పాపం.. పసివాడు

పాపం.. పసివాడు - Sakshi


* విద్యుత్ షాక్‌తో బాలుడికి తీవ్రగాయాలు

* ఒక చెయ్యి తొలగింపు.. కాలిన పాదాలు


ఏలూరు: స్నేహితులతో కలిసి ఆడుతూ పాడుతూ గెంతులేసిన ఆ బాలుడు అదుపుతప్పి విద్యుత్ తీగలను తాకడంతో విద్యుత్ షాక్‌కు గురై తీవ్రగాయాలపాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇన్‌ఫెక్షన్ కారణంగా ఓ చెయ్యిని వైద్యులు తొలగించారు. పాదాలు బాగా కాలిపోవడంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నాడు.



బాలుడి సమీప బంధువు నల్లమిల్లి వెంకట మణిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కవిటం గ్రామానికి చెందిన వెలగల వెంకటరెడ్డి, మాధవి దంపతులకు ప్రవీణ్‌రెడ్డి(6), సాత్విక్‌రెడ్డి(5) ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకటరెడ్డి కుటుంబం కవిటం శివాలయం సమీపంలో నివసిస్తోంది. గ్రామంలోని ఆర్‌అండ్ బీ రోడ్డు పక్కన శివాలయం వీధికి ఎదురుగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతోంది. ఈ నెల 20న మధ్యాహ్నం 12.30 సమయంలో తల్లి వంటింట్లో ఉండగా ప్రవీణ్‌రెడ్డి, సాత్విక్‌రెడ్డి ఆడుకోవడానికి బయటకు వెళ్లారు.



వాళ్లిద్దరూ నిర్మాణంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌పైకి ఎక్కారు. అక్కడ ఆడుకుంటూ సాత్విక్‌రెడ్డి కాంప్లెక్స్ వద్ద తక్కువ ఎత్తులో ఉన్న కరెంట్ తీగలను తాకాడు. దీంతో విద్యుత్‌షాక్‌తో విలవిల్లాడుతూ కిందపడ్డాడు. తమ్ముడు పడిపోవడాన్ని చూసిన అన్న ప్రవీణ్‌రెడ్డి కిందకు వెళ్లి తల్లి మాధవికి విషయం చెప్పాడు. ఆమె పరుగున వచ్చి సాత్విక్‌రెడ్డిని స్థానికుల సహాయంతో పాలకొల్లులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ షాక్‌కు రెండు కాళ్లు, రెండు చేతులు, శరీరంలో పలు చోట్ల కాలిపోయి తీవ్రంగా గాయాలయ్యాయి.



మెరుగైన వైద్యం కోసం బాలుడ్ని తల్లిదండ్రులు విశాఖపట్నం ఓమ్ని ఆర్‌కే ఆసుప్రతిలో చేర్పించారు. బాలుడి కుడి చేయి బాగా కాలిపోవడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి మోచేయి వరకు తొలగించారు. అయినా ఇన్‌ఫెక్షన్ తగ్గకపోవడంతో పైవరకు తొలగించాలని వైద్యులు చెప్పారు. బాలుడికి రెండు పాదాలు తీవ్రంగా కాలాయి.



కుడిపాదం సగం వరకు తొలగించాల్సి ఉంద ని వైద్యులు చెప్పారని మణిరెడ్డి చెప్పారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లే సాత్విక్‌రెడ్డి విద్యుత్‌షాక్‌కు గురయ్యాడని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద విషయంపై బాలుడి తల్లి విశాఖపట్నం త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అక్కడ కేసు నమోదు చేసి పోడూరు పోలీస్‌స్టేషన్‌కు కేసును రిపోర్టు చేశారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top