మళ్లీ మొదటికి.. | Sakshi
Sakshi News home page

మళ్లీ మొదటికి..

Published Wed, Jul 5 2017 1:43 AM

మళ్లీ మొదటికి..

ఎట్టకేలకు ఉపాధ్యాయుల బదిలీ షెడ్యూల్‌
మొదటికొచ్చిన రేషనలైజేషన్‌
అధికారులకు కొత్త తలనొప్పులు
స్థాన చలనం కోసం 9 వేల మంది దరఖాస్తు
67 ప్రాథమిక పాఠశాలలు మూత
యూపీ స్కూల్స్‌ 100కు తగ్గే అవకాశం


నెల్లూరు (టౌన్‌) : ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు తాజా షెడ్యూల్‌ ప్రకటించింది. దీంతో హేతుబద్ధీ్దకరణ (రేషనలైజేషన్‌) వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. రేషనలైజేషన్, వెబ్‌ కౌన్సెలింగ్‌ను రద్దు చేయాలంటూ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టిన విషయం విదితమే. ప్రభుత్వం తాత్సారం చేయడంతో నెల రోజులపాటు గందరగోళం నెలకొంది. బదిలీలకు సంబంధించిన జీఓలో సవరణలు చేయగా.. ఉపాధ్యాయులు మెట్టు దిగకపోవడంతో పాయింట్లు, ఇతర నిబంధనల మార్పు, పాత పద్ధతిలోనే కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు అంగీకరించిన ప్రభుత్వం తాజాగా రేషనలైజేషన్, బదిలీలకు సంబంధించి కొత్త షెడ్యూల్‌ విడుదల చేసింది.

విద్యార్థులకూ తప్పని  అవస్థలు
తాజా షెడ్యూల్‌ జిల్లా విద్యాశాఖ అధికారులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టాయి. ఇప్పటికే పూర్తిచేసిన రేషనలైజేషన్‌ ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. పాఠశాలలు ప్రారంభించి నెల రోజులు కావస్తోంది. ఈ నేపథ్యంలో రేషనలైజేషన్‌ ప్రక్రియ చేపట్టి తగినంత మంది విద్యార్థులు లేని పాఠశాలల్ని మూసివేయడం, వారిని సమీపంలోని పాఠశాలలో విలీనం చేయడం కష్టతరం కానుంది. ఇదిలావుంటే.. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు పాయింట్లపై కుస్తీ పడుతూ విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో బోధన పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. ఫలితంగా విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. తాజా షెడ్యూల్‌ విడుదలతో మరో నెల రోజులపాటు బోధన మొదలయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో విద్యార్థులు చదువులో రెండు నెలలపాటు వెనుకబడే దుస్థితి నెలకొంది. కార్పొరేట్‌ పాఠశాలల్లో తొలి విడత సిలబస్‌ పూర్తిచేసి ఫార్మెటివ్‌ పరీక్షలకు సిద్ధమవుతుంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు.

67 ప్రాథమిక పాఠశాలల మూసివేత
గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలో రేషనలైజేషన్‌ ప్రక్రియను పూర్తి చేశారు. తాజా నిర్ణయం వల్ల ఈ కార్యక్రమం మొదటికొచ్చింది. ప్రస్తుత అంచనాల ప్రకారం 63 ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా మూతపడనున్నాయి. వీటితోపాటు 100 ప్రాథమికోన్నత పాఠశాలల స్థాయిని తగ్గించి ప్రాథమిక పాఠశాలలుగా మారుస్తారు. ఉన్నత పాఠశాలల విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని అధికారులు చెబుతున్నారు.

 6 వేల మందికి బదిలీ తప్పనిసరి
జిల్లాలో 9 వేల మంది ఉపాధ్యాయులు బదిలీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ఒకేచోట 8 ఏళ్లు పనిచేసిన ఉపాధ్యాయులు 6 వేల మందికి పైగా ఉన్నట్టు సమాచారం. వీరంతా తప్పనిసరిగా బదిలా అవుతారని చెబుతున్నారు. వీరుకాకుండా మరో 3 వేల మంది బదిలీ కోసం విజ్ఞాపన దరఖాస్తు చేకున్నారు. వీరిలో ఎంతమందికి బదిలీ అవుతుందనేది తేలాల్సి ఉంది.

మిగులు ఉపాధ్యాయులు 500 మంది
తాజా మార్గదర్శకాల ప్రకారం చూస్తే జిల్లాలో 500 మంది మిగులు ఉపాధ్యాయులుగా ఉంటారని భావిస్తున్నారు. వీరందరినీ కొరత ఉన్న పాఠశాలలకు సబ్జెక్టుల వారీగా నియమిస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

 
Advertisement
 
Advertisement