ఎందుకు పడతాం!

ఎందుకు పడతాం! - Sakshi


విజయవాడలో టీడీపీ ఎంపీ కేసీనేని నాని నడిరోడ్డుపై సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిని నిలదీసి... ఆయన గన్‌మన్‌పై చేయిచేసుకున్నారు. ఆ సంఘటన అప్పట్లో చాలా వివాదాస్పదమైంది. అంతలా కాకున్నా... విజయనగరంలో కేంద్ర మంత్రి ఏకంగా అధికారుల సమీక్షలో ఎన్‌హెచ్‌ఏఐ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌పై విరుచుకుపడ్డారు. అయితే ఈసారి ఆ అధికారి మౌనంగా ఉండలేదు. తిరిగి అంతే దీటుగా సమాధానమిచ్చి... అందరినీ ఆశ్చర్యపరిచారు. తప్పు చేయనపుడు ఒప్పుకోవాల్సిన అవసరం లేదంటూ తెగేసి చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.



సాక్షి ప్రతినిధి, విజయనగరం:

అధికారం అండతో అధికారులపై విరుచుకుపడితే సహించలేరనడానికి విజయనగరం కలెక్టరేట్‌ సమావేశ మందిరం సాక్షిగా జరిగిన ఓ సంఘటన ఉదాహరణగా నిలుస్తోంది. జిల్లా కేంద్రంలో రైల్వే వంతెనకు సంబంధించి అప్రోచ్‌ రోడ్డు నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజుకు, జాతీయ రహదారుల శాఖ అధికారికి మధ్య జరిగిన వాగ్వివాదం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్‌తో సహా అనేక మంది అధికారుల సమక్షంలో జరిగిన సమావేశంలో వారి సంవాదం ప్రభుత్వాధికారుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తికి అద్దం పట్టింది. అంతేకాదు కొన్ని విషయాలు కేంద్ర మంత్రికి తెలియకుండా ఆయన కోటరీలోని కొందరు దాచిపెడుతున్నారన్న విషయం రూఢీ అయ్యింది.



అసలేం జరిగిందంటే...

జిల్లాలోని పలు అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు, రాష్ట్ర మంత్రి సుజయ కృష్ణ రంగారావు ఇక్కడి కలెక్టరేట్‌లో సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్, ఎస్పీ పాలరాజుతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అంశాల వారీగా సమీక్షిస్తున్న మంత్రి పట్టణంలో రైల్వే శాఖ రూ.13.4 కోట్లతో నిర్మిస్తున్న వంతెనకు అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం విషయంలో జాప్యం జరుగుతోందంటూ జాతీయ రహదారుల విభాగం(ఎన్‌హెచ్‌ఏఐ) సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ మనోహర్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అధికారి కూడా అంతే దీటుగా సమాధానమిచ్చారు. తమకు ప్రతిపాదనలు తమకు అందలేదని అందితే నిర్మించడానికి, తాము సిద్ధంగా ఉన్నామని ఆయన వివరించారు. ఆ విషయాన్ని తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని మంత్రి అశోక్‌ గట్టిగా అడిగే సరికి అంతే తీవ్ర స్వరంతో ఇప్పటికే పలుమార్లు ఆ విషయాన్ని మీ ఓఎస్‌డీ అప్పలరాజుకు చెప్పామని ఆయన ఆ విషయాన్ని మీకు చెప్పకపోవడం మా తప్పు కాదని స్పష్టంచేశారు.



ఓఎస్‌డీ నిర్వాకం వల్లే...

నిజానికి రైల్వే అధికారులు సరైన క్రమంలో ప్రతిపాదనలు పంపించలేదనేది ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల వాదన. ఆ విషయం తనకెందుకు చెప్పలేదనేది మంత్రి ఆగ్రహం. అయితే అసలు మూలం అప్పలరాజు దగ్గర ఉంది. తనకు అధికారులు చెప్పిన ఏ విషయాన్నీ ఆయన మంత్రికి తెలియపరచడంలేదు. విషయం తెలియక, ఎందుకు జాప్యం జరుగుతుందో అర్ధం కాక అశోక్‌ గజపతి తొమ్మిది జిల్లాల అధికారిని నలుగురిలో నిలదీశారు. మంత్రి వాదనకు తలవంచితే తమ వైపు తప్పున్నట్లు అంగీకరించినట్లవుతుందని భావించిన ఎస్‌ఈ ఏ మాత్రం తగ్గలేదు. చివరి వరకూ తన వాదనను బలంగానే వినిపించారు. ఇదే విషయాన్ని ఆయన ‘సాక్షి ప్రతినిధి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ చెప్పారు..మంత్రికి ఎదురు చెప్పాలనే ఉద్దేశం తనకు లేదని, అయితే చేయని తప్పుకు నలుగురిలో నిలదీస్తుంటే ఒప్పుకోలేకపోయానని ఎస్‌ఈ అన్నారు. రైల్వే శాఖ అధికారులు కాగితంపై మామూలుగా రాసేసి రూ.3.4 కోట్లు ఇమ్మంటున్నారని, పద్ధతి ప్రకారం అడిగితే ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని ఓఎస్‌డీకి కూడా చెప్పామని ఆయన వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top