న్యాయమూర్తులకు ప్రత్యేక విందు

న్యాయమూర్తులకు ప్రత్యేక విందు - Sakshi


కృష్ణా తీరాన.. పున్నమి ఘాట్‌లో ఏర్పాటు

విందు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన సీఎం

జడ్జిల కంటే ముందు వచ్చి చివరన వెళ్లిన చంద్రబాబు




సాక్షి, అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యాయమూర్తులకు శుక్రవారం రాత్రి విజయవాడ పున్నమి ఘాట్‌లో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి నగరానికి వచ్చిన సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఈ విందుకు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విందు ఏర్పాట్లను ఘనంగా చేశారు. న్యాయమూర్తుల కంటే చాలా ముందే ఆయన పున్నమి ఘాట్‌కు చేరుకున్నారు. విందు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఆహార పదార్థాల నుంచి సాంస్కృతిక కార్యక్రమాల వరకు.. అన్నింటి నిర్వహణపై అధికారులకు ఆదేశాలిస్తూ హడావుడి చేశారు. పున్నమి ఘాట్‌కు చేరుకున్న న్యాయమూర్తులకు చంద్రబాబు సాదర స్వాగతం పలికి లోపలికి తీసుకెళ్లారు. న్యాయమూర్తులు పున్నమిఘాట్‌లో దాదాపు రెండు గంటలకుపైగా గడిపారు. విందు అనంతరం న్యాయమూర్తులను చంద్రబాబు ఘనంగా సన్మానించారు.



భారీ బందోబస్తు... ఫొటోలు తీయకుండా జాగ్రత్తలు

న్యాయమూర్తులకు విందు ఏర్పాటు చేసిన పున్నమి ఘాట్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచే సాధారణ సందర్శకులతోపాటు ఎవరినీ ఘాట్‌ పరిసరాలకు అనుమతించలేదు. శివరాత్రి సందర్భంగా కృష్ణా నదిలో స్నానం చేసేందుకు వచ్చిన భక్తులను సైతం వెనక్కు పంపించారు. విందు నిర్వహించిన ఘాట్‌ వద్ద ఉన్న పర్యాటక శాఖ పున్నమి గెస్ట్‌హౌస్‌ ఉద్యోగులను కూడా ఆ ప్రాంతంలోకి అనుమతించకపోవడం గమనార్హం. ఎంపిక చేసిన కొద్ది మంది ఉద్యోగులకు ప్రత్యేకంగా పాసులు ఇచ్చారు. విందు నిర్వహణకు అవసరమైన సిబ్బందిని ఒక ప్రైవేట్‌ హోటల్‌ నుంచి తీసుకొచ్చారు. విందు ఫొటోలు బయటకు రాకుండా, విందు నిర్వహణ సిబ్బంది వద్ద సెల్‌ఫోన్లు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. సీఎం అధికార కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను ప్రభుత్వం సాధారణంగా విడుదల చేస్తుంది. పేరు ప్రఖ్యాతులున్న న్యాయమూర్తులకు సీఎం స్వయంగా విందు ఏర్పాటు చేస్తే.. కార్యక్రమం గురించి మీడియాకు ప్రభుత్వం కనీస సమాచారం, ఫొటోలు కూడా ఇవ్వకపోడం గమనార్హం.



సీఎం నివాసంలో గురువారం రాత్రి విందు

విజయవాడలో శుక్రవారం ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి న్యాయమూర్తులు గురువారమే నగరానికి చేరుకున్నారు. గురువారం రాత్రి న్యాయమూర్తులకు ముఖ్యమంత్రి ఉండవల్లిలోని తన అధికార నివాసంలో విందు ఇచ్చిన విషయం విదితమే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top