చిక్కిన ‘రబీ’


ముగిసిన సీజన్

50 శాతానికి మించిన వరిసాగు

లక్ష్యానికి మించి అపరాల సాగు

గతేడాదితో పోలిస్తే  తగ్గిన విస్తీర్ణం


 

విశాఖపట్నం:   ‘రబీ’ చిక్కింది. గత నాలుగైదేళ్లుగా ఖరీఫ్‌తో పోలిస్తే రబీ సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. తొలి‘పంట’ పండినప్పటికీ రెండో పంటకొచ్చే సరికి వరుణుడు పూర్తిగా ముఖం చాటేయడం.. సాగునీటి వనరులు తగ్గిపోవడంతో రైతు రబీ సాగుపై పెద్దగా ఆసక్తి చూపలేదు.



లక్ష్యానికి దూరంగా..

జిల్లాలో రబీ సాధారణ విస్తీర్ణం 38,961 హెక్టార్లు. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఊహించని దిగుబడులు రావడంతో అదే ఊపుతో రబీలో కూడా సాగు విస్తీర్ణం పెంచాలని వ్యవసాయశాఖ లక్ష్యాలను ఎంచుకుంది. ఈ ఏడాది 45వేల హెక్టార్లలో రబీ సాగు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ఆ మేరకు అవసరమైన విత్తనాలు కూడా  ద్ధం చేశారు. కానీ నవంబర్ వరకు అడపాదడపా పలుకరించిన వరుణుడు ఆ తర్వాత పూర్తిగా ముఖం చాటేశాడు. గతేడాది  37,618 హెక్టార్లలో  రబీ సాగవగా, ఈ ఏడాది 36వేల హెక్టార్లలో మాత్రమే సాగైంది. నాట్లు వేసే డిసెంబర్ నెలలో చినుకు కూడా రాలక పోవడంతో సాగునీటి వనరుల కింద తప్ప వరిసాగు చేసేందుకు రైతులు సాహసించలేకపోయారు. రబీలో సాధారణ వరి విస్తీర్ణం 5,784 హెక్టార్లు కాగా ఈ ఏడాది కనీసం ఆరున్నరవేల హెక్టార్లలో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ మరో రెండ్రోజుల్లో సీజన్ ముగుస్తుండగా కేవలం 3,009 హెక్టార్లలో మాత్రమే వరిసాగైంది.

 

కొన్ని పంటలపైనే ఆసక్తి


మొక్కజొన్న, రాగులు, కందులు, జొన్న, అపరాల్లో ఉలవలు, అలసందలు సాగు విస్తీర్ణం తగ్గిపోగా, పెసలు, మినుములు, కొమ్ము శెగన,రాజ్మా సాగు విస్తీర్ణం రబీలో ఊహించనిరీతిలో పెరిగింది. మొక్క జొన్న సాధారణ విస్తీర్ణం 1164 హెక్టార్లు కాగా, సాగైంది మాత్రం 1024 హెక్టార్లే. ఉలవలు 1562 హెక్టార్లలో సాగవ్వాల్సి ఉండగా 1083 హెక్టార్లలో సాగైంది. రాగులు 262 హెక్టార్లకు 144 హెక్టార్లు, జొన్న ఆరు హెక్టార్లకు మూడు హెక్టార్లు, కందులు 23 హెక్టార్లకు 11 హెక్టార్లు సాగైంది. రబీలో అత్యధికంగా రాజ్మా సాగైంది. రబీలో సాధారణ విస్తీర్ణం7,188 హెక్టార్లు కాగా ఈ ఏడాది ఏకంగా 10,755 హెక్టార్లలో సాగైంది. ఆ తర్వాత మినుములు  5583 హెక్టార్లలో సాగు చేయాలని లక్ష్యంగానిర్ణయించగా రబీలో 7,159 హెక్టార్లలో సాగైంది. పెసలు 3488 హెక్టార్లకు 3794 హెక్టార్లలో సాగవగా, కొమ్ము శనగలు 71 హెక్టార్లకు 165 హెక్టార్లలో సాగైంది. రాజ్మాతో సహా అపరాల పంటలు చేతికొచ్చేస్తుండగా.. వరి, మొక్కజొన్న, రాగి, జొన్నలు మాత్రం ఇంకా మొక్కదశలోనే ఉన్నాయి. పూర్తిగా సాగునీటివనరుల కింద వేసిన ఈ పంటలకు ప్రస్తుతానికి నీటి ఇబ్బందుల్లేకున్నప్పటికీ మరో 15-20 రోజుల్లో నీటిఎద్దడి తలెత్తే అవకాశాలు కన్పిస్తున్నాయి.

 

తగ్గిన చెరకు విస్తీర్ణం

ఇక జిల్లాలోవాణిజ్య పంటల్లో ప్రధానమైన చెరకు 37,800 హెక్టార్లకు 35వేలహెక్టార్లలోనే సాగైంది. మొత్తమ్మీద అపరాల వరకు ఆశాజనకంగానే రబీలో సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ చెరకు, వరి, మొక్కజొన్న తదితర పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోవడం ఆందోళన కల్గిస్తోంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top