సమన్యాయం కోసం సమర దీక్ష


నిరంకుశ నిర్ణయంపై నేటి నుంచి విజయమ్మ సత్యాగ్రహం

గుంటూరులో ఆమరణ దీక్షకు ఏర్పాట్లు పూర్తి

గుంటూరు బస్టాండ్ సమీపంలో దీక్షా శిబిరం...

విజయమ్మ దీక్షపై ప్రజలు, రాజకీయ వర్గాలు, జాతీయ మీడియాలో ఉత్కంఠ

 

సాక్షి, గుంటూరు/హైదరాబాద్: ‘అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయలేనపుడు, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కరించ లేనపుడు రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలి’ అని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ సోమవారం నుంచి గుంటూరు వేదికగా చేపట్టనున్న ఆమరణ నిరాహారదీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.



గుంటూరులోని ఆర్‌టీసీ బస్టాండ్‌కు సమీపంలో దీక్షా శిబి రాన్ని ఏర్పాటు చేశారు. విజయమ్మ సోమవారం హైదరాబాద్ నుంచి బయల్దేరి విమానంలో ఉదయం 9.45 గంటలకు గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 10.30 గంటలకు దీక్షా ప్రాంగణానికి చేరుకుంటారు. దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, సర్వమత ప్రార్థనల్లో పాల్గొంటారు.



అనంతరం ‘సమర దీక్ష’ ప్రారంభిస్తారు. విజయమ్మ దీక్షకు మద్దతు తెలిపేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివస్తున్నాయి.  రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉద్యమం ఉవ్వెత్తున రగులుతున్న తరుణంలో విజయమ్మ సమర దీక్షతో పరిస్థితులు ఎలాంటి మలుపులు తిరుగుతాయోనని సామాన్య ప్రజలతో పాటు, రాజకీయ వర్గాలు, జాతీయ మీడియాల్లో తీవ్ర ఉత్కంఠ రేగుతోంది. ఒక పార్టీ గౌరవాధ్యక్షురాలు, అందునా ఒక మహిళ తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ ఆమరణ నిరాహారదీక్ష  చేయాలని నిర్ణయం తీసుకున్న నాటి నుంచే దీనిపై విసృ్తతంగా చర్చ జరుగుతోంది.



ఏకపక్షంగా, నిరంకుశ వైఖరితో అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేస్తున్నారన్న నిర్ణయం వెలువడిన నాడే సీమాంధ్ర ప్రాంతం అగ్నిగుండంగా మారింది. జూలై 31వ తేదీ మొదలు మూడు వారాలుగా ఉద్యమంతో అట్టుడుకుతోంది. విద్యార్థులు, యువకులు, మహిళలు, ఉద్యోగులు, రైతులు.. అన్ని వర్గాల వారూ ఈ ఏకపక్ష విభజనను నిరసిస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వస్తున్నారు. సరిగ్గా ఇలాంటి తరుణంలో విజయమ్మ చేయనున్న దీక్షకు సకల వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.



ఉద్యమానికి మరింత ఊపు

రాష్ట్ర ప్రజల హృదయాల్లో కొలువై ఉన్న దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సతీమణిగా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు, అందరికీ సమన్యాయం చేయాలని కోరుతూ ఈ వయసులో కూడా విజయమ్మ ఆమరణ దీక్ష చేపట్టనుండటం.. ఇప్పటికే రగిలిపోతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి మరింత ఊపునిచ్చినట్లు అవుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జాతీయ మీడియా కూడా ఇప్పటి వరకూ జరిగిన ఉద్యమం ఒక ఎత్తు, విజయమ్మ దీక్ష ప్రారంభించిన తరువాత జరగబోయే ఆందోళన మరో ఎత్తుగా ఉండబోతున్నట్లు అంచనాలు వేస్తోంది.



అన్యాయంపై ఆదినుంచీ ప్రతిఘటన

వాస్తవానికి  అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరుగుతోందని తెలిసీ తెలియగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ అన్యాయాన్ని ప్రతిఘటించటం మొదలు పెట్టింది. విభజన కసరత్తు జరుగుతుందని తెలిసీ తెలియగానే కేంద్ర హోంమంత్రి షిండేకు విజయమ్మ లేఖ రాశారు. అన్ని ప్రాంతాల ప్రయోజనాలను పరిర క్షించాలని విజ్ఞప్తి చేశారు. అయినా కాంగ్రెస్ పట్టించుకోకుండా ఏకపక్షంగా విభజన చేసే దిశగా ముందుకు వెళ్లింది.



ఈ విషయాన్ని గ్రహించిన వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు జూలై 25వ తేదీన సీడబ్ల్యూసీ విభజన నిర్ణయం వెలువడటానికి ముందే పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అయినా ప్రయోజనం లేకపోవటంతో జగన్‌మోహన్‌రెడ్డి, విజయమ్మ తమ పదవులకు రాజీనామాలు చేశారు. కాంగ్రెస్ మొండిగా ముందుకు వెళుతూ ఉండటంతో పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి ఆమరణ నిరాహారదీక్షకు దిగారు.



గుంటూరులో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు

గుంటూరులో విజయమ్మ సమర దీక్ష ఖరారు కాగానే పార్టీ నేతలు యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించారు. వర్షం వల్ల ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. 100 అడుగుల పొడవు, 50 అడుగుల వెడల్పుతో వాటర్ ప్రూఫ్ షెడ్డు, 50 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో విజయమ్మ దీక్షకు కూర్చొనే స్టేజీని ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా పార్టీ శ్రేణులు నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు చేయాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది.

 

విజయమ్మ దీక్షకు కదలిరండి

ఉపాధ్యాయులకు వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ పిలుపు



సాక్షి, హైదరాబాద్: వైఎస్ విజయమ్మ సోమవారం నుంచి చేపట్టనున్న దీక్షకు వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ మద్దతు ప్రకటించింది. ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున దీక్షా శిబిరానికి కదలి రావాలని ఫెడరేషన్ కన్వీనర్ ఓబుళపతి, స్టీరింగ్ కమిటీ సభ్యులు జాలిరెడ్డి, శంకరరావు, టి.వి.రమణారెడ్డి, అశోక్‌కుమార్‌రెడ్డి, రియాజ్‌హుస్సేన్, స్వామిరాజ్, అప్పారావు ఆదివారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top