వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోలేదు..

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోలేదు: ధర్మాన - Sakshi


హైదరాబాద్‌ : 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోలేదని  ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు.  ప్రతిష్టాత్మకంగా జరుగుతోన్న పార్టీ ప్లీనరీ సమావేశంలో ఆయన.. పార్టీ జనరల్‌ సెక్రటరీ నివేదినకు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ అధికారంలో ఉండి ఎన్నికల్లో ఓడితే అది ఓటమి అని, అలాగే ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్‌ఆర్ సీపీ బలపడిందే కానీ బలహీన పడలేదన్నారు.


మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసమే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించడం జరిగిందన్నారు. మొదట ఇద్దరితో మొదలైన పార్టీ ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ గెలుస్తూనే ఉందన్నారు. పార్టీ ప్రారంభం నుంచి క్రమంగా బలపడుతూనే  ఉందని, మొదట ఒక సీటు, తర్వాత 17 సీట్లు, ఆ తర్వాత 67 సీట్లు గెలిచామని అన్నారు. ప్రతిసారీ పార్టీ సీట్ల సంఖ్య పెరుగుతూనే ఉందని ధర్మాన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో 147 సీట్లు అయినా రావొచ్చని అన్నారు. మూడేళ్లుగా ప్రజల గొంతును వినిపిస్తున్నామని, ప్రభుత్వ అవినీతి, అక్రమాలను అడుగడుగునా ఎండగడుతున్నామని ఆయన తెలిపారు.



పార్టీ ప్రారంభం నుంచి ఎన్నో కష్టాలు చూశామని, అధ్యక్షుడి మొదలుకుని సాధారణ కార్యకర్త వరకు జైల్లో పెట్టారని ధర్మాన అన్నారు. ప్రభుత్వం కక్ష కట్టి అక్రమ కేసులు బనాయించి హింసిస్తోందన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ  ఇబ్బంది పెడుతూనే ఉన్నారని ధర్మాన పేర్కొన్నారు. అయినా పార్టీలో అందరి సహకారం,  అండదండలతో ముందుకు సాగుతూనే ఉన్నామన్నారు.


అయితే అధికారంలో ఉండటమే గెలుపు కాదని, ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరుఫున పోరాటం చేయడమే పెద్ద విజయమన్నారు. దేశంలోని ఏ ప్రతిపక్షం చేయని విధంగా ఆంధ్రాలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ ప్రలోభాలకు లొంగకుండా పోరాడుతోందని, ప్రజల తరఫున పోరాడుతున్నందుకే ఎన్నో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రజల గొంతును వినిపించడానికి, వారి సమస్యలపై పోరాడుతున్న రాజన్న బిడ్డ  వైఎస్‌ జగన్‌ కు అందరం అండగా నిలుద్దామని ధర్మాన పిలుపునిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top