చీకటి ఒప్పందం

చీకటి ఒప్పందం - Sakshi

  • మహారాష్ట్రకు తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడతారా?

  • మహా ఒప్పందాన్ని నిరసిస్తూ నల్లజెండాలతో కాంగ్రెస్‌ ర్యాలీ

  • కేసీఆర్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన నాయకులు 

  • టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులను దద్దమ్మలంటూ పొన్నం వ్యాఖ్య

  • సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌ :  సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై మహారాష్ట్ర సర్కారుతో కేసీఆర్‌ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని చరిత్రలో నిలిచిపోయే చీకటి ఒప్పందమని కాంగ్రెస్‌ పార్టీ అభివర్ణించింది. తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మించేందుకు గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని పక్కనపెట్టి 148 మీటర్ల ఎత్తుకు కుదించేందుకు అంగీకరించడం ఏమిటని ఆ పార్టీ నాయకులు ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను మహారాష్ట్రకు తాకట్టు పెడుతోందని మండిపడ్డారు. మంగళవారం జరిగిన ‘మహా’ ఒప్పందాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్‌లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. వివిధ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు నల్లజెండాలు ప్రదర్శిస్తూ గీతాభవన్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ తీశారు. సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, మాజీమంత్రి డి.శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం, ఎస్సీసెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్, జెడ్పీ మాజీ చైర్మన్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌సహా పార్టీ నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ తీరుపై నిప్పులు చెరిగారు.  

    కాంగ్రెస్‌ హయాంలో 152 మీటర్లకు ఒప్పందం : జీవన్‌రెడ్డి

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం వెంగళ్రావు, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా పనిచేసిన కాలంలో ప్రాణహిత నదిపై తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మించేందుకు నాటి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిందని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వం అందుకు భిన్నంగా 148 మీటర్ల ఎత్తులోనే ప్రాజెక్టును నిర్మించేందుకు ఒప్పందం చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందన్నారు. మరి కేసీఆర్‌ సాధించేదేమిటో ఆయనకే తెలియాలని విమర్శించారు. తమ్మిడిహట్టి నుంచి 72 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా నీరందించే అవకాశమున్నప్పటికీ దానిని కాదని మేడిగడ్డ వద్ద ప్రాజెక్టును నిర్మించాలనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. వంద మీటర్ల ఎత్తున్న మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించి 120 మీటర్లున్న అన్నారం, 134 మీటర్లున్న సుందిళ్ల, 148 మీటర్ల ఎత్తున ఎల్లంపల్లి ప్రాజెక్టుల మీదుగా 550 మీటర్ల ఎత్తున్న మల్లన్నసాగర్‌కు లిఫ్ట్‌ల ద్వారా నీటిని తరలించాలనుకోవడం ఆశ్చర్యమేస్తోంది. నీటిని ఎత్తిపోసేందుకు అయ్యే విద్యుత్‌కే కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ప్రాజెక్టు అంచనాల పెంపుతో వేల కోట్లు ఖర్చు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అప్పుల వాటా రూ.63 వేల కోట్లయితే... రాష్ట్రం ఏర్పడ్డాక రెండేళ్ల పాలనలోనే కేసీఆర్‌ రూ.33 వేల కోట్లు అప్పు తెచ్చారన్నారు. మరో రూ.8 వేల కోట్ల అప్పుకు ఆమోదం పొందారన్నారు. తద్వారా పుట్టే ప్రతి బిడ్డపై రూ.10వేల అప్పు మోపారని ధ్వజమెత్తారు. 

    మా నీళ్లు మెదక్‌కు తరలిస్తే ఊరుకోం : శ్రీధర్‌బాబు

    తమ్మడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మిస్తే మహారాష్ట్రలో మూడు వేల ఎకరాల భూమి ముంపుకు గురవుతుందని అప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్‌ ధర్నా చేశారన్నారు. ఫడ్నవీస్‌ సీఎం అయ్యాక ఆయన ఒత్తిడికి తలొగ్గిన కేసీఆర్‌ 148 మీటర్ల ఎత్తులోనే ప్రాజెక్టును నిర్మించేందుకు అంగీకరిస్తూ ఒప్పందం చేసుకున్నారని అన్నారు. మహారాష్ట్రంలో మూడు వేల ఎకరాలు ముంపుకు గురవుతుందని ఎత్తు తగ్గిస్తున్న∙కేసీఆర్‌ మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టుల వల్ల జిల్లాలోని వేలాది ఎకరాల ముంపుకు గురి చేస్తున్నాడన్నారు. అసలు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) లేకుండా శంకుస్థాపన చేయడమే విడ్డూరమన్నారు. కరీంనగర్‌ జిల్లాలో ప్రాజెక్టులు కడుతూ ఇక్కడి ప్రజలకు నీళ్లివ్వకుండా మెదక్‌ జిల్లాకు నీళ్లు తరలించేందుకు కుట్ర జరుగుతోందని విమర్శించారు. జిల్లా అవసరాలు తీర్చిన తర్వాతనే నీటిని ఇతర ప్రాంతాలకు ఇవ్వాలని, లేకుంటే చూస్తుంటే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. 

    కేసీఆర్‌ ఆటలు సాగనివ్వం : పొన్నం ప్రభాకర్‌

    ‘మార్చి 8న మహారాష్ట్రకు వెళ్లి ఆ రాష్ట్ర సీఎం ఫఢ్నవీస్‌తో ఒప్పందం చేసుకున్నావ్‌. తెలంగాణ వచ్చాక ఎంత సంతోషమైందో... ఇప్పుడు అంతే సంతోషమని చెప్పినవ్‌. హైదరాబాద్‌ వచ్చాక ఊరేగింపు చేసుకున్నవ్‌. మీ పార్టీవాళ్లతో కేసీఆర్‌ గొప్ప ఒప్పందం చేశాడన్పించావ్‌. కాళేశ్వరం వెళ్లి మేడిగడ్డ వద్ద శంకుస్థాపన చేశావ్‌. ఇన్ని చేసిన తర్వాత మళ్లీ ఒప్పందం చేసుకోవడానికి సిగ్గులేదా? ఈరోజు పత్రికల్లో కోట్లు ఖర్చు చేసి వేసుకున్న యాడ్స్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్‌ కట్టినవే కదా! నీ అయ్య కట్టిండని పత్రికల్లో యాడ్స్‌ వేసుకున్నవా? తెలంగాణను ముంచేందుకు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంటుంటే... తెలంగాణ బీజేపీ మాదిరిగా కాంగ్రెస్‌ నోరు మూసుకోదు. చూస్తు ఊరుకోం. నిలదీస్తాం. జిల్లాలను విభజిస్తూ కరీంనగర్‌ గౌరవానికి భంగం కలిగిస్తుంటే టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కనీసం మాట్లాడకుండా చచ్చిన పాముల కంటే హీనంగా పడి ఉన్నరు. కేసీఆర్‌ తీరును ఎండగడుతూ పార్టీలు, ప్రజాసంఘాలు, జర్నలిస్టులు ధర్నా చేస్తుంటే సీఎం దృష్టికి తీసుకెళ్లే ధైర్యంలేని దద్దమ్మలు. కేసీఆర్‌కు ప్రజలను కలవాలంటేనే ఎలర్జీ. ఆయన ఆటలు ఇక సాగనీయం’ అంటూ పొన్నం ప్రభాకర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

    కమీషన్‌ వచ్చే పనులే చేస్తుండు : కటుకం మృత్యుంజయం

    కేసీఆర్‌ కమీషన్‌ వచ్చే పనులే చేస్తుండు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని డీసీసీ చైర్మన్‌ కటుకం మృత్యుంజయం విమర్శించారు. వైఎస్సార్‌ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేస్తే కాంగ్రెస్‌కు పేరొస్తుందనే భయంతో డిజైన్లు మార్చి అంచనాలను పెంచి కమీషన్లు దండుకుంటున్నాడని దుయ్యబట్టారు.  

     

     
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top