తవుడు లారీలో గంజాయి రవాణా

తవుడు లారీలో గంజాయి రవాణా - Sakshi

చింతలపూడి : గంజాయి రవాణా చేస్తున్న ముఠాను చింతలపూడి పోలీసులు మంగళవారం చాకచక్యంగా పట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి గుట్టుగా గంజాయి తరలిస్తున్న ముఠాను అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ.56 లక్షల విలువైన 1,123 కేజీల గంజాయితో పాటు (ఏపీ 27యూ 4479) నెంబర్‌ గల లారీని స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్‌ టి మైఖేల్‌రాజ్‌ సమక్షంలో పంచనామా నిర్వహించి పట్టుబడ్డ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకట్రావు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణా మీదుగా రాష్ట్రంలోకి ఒక ముఠా గంజాయి స్మగ్లింగ్‌ చేస్తున్నట్టు సమాచారం రావడంతో చింతలపూడి సీఐ జి.దాసు సిబ్బందితో కలిసి ఫాతిమాపురం చెక్‌ పోస్ట్‌ వద్ద తెల్లవారుఝామున వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో తవుడులోడుతో వస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా గంజాయి తరలిస్తున్న విషయం బయట పడింది. ఈ ముఠా గంజాయిని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్‌లోని తాడేపల్లిగూడెం, విజయవాడ వంటి వాణిజ్య కేంద్రాలకు తవుడు లోడుల్లో అనుమానం రాకుండా తరలిస్తున్నారు. గంజాయిని 35 కేజీల చొప్పున 31 బ్యాగుల్లో ప్యాక్‌ చేసి తరలిస్తున్నట్టు పేర్కొన్నారు. తమ విచారణలో విజయవాడకు చెందిన శివశంకర్‌రెడ్డి ప్రధాన నిందితునిగా గుర్తించామన్నారు. డ్రైవర్‌కు గన్నవరం జైల్‌లో నేరస్తులతో ఏర్పడిన పరిచయంతో గంజాయి రవాణా ముఠాతో చేతులు కలిపినట్టు చెప్పారు. గుడివాడకు చెందిన లారీ డ్రైవర్‌ శివరాం ప్రసాద్, విజయవాడకు చెందిన లారీ ఓనర్‌ షేక్‌ నాగుల్‌ మీరాలను విచారిస్తే ఈ గంజాయి ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు. ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయన్న పూర్తి విషయాలు తెలుస్తాయని డీఎస్పీ చెప్పారు. గంజాయి తరలిపోతున్న సమాచారం మేరకు చాకచక్యంగా నిందితులను పట్టుకున్న సీఐ దాసును, ఇన్‌చార్జి ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్‌ను, చింతలపూడి స్టేషన్‌ సిబ్బందిని అభినందించారు. 

సరిహద్దు రాష్ట్రాల వల్లే.. 

ఆంధ్రా, తెలంగాణా సరిహద్దు కావడంతో రాష్ట్రాలు దాటి గంజాయి అక్రమంగా మన రాష్ట్రంలోకి రవాణా చేస్తున్నారు. తవుడు లారీల్లో అయితే ఎవరికీ అనుమానం రాదన్న దీమాతో పకడ్బందీగా ప్యాక్‌ చేసి తవుడు బస్తాల మాటున చేరవేస్తున్నారు. జిల్లాలోని తాడేపల్లిగూడెం, కృష్ణాజిల్లా విజయవాడ కేంద్రాలుగా భారీగా నిల్వ చేసి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించి రూ.కోట్లు గడిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన ఈ గంజాయిని విచ్చల విడిగా అమ్మకాలు చేస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కిలో గంజాయి రూ.5 వేల నుంచి రూ.10 వేలు పలుకుతుండటంతో కష్టమైనా ఈ వ్యాపారానికి సిద్ధమవుతున్నారు. సిగరెట్లు, బీడీలు, చుట్టలు వంటి వాటిలో గంజాయి పొడిని నింపి అమ్ముతున్నారు. సామాన్యులు, కూలీలు, విద్యార్థులే టార్గెట్‌గా ఈ ముఠా గంజాయిని తరలిస్తూ చెలరేగిపోతున్నారు. ఈ దారిలో మరిన్ని చెక్‌ పోస్టులు పెట్టి గంజాయి రవాణాను అరికట్టాలని పలువులు కోరుతున్నారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top