నైరుతి.. నైరాశ్యం


 ‘అనంత’ రైతన్నపై ప్రకృతి మరోసారి కన్నెర్ర చేస్తోంది. ఖరీఫ్ పంటలకు కీలకమైన నైరుతి రుతుపవనాలు నైరాశ్యం మిగిల్చేలా ఉన్నాయి. ఆకాశం మేఘావృతమవుతున్నా చినుకు నేలరాలడం గగనమైపోయింది. దుక్కులు, విత్తనాలు, ఎరువులతో సిద్ధంగా ఉన్నా పదును లేక రైతులు దిక్కులు చూస్తున్నారు. 9.33 లక్షల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో వర్షాధారంగా మెట్ట పంటలు సాగులోకి రావడం కష్టంగా తయారైంది.

 

  అనంతపురం అగ్రికల్చర్: అంతుచిక్కని వాతావరణం మధ్య ‘అనంత’ అన్నదాత పరిస్థితి మరోసారి దయనీయంగా మారుతోంది. వరుణుడు మరోసారి మొహం చాటేయడంతో ఆదిలోనే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఏప్రిల్, మే నెలల్లో విస్తారమైన వర్షాలతో అన్నదాతల్లో ఆశలు రేకెత్తించిన వరుణుడు తీరా విత్తుకునే సమయంలో ససేమీరా అంటున్నాడు. ఏప్రిల్‌లో సాధారణ వర్షపాతం 12.8 మి.మీ. కాగా ఏకంగా 65.2 మి.మీ వర్షం కురిసింది. అలాగే మే నెలలో సాధారణ వర్షపాతం 39.6 మి.మీ కాగా 51.6 మి.మీ నమోదైంది. అలాగే ఖరీఫ్ ఆరంభమైన జూన్ ఒకటో తేదీ కూడా మంచి వర్షంతో ఆశలు పుట్టించాడు. ఆ ఒక్కరోజే 17.1 మి.మీ. వర్షపాతం నమోదు అయి ఖరీఫ్‌పై ఆశలు రేకెత్తించాయి. అయితే... ఆ ఆశలు చాలా రోజులు నిలవలేదు. రోజులు గడిచే కొద్దీ వరుణుడి జాడ కానరాక అన్నదాత బెంబేలెత్తిపోతున్నాడు.

 

 నిరుత్సాహ పరుస్తున్న నైరుతి

 ముఖ్యంగా జిల్లాలో ఖరీఫ్ పంటల సాగుకు నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసే వర్షాలే కీలకం. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి వల్ల వర్షాలు కురవాలి. అంటే ఈ నాలుగు నెలల కాలంలో సాధారణ వర్షపాతం 338.4 మి.మీ. పడితే పంటలు పండటానికి అవకాశం ఉంటుంది. నైరుతి రుతుపవనాలు జూన్ 10వ తేదీ జిల్లాలోకి ప్రవేశించాయి. కానీ... నైరుతీ విస్తరించిన తరువాత ఒక్క పదును వర్షం కూడా పడకపోవడం విశేషం. జూన్ 1న 17.1 మి.మీ, 3న 4.1 మి.మీ, 5న 5.6 మి.మీ, 9న 6.6 మి.మీ, 10న 6.8 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఆ తరువాత వర్షం జాడ కరువైపోయింది.

 

 జూన్ 10 తరువాత కేవలం నాలుగైదు మండలాల్లో మాత్రం ఓ మాదిరి వర్షాలు పడ్డాయి. 8 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి రావాల్సివుండటంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పంటల సాగుకు జూలై నెలాఖరు వరకు సమయం ఉందని అధికారులు ప్రకటిస్తున్నా విత్తుకునేందుకు ఇదే మంచి సమయమని రైతులు భావిస్తున్నారు. మరికొంత సమయం ఉన్నా అంతుచిక్కని వాతావరణం నెలకొనడంతో రైతుల్లో ఆందోళన కనిపిస్తోంది.

 

  ఆకాశం మేఘావృతమై వర్షం పడుతుందనే ఆశ కనిపిస్తున్నా 20 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులకు చెల్లాచెదరై రైతుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి.  గతేడాది కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో ఖరీఫ్ పంటలు దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుందనే ఆందోళన రైతుల్లో నెలకొంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top