ధరలపై దద్దరిల్లిన అసెంబ్లీ


    ♦  వైఎస్సార్‌సీపీ వాయిదా తీర్మానం

    ♦  స్పీకర్ తిరస్కృతి, చర్చకు విపక్షం పట్టు

    ♦  సభలో గందరగోళం.. వాయిదా

 సాక్షి, హైదరాబాద్: భగ్గుమంటున్న నిత్యావసర వస్తువుల ధరలపై గురువారం రాష్ట్ర సచివాలయం దద్దరిల్లింది. ధరల తగ్గింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందో చెప్పాలని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నిలదీసింది. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు ఏమైందని ప్రశ్నించింది. సభలో తక్షణమే చర్చించాలని పట్టుబట్టింది. ఇందుకు స్పీకర్ తిరస్కరించడంతో సభలో గందరగోళం చెలరేగింది. సభ ప్రారంభంలోనే వైఎస్సార్‌సీపీ సభ్యురాలు గిడ్డి ఈశ్వరి తదితరులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తిరస్కరించడంతో మొదలైన వాగ్వాదం సభ వాయిదాకు దారితీసింది.


అదుపు తప్పిన ధరలపై చర్చించాలని విపక్షం పట్టుబట్టగా సరైన పద్ధతిలో తీర్మానం ఇస్తే చర్చించవచ్చంటూ స్పీకర్ తోసిపుచ్చారు. దీంతో విపక్ష సభ్యులు ప్లకార్డులు చేతబట్టి సభ మధ్యలోకి దూసుకువెళ్లి చర్చకు అనుమతించాలని డిమాండ్ చేశారు. తిరస్కరించిన వాయిదా తీర్మానాన్ని చర్చించే ప్రసక్తే లేదని స్పీకర్ చెప్పడంతో సభ్యులు పోడియం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ధరలు పెరుగుతున్న మాట వాస్తవమేనని, వాయిదా తీర్మానానికి బదులు వేరే రూపంలో రావాలని చెప్పారు. దీంతో నినాదాలతో కూడిన ప్లకార్డులతో విపక్ష సభ్యులు నిరసన తెలిపారు. తమ సభ్యుల్ని వెనక్కు పిలిపించాల్సిందిగా విపక్ష నేత, ఉపనేతలు జగన్‌మోహన్‌రెడ్డి, జ్యోతుల నెహ్రూకు విజ్ఞప్తి చేశారు.ఈ గందరగోళం మధ్య స్పీకర్ కోడెల ఉదయం 15నిమిషాలపాటు వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభమైనప్పటికీ విపక్షం.. ధరలపై చర్చకు పట్టుబట్టింది. దీంతో స్పీకర్ జగన్‌కు మాట్లాడేందుకు అనుమతించారు.

 


ధరలు షాక్ కొడుతున్నాయి: వైఎస్ జగన్

 'నిత్యావసర వస్తువుల ధరలపై వాయిదా తీర్మానమూ ఇచ్చాం, 344 నిబంధన కిందా ఇచ్చాం. రెండూ ఇచ్చాం. ధరలు షాక్ కొడుతున్నాయి అధ్యక్షా.. చదివి వినిపించాలంటే చాలా ఉన్నాయి. మళ్లీ మీరంటారు.. దాంట్లోకి ఇవన్నీ పెడతారంటారు. సరైన సమయంలో, తగిన పద్ధతిలో ఇచ్చాం.ముఖ్యమైన విషయం. కచ్చితంగా మీరు రేపు(శుక్రవారం) సమయం ఇస్తామంటేనే మేము అంగీకరిస్తాం, లేకుంటే అంగీకరించం' అని జగన్ తేల్చి చెప్పారు.


ఈ దశలో స్పీకర్ జోక్యం చేసుకుంటూ ఎజెండాలోని ప్రతిదీ ప్రజలకు సంబంధించిందే కదా అంటుండగా ప్రభుత్వ చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాస్ జోక్యం చేసుకున్నారు. ప్రతిపక్ష నేత బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని, స్పీకర్‌ను ఆదేశించడమేమిటన్నారు. స్పీకర్ మాట్లాడుతూ ఈ అంశాన్ని రేపటి (శుక్రవారం) ఎజెండాలో పెట్టామని, విపక్షం సహకరించే దాన్ని బట్టి చర్చకు వస్తుందని ముగించి ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపడుతున్నట్టు ప్రకటించారు. ఈ దశలో  అచ్చన్నాయుడు విపక్షాన్ని రెచ్చగొట్టి, సభ పక్కదోవ పట్టేలా చేశారు. దీంతో తిరిగి గందరగోళం జరిగింది. సభ మరోసారి వాయిదా పడింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top