు, ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలను చేర్చుకుని పొందిన పైశాచిక ఆనందం అన్నీ స్పష్టం అవుతున్నాయన్నారు. గతంలో కేసీఆర్‌ను తిట్టిన తిట్లన్నీ ఇప్పుడు ఆయన తనను తాను తిట్టుకున్నట్లు అయిందని చెప్పారు. వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు.. 18 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, తాను కూడా రాజీనామా చేసి సొంత పార్టీపై పోటీచేసి గెలిచిన చరిత్ర ఉందని కొడాలి నాని గుర్తుచేశారు. పార్టీలు మారినప్పుడు తామంతా కూడా శాసనసభ్యత్వాలను వదులుకున్నామని, తమపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్‌ను తామే కోరామని చెప్పారు.



క్యాంపులు పెట్టడం, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం చంద్రబాబుకు రాజకీయాల్లో ముందునుంచి అలవాటని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కాళ్లు, సోనియా కాళ్లు పట్టుకుని వదలరని నాని ఎద్దేవా చేశారు. దమ్ముంటే ఆ నలుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని.. ప్రజలు వాళ్లకు అనుకూలంగా తీర్పు వస్తే తాము నోరు మూసుకుని కూర్చుంటామని, నీకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఏం చేస్తావో చెప్పాలని సవాలు చేశారు. తెలంగాణలో పార్టీని సర్వనాశనం చేసినందుకు ఎన్టీఆర్ ఆత్మ కూడా క్షోభిస్తూ ఉంటుందని అన్నారు. పదవీ కాంక్ష ఉన్న ఎమ్మెల్యేలు వేరే పార్టీ నుంచి వచ్చి తమ పార్టీలో చేరే పరిస్థితి లేదని ఆయన తెలిపారు. ఎందుకంటే.. అలా రావాలంటే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని తమ అధినేత చెబుతారని, అది వాళ్లకు ఇష్టం ఉండదని అన్నారు. జలీల్‌ఖాన్‌కు మంత్రి ఉమా బ్రోకరేజి చేశారని జిల్లాలో అందరూ చెబుతున్నారన్నారు. శోభా నాగిరెడ్డి పీఆర్పీ నుంచి వైఎస్ఆర్‌సీపీలోకి వచ్చినప్పుడు ఆమె తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వచ్చారని, ఇప్పుడు భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ ఆమె అడుగుజాడల్లో నడవాలంటే వాళ్లు కూడా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జలీల్ ఖాన్ రాజీనామా చేసినా, ఆయన అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న ఏడుగురు కార్పొరేటర్లు మాత్రం ఇప్పటికీ వైఎస్ జగన్ వెంటే ఉన్నామంటూ వచ్చారని చూపించారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top