ఏకపక్ష చర్యలు!


సాక్షి ప్రతినిధి, కడప : తెలుగుదేశం నేతలు ఆదేశించడమే ఆలస్యం.. జిల్లా యంత్రాంగం వారి పనులు చకచకా చక్కబెడుతోంది. డీసీసీబీ చైర్మన్ ఐ.తిరుపేలురెడ్డిని నాలుగు గంటల్లో పదవీచ్యుతున్ని చేసిన వైనం మరవకముందే ఇన్‌చార్జ్ చైర్మన్ ఎన్ ఆంజనేయులు యాదవ్‌తోపాటు మరో డెరైక్టర్ చిన్నఓబులేసు పదవుల్ని రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. టీడీపీ నేతల తరహాలోనే వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేస్తే మాత్రం విచారణ కొనసాగుతూనే ఉంటుంది. ఒకే తరహా ఘటనల్లో జిల్లా యంత్రాంగం పరస్పర విరుద్ధంగా వ్యవహరిస్తోంది.

 

  సహకార శాఖ యాక్టులోని లొసుగుల ఆధారంగా డీసీసీబీ చైర్మన్ తిరుపేలురెడ్డి, ఇన్‌చార్జ్ చైర్మన్ ఆంజనేయులు యాదవ్, డెరైక్టర్ చిన్న ఓబులేసు పదవుల్ని రద్దు చేస్తూ అధికారులు ఉత్తర్వులిచ్చారు. అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గిన యంత్రాంగం ఏకపక్షంగా రిపోర్టులు ఇస్తూ పై నిర్ణయాలకు ఆస్కారం ఇచ్చారు. జిల్లా అత్యున్నత అధికారి మరీ బరితెగించి తీవ్ర స్థాయిలో మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో సిఈఓలు ఆమేరకు అనుగుణంగా రికార్డులు రూపొందిస్తున్నట్లు సమాచారం. అందులో బాగంగానే వేల్పుల, సరస్వతిపల్లె సొసైటీ రికార్డులు వారికి అనుగుణంగా మలిచినట్లు తెలుస్తోంది. ఆమేరకు ఇరువురు డెరైక్టర్లు పదవుల్ని కోల్పోవలసిన దుస్థితి ఏర్పడిందని పలువురు వివరిస్తున్నారు.

 

 అవే ఆరోపణలు ఆధారాలతో చేసినా....

  నిబంధనలకు విరుద్ధంగా డెరైక్టర్లు పదవులు కల్గి ఉన్నారని టీడీపీ నేతలు ఫిర్యాదుల మేరకు ఇద్దరు డెరైక్టర్ల పదవులు రద్దు చేశారు. అవే ఆరోపణలతో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సహకార యాక్టు సెక్షన్ 21 ఏ 4 ప్రకారం ఎం చిన్నపుల్లయ్య డెరైక్టర్‌గా అనర్హుడుగా ఆధారాలతో బుధవారం ఫిర్యాదు చేశారు. విచారణతో కాలయాపన చేయడం మినహా అధికారులల్లో చలనం లేదు. టీడీపీ నేతలు ఫిర్యాదులపై ఆగమేఘలపై చర్యలు చేపట్టే యంత్రాంగం ఆధారాలతో ఫిర్యాదులు చేసినా స్పందించడం లేదు. గొర్రెల పెంపకందారుల కోఆపరేటివ్ యూనియన్, డీసీసీబీ డెరైక్టర్, గొర్రెల పెంపకం దారుల నానుబాలపల్లె అధ్యక్షుడుగా చిన్నపుల్లయ్య మూడు పదవుల్లో ఉన్నారు.

 

 ఆమేరకు ఆధారాలతో ఫిర్యాదును సమర్పించారు. ఇప్పటికి ఎలాంటి చర్యల్లేవు. మే 2న డీసీసీబీ చైర్మన్ ఎన్నికలు నిర్వహించి ఆ పదవి టీడీపీ వారికి కట్టబెట్టే విధంగా యంత్రాంగం పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ విషయమై డీసీఓ ఫోమేనాయక్ వివరణ కోరగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఫిర్యాదు మేరకు జిల్లా రిజిస్ట్రార్‌తో విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. ఆమేరకు రికార్డులు పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top