బాబు బావకే మాఫీ కాలేదు..! | Everything loan waiver magic | Sakshi
Sakshi News home page

బాబు బావకే మాఫీ కాలేదు..!

Jan 4 2016 1:27 AM | Updated on Aug 10 2018 9:42 PM

బాబు బావకే మాఫీ కాలేదు..! - Sakshi

బాబు బావకే మాఫీ కాలేదు..!

మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మోసపోయాం. రుణమాఫీ ఓ మాయ. మాఫీ చేశామని ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారు.

♦ రుణమాఫీ అంతా మాయ
♦ దుమ్మెత్తి పోసిన చంద్రబాబు బంధువు నాగరాజునాయుడు
♦ ఆయన ఇచ్చిన పత్రాలు నాలుక గీసుకోవడానికే..
♦ నమ్మి ఓట్లేసి మోసపోయామని ఆవేదన
♦ నారావారిపల్లె జన్మభూమి సభలో ఆందోళన
 
 చంద్రగిరి : ‘మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మోసపోయాం. రుణమాఫీ ఓ మాయ. మాఫీ చేశామని ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారు. పత్రాలు పంపారు. కానీ రుణం మొత్తం కట్టాలని బ్యాంకర్లు వేధిస్తున్నారు. ముఖ్యమంత్రి పంపిన పత్రాలు నాలుక గీసుకోవడానికే పనికొస్తాయి.. అసలు రుణమాఫీ చేశారా..?’

 ఈ మాటలన్నది ఎవరో కాదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గరి బంధువు కొత్తపల్లి నాగరాజునాయుడు. ముఖ్యమంత్రికి వరసకు బావ అవుతారు. ఆయనది కూడా నారావారి స్వగ్రామం నారావారిపల్లె. చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న రుణమాఫీలోని డొల్లతనాన్ని ఆయన ఉతికి ఆరేశారు. దీంతో ఆదివారంనాడు నారావారిపల్లెలో జరిగిన జన్మభూమి సభలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు, అధికారుల దిమ్మతిరిగేలా దుమ్ముదులిపేశారు.

బ్యాంకు అధికారులు ఇచ్చిన నోటీసులు, రుణమాఫీ పత్రాలను చిరాకొచ్చి గతంలోనే బ్యాంకు అధికారుల ఎదుటే చించేసినట్లు ఆయన తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నారా, కొత్తపల్లి కుటుంబాలకు చాలా దగ్గరి బంధుత్వం ఉంది. నాగరాజునాయుడు తన 1.14 ఎకరాల భూమికి సంబంధించి పాస్‌పుస్తకాలను చిత్తూరు జిల్లా రంగంపేట బ్యాంక్‌లో 2012లో తనఖాపెట్టి 40వేల రూపాయల వ్యవసాయ రుణం తీసుకున్నాడు. రుణమాఫీ కింద తన రుణం కూడా రద్దయిందని ఆయన భావించాడు. అనుకున్నట్లే ప్రభుత్వం నుంచి పత్రాలు కూడా ఆయనకు అందాయి. కానీ బ్యాంకు ఖాతాలో ఒక పైసా కూడా జమ కాలేదు.

తీసుకున్న అప్పు మొత్తం చెల్లించాలని, లేకపోతే పొలాన్ని జప్తు చేస్తామని పలుమార్లు బ్యాంకు నుంచి నోటీసులు అందాయి. ముఖ్యమంత్రి సమీప బంధువుని అని మొత్తుకున్నా బ్యాంకు వారు వినలేదు. ప్రభుత్వం నుంచి డబ్బు రాలేదని, తాము మాత్రం ఏం చేస్తామని బ్యాంకర్లు ఒత్తిడి చేస్తూనే వచ్చారు. ఈనేపథ్యంలో ఆదివారం ముఖ్యమంత్రి సొంత గ్రామం నారావారిపల్లెలో  జన్మభూమి-మా ఊరు గ్రామ సభ నిర్వహించారు. ఈ సభకు నాగరాజు నాయుడు కుటుంబ సభ్యులతో కలసి వచ్చి టీడీపీ నాయకులు, అధికారులను నిలదీశారు. అంతకు ముందు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల రుణ మాఫీని  పూర్తిస్థాయిలో చేయలేదని విమర్శించారు. రైతులకు ఈ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement