తెలంగాణే నంబర్‌ వన్‌

తెలంగాణే నంబర్‌ వన్‌ - Sakshi


అందుకోసం సీఎం కేసీఆర్‌ కృషి

కళాశాల ఏర్పాటుకు సత్యసాయి సంస్థ ముందుకు రావడం అభినందనీయం

మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి

కొండపాకలో సెమీ యూనివర్సిటీకి శంకుస్థాపన

పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఎమ్మెల్సీలు


కొండపాక: దేశంలోనే తెలంగాణను ముందు వరుసలో నిలబెట్టేలా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారని మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కొండపాక శివారులోని ఆనంద నిలయం ట్రస్టు వృద్ధాశ్రమం ఆవరణలో సత్యసాయి సేవా సంస్థ, ప్రశాంత బాలమందిర్‌ ట్రస్టు (పుట్టపర్తి) ఆధ్వర్యంలో రూ.50 కోట్లతో ఇంటర్మీడియట్‌  బాలికల కళాశాల (సెమీ యూనివర్సిటీ) నిర్మాణానికి ఎమ్మెల్సీ ఫారూక్‌ హుస్సేన్, పాతూరి సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారితో కలిసి గురువారం భూమి పూజ చేశారు.



ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు కృషి వల్ల కొండపాక శివారులో బాలికల కళాశాల ఏర్పాటుకు సత్యసాయి సేవా సంస్థ ముందుకు రావడం గొప్ప విషయమన్నారు. పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించాలన్న ఆలోచన సత్య సాయి సేవా సంస్థకు పుట్టడం కొండపాక ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. తల్లిదండ్రులు లేని వారు అనాథలు కారన్నారు. ఆడ పిల్లలకు భగవంతుడే తల్లిదండ్రులన్నారు.  ఏడాది లోపల ఇంటర్మీడియట్‌ విద్య అమలులోకి వచ్చేలా సేవా సంస్థ ముందుకు సాగుతుందన్నారు. విద్యతోపాటు వృత్తి విద్యాకోర్సులు కూడా ప్రవేశపెడతారన్నారు. సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధి నర్సింహ్మమూర్తి మాట్లాడుతూ.. సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల్లో విద్యాలయాలు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తున్నామన్నారు.



మహా వృక్షమై ఫలాలను అందిస్తుంది.

సత్య సాయి ట్రస్టు వారు ఏర్పాటు చేస్తున్న బాలికల కళాశాలలు మొక్క నుంచి మహా వృక్షాలై భవిష్యత్తులో మంచి ఫలాలు అందిస్తుందని ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అన్నారు. విలువలతో కూడిన విద్యను అందించడం వల్ల  సమాజం ఉన్నతంగా వెలిగిపోతుందన్నారు.  



తల్లిదండ్రులకు సేవ చేయని వారు శిక్షార్హులు..

తల్లిదండ్రులకు సేవ చేయని వారు శిక్షార్హులని ఎమ్మెల్సీ ఫారూక్‌ హుస్సేన్‌ అన్నారు. తల్లిదండ్రుల దీవెనలు సంతానానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. సత్యసాయి సేవా సంస్థ దూత మధు స్వామి మాట్లాడుతూ.. సమాజంలో మంచి వ్యక్తులను తయారు చేయడం కోసమే పుట్టపర్తి సత్యసాయి సేవా సంస్థ పని చేస్తుందన్నారు. విద్యార్థుల నృత్యాలు అలరించాయి. ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి ప్రసంగించగా, అనంత నిలయం ట్రస్టు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top