భూ సమస్యలు కుప్పలు.. కుప్పలు !

భూ సమస్యలు కుప్పలు.. కుప్పలు ! - Sakshi


ఇలాంటి సమస్యలు రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో నిత్యం ఎదురవుతున్నాయి. వీటి పరిష్కారం కోరుతూ రైతులు ఆయా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

 

సాక్షి, గుంటూరు : రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో భూ సమస్యలు తిష్ట వేశాయి. రైతులకు పాసు పుస్తకాలు ఉన్నా, అడంగళ్లు ఆన్‌లైన్ కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొందరు పాసు పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. సర్వే సమస్యలు పెండింగ్‌లో ఉండటంతో రైతులు తహశీల్దారు కార్యాలయం వద్దనే రోజుల తరబడి పడికాపులు కాయాల్సి వస్తోంది.



ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలు రావడంతో కుటుంబ సభ్యుల మధ్య భూ తగాదాలు పెరిగిపోతున్నాయి. రోజూ పదుల సంఖ్యలో తమ భూ సమస్యలు పరిష్కరించాలంటూ తహశీల్దారు కార్యాలయం తలుపులు తడుతున్నారు.



ఇక్కడ భూములు కోనుగోలు చేసిన వారు వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకొనేందుకు మొగ్గు చూపుతుండటంతో ఆన్‌లైన్‌లో రైతు పేరు తప్పనిసరి అరుు్యంది. ఇదే అదను గా రెవెన్యూ సిబ్బంది రైతుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు.



 అంత మొత్తం ఇచ్చుకోలేని సామాన్య రైతుల పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు కావడం లేదు. ఒక్క తుళ్లూరు తహశీల్దారు కార్యాలయానికి రోజుకు దాదాపు 500 దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదుకు పస్తున్నాయి. ఇందులో రోజుకు 200 దరఖాస్తులను మాత్రమే సిబ్బంది ఆన్‌లైన్ చేయగలుగుతున్నారు. మిగిలిన దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోతు న్నాయి. ఇలా దాదాపు ఐదు వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.



రాయపూడి గ్రామంలో ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు కానివి 500కు పైగా ఉన్నట్లు రైతులు పేర్కొంటున్నారు. పాసు పుస్తకాల కోసం వచ్చిన దరఖాస్తులు సైతం 500పైగా ఉన్నట్లు తెలుస్తోంది.



జేబులు నింపుకుంటున్న రెవెన్యూ సిబ్బంది

రైతు అవసరాన్ని రెవెన్యూ సిబ్బంది క్యాష్ చేసుకుంటున్నారు. పెద్దల నుంచి వచ్చిన ఆస్తికి సైతం లింక్ డాక్యుమెంట్లు, దస్తావేజులు తెమ్మంటున్నా డబ్బు లాగుతున్నారు. ఆ కాగితాలు దొరక ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, ఆర్డీఓ భాస్కరనాయుడు రెవెన్యూ రికార్డులను అప్‌డేట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నా కింది స్థాయిలో దందాలు ఆగడం లేదు.

 

పొలం లాగేసుకుంటే ఎవరిని అడగాలి

మాకు రెండు ఎకరాల పొలం ఉంది. అది మా అమ్మ పేరున ఉంది. పాసు పుస్తకం ఉన్నా ఆన్‌లైన్‌లో పేరు లేదు. మేం ఇద్దరం అన్నదమ్ములం. మీరు డివైడ్ అయితేనే ఆన్‌లైన్‌లో పేర్లు ఎక్కిస్తామని తిప్పుతున్నారు. ఇప్పడు ప్రభుత్వం భూమి లాగేసుకొంటే ఆన్‌లైన్‌లో పేరు లేదు కాబట్టి మేం ఎవరిని అడగాలి.

 - షేక్ జానీసైదా, రైతు, రాయపూడి

 

 

పేరు మార్పుకోసం తిరుగుతున్నా...


నా పేరు నాగ భైరవ మల్లేశ్వరరావు. అడంగల్‌లో ఈ. మల్లేశ్వరరావు అని ఉంది. నా పేరున 5.76 ఎకరాల పొలం ఉంది.  మా గ్రామానికి రెవెన్యూ బృందం వచ్చింది. పేరు తప్పు ఉంది మార్చాలని దరఖాస్తు చేసుకొన్నా. మాకు సంబంధం లేదు తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లమన్నారు. ఇక్కడికి వచ్చి అడిగితే అది ప్రత్యేక బృందం వారే చేస్తారంటున్నారు.

 - మల్లేశ్వరరావు, అబ్బురాజుపాలెం

 

 20 రోజులుగా తిరుగుతున్నా...

 అమ్మాలన్నా.. కొనుక్కోవాలన్నా ఆన్‌లైన్‌లో పేరుండాలి. అది ఉంటేనే విలువ. నా దగ్గర 0.62 సెంట్లు, మా అన్న దగ్గర 0.62 సెంట్లు కొన్నారు. పాసుపుస్తకాలు, డాక్యుమెంట్లు ఉన్నాయి. పేరు మాత్రం ఆన్‌లైన్‌లో లేదు. 20 రోజులుగా తహశీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఇంకా ఆన్‌లైన్‌లో పేరు నమోదు కాలేదు.

 - షేక్ రహంతుల్లా, రైతు, రాయపూడి

 

డిసెంబర్ 31వ తేదీలోగా పరిష్కరిస్తాం

రాజధాని ప్రతిపాదిత ప్రాంత గ్రామాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కరానికి తొమ్మిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. అడంగల్ అఫ్లికేషన్ ఆన్‌లైన్, సర్వే పిటిషన్లు అన్నీ డిసెంబర్ 31వ తేదీలోగా పరిష్కరిస్తాం. పాసుపుస్తకాల కోసం స్వయంగా నేనే దరఖాస్తులు తీసుకొంటున్నా. కుటుంబ సభ్యుల మధ్య తగాదాలకు సంబంధించి దరఖాస్తులు వస్తున్నాయి. 


- సుధీర్, తహశీల్దార్

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top