వరంగల్‌లో సివిల్స్ పరీక్ష


- యూపీఎస్సీ నిర్ణయం ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ

- ఆగస్టు 7న తొలిసారి పరీక్ష

- వరంగల్‌కు అరుదైన గుర్తింపు




వరంగల్: విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌కు మరో అరుదైన గుర్తింపు దక్కింది. దేశంలోనే అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ఇక నుంచి వరంగల్‌లోనూ జరగనుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తాజాగా విడుదలైన సివిల్స్ సర్వీసెస్-2016 పరీక్ష నోటీఫికేషన్‌లో ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాన్ని వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. తెలంగాణలో ఇప్పటి వరకు కేవలం హైదరాబాద్‌లోనే సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రం ఉండేది. తాజాగా వరంగల్‌లోనూ ఏర్పాటు చేస్తుండడంతో ఎక్కువమంది అభ్యర్థులకు సౌకర్యంగా ఉండనుంది. సివిల్స్ పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య సైతం పెరగనుంది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్-2016 పరీక్ష నిర్వహణకు ఏప్రిల్ 27న యూపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 7న ఈ పరీక్ష నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా 74 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలో ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు.



వరంగల్‌కు మరొకటి.. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణ విషయంలో వరంగల్‌కు ఇప్పటికే గుర్తింపు ఉంది. జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) వరంగల్‌లో సెంటర్ ఉంది. తాజాగా సివిల్స్ పరీక్ష నిర్వహణ కేంద్రం ఏర్పాటవుతోంది. నిర్వహణతో ఉత్తర తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల అభ్యర్థులకు ఉపయోగపడుతుంది. వరంగల్‌లోని పలు ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు సివిల్స్ పరీక్షలకు హాజరవుతుంటారు. వరంగల్‌లోనే పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల రవాణా, వసతి ఖర్చులు తగ్గనున్నాయి. ఎక్కువ మంది అభ్యర్థులకు మేలు జరగనుంది. రైల్వే, రోడ్డు రవాణా పరంగా వరంగల్‌కు మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి. ఉత్తర, దక్షిణ భారతదేశాలకు వరంగల్ రవాణా పరంగా అనుసంధానంగా ఉంటుంది. ఈ కారణాలతో సివిల్స్ పరీక్షకు వరంగల్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యూపీఎస్సీ నిర్ణయించింది.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top