వీడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్యకేసు మిస్టరీ | Sakshi
Sakshi News home page

వీడిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హత్యకేసు మిస్టరీ

Published Wed, Aug 19 2015 1:42 AM

The engineer left the murder mystery

అమలాపురం టౌన్ : అమలాపురం కల్వకొలను వీధికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నార్ని చంద్రశేఖర్ నాయుడు (24) హత్యకేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఇద్దరిని పట్టణ సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ సోమవారం అరెస్టు చేశారు. మేనమామ కుమారుడైన పదో తరగతి విద్యార్థే ఈ హత్యకు సూత్రధారి. చంద్రశేఖర్‌ను హత్యకు పాల్పడిన నిందితుల్లో ఒకరు 17 ఏళ్ల పాలిటెక్నిక్ విద్యార్థి కూడా ఉన్నాడు. కేసు వివరాలను డీఎస్పీ ఎల్. అంకయ్య, సీఐ శ్రీనివాస్ మంగళవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. గత నెల 24న ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం సముద్రతీరంలో చంద్రశేఖర్ నాయుడు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఒకరు హతుడి మేనమామ కుమారుడు ఒకరు కాగా, పాలిటెక్నిక్ విద్యార్థి మరొకరు. వీరిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. మరో ఇద్దరు నిందితులు నల్లా దుర్గావెంకటసాయిరామ్, నూకల దుర్గారావును పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నగలు, ఏటీఎం కార్డు, హత్యకు ఉపయోగించిన కర్రను స్వాధీనం చేసుకున్నారు.
 
 ఆస్తి తగాదాల వల్లే..
 అమలాపురం కల్వకొలను వీధికి చెందిన కల్వకొలను నారాయణరావుకు కుమారుడు లీలా బాలాజీ, కుమార్తె నార్ని వెంకట వరలక్ష్మి అనే చిలకమ్మ ఉన్నారు. వారిద్దరికీ వివాహాలు అయ్యాయి. కుమారుడి కుటుంబం, కుమార్తె కుటుంబం కల్వకొలను వీధిలో వేర్వేరు చోట్ల ఉంటున్నాయి. నారాయణరావు తన మనుమడు  చంద్రశేఖర్‌నాయుడి (కుమార్తె కుమారుడు)పై ఎక్కువగా ప్రేమ చూపేవారు. ఈ క్రమంలో కుమారుడి కొడుక్కి (టెన్త్ విద్యార్థి) ఇది నచ్చలేదు. ఆ రెండు కుటుంబాల మధ్య ఆస్తి తగాదాలు తలెత్తాయి. తన తాతకు చెందిన కోట్ల ఆస్తిని తన బావకు ఇచ్చేస్తాడని భావించి ఆ బాలుడు కక్షపెంచుకున్నాడు. ఎలాగైనా బావను అంతమొందించాలని పథకం పన్నాడు. అదే వీధికి చెందిన నల్లా దుర్గా వెంకటసాయిరామ్‌తో రూ.80 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. రూ.20 వేలు అడ్వాన్సుగా ఇచ్చాడు.
 
 హత్యకు పథకం పన్నిందిలా..
 సాయిరామ్ తన  స్నేహితులైన నూకల దుర్గారావు, పాలిటెక్నిక్ విద్యార్థిని సహాయకులుగా చేసుకుని గత నెల 24న  ఎస్.యానాం సముద్ర తీరంలో హత్య చేసేందుకు పథకం పన్నాడు. చంద్రశేఖర్‌కు సాయిరామ్ ఫోన్ చేసి ఎస్.యానాం బీచ్‌లో ఒక అమ్మాయి ఉంది. త్వరగా రమ్మని ఫోన్ చేశాడు. అప్పటికే సాయిరామ్ తన స్నేహితులైన దుర్గారావు, పాలిటెక్నిక్ విద్యార్థి కాపుకాసి ఉన్నారు. చంద్రశేఖర్ మోటారు సైకిల్‌పై బీచ్‌కు వచ్చాడు. కొద్దిసేపు బీచ్‌లో స్నానాలు చేసి ఫొటోలు తీసుకున్న అనంతరం చంద్రశేఖర్ తలపై ఈలకర్రతో బలంగా మోది, అతడి పీక నులిమి హత్య చేశారు.  మృతదేహాన్ని ఇసుకలో పాతిపెట్టారు. మృతుడి వద్ద ఉన్న బంగారు గొలుసు, ఉంగరం, మోటారు సైకిల్ తీసుకుని ఆ ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. రెండు రోజులకు చంద్రశేఖర్ మృతదేహం కెరటాల ఉధృతికి ఇసుకలోంచి బయట పడటం, అది తమ కొడుకుదేనని అతడి తల్లిదండ్రులు గుర్తించటం పాఠకులకు తెలిసిందే. ఇప్పుడు ఇద్దరి నిందితులను అరెస్ట్ చేశామని, మిగిలిన ఇద్దరు బాలురిని అరెస్టు చేయాల్సి ఉందని డీఎస్పీ అంకయ్య చెప్పారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన క్రైం పార్టీ హెడ్ కానిస్టేబుల్ అయితాబత్తుల బాలకృష్ణ, కానిస్టేబుళ్లు బత్తుల రామచంద్రరావు, వి.వరహాలు, గుత్తుల సాయిలను డీఎస్పీ అభినందించారు.
 

Advertisement
Advertisement