రైలు నుంచి దూకిన ప్రయాణికులు | passengers fall down from train | Sakshi
Sakshi News home page

రైలు నుంచి దూకిన ప్రయాణికులు

Oct 21 2013 2:30 AM | Updated on Jun 1 2018 8:47 PM

ఎస్‌బీసీ ఫాస్ట్ ప్యాసింజర్ రైలు (56910) హోస్పేట్ నుంచి రాయదుర్గం మీదుగా బెంగళూరుకు వెళుతున్న సమయంలో భారీ శబ్ధం రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చాలామంది రైలు నుంచి కిందకు దూకేశారు.

రాయదుర్గం, న్యూస్‌లైన్ : ఎస్‌బీసీ ఫాస్ట్ ప్యాసింజర్ రైలు (56910) హోస్పేట్ నుంచి రాయదుర్గం మీదుగా బెంగళూరుకు వెళుతున్న సమయంలో భారీ శబ్ధం రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. చాలామంది రైలు నుంచి కిందకు దూకేశారు. ఆ సమయంలో రైలు తక్కువ వేగంతో ప్రయాణిస్తుండడంతో ప్రాణ నష్టం సంభవించలేదు. కొందరికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి రాయదుర్గం మండల పరిధిలోని పైతోట అటవీ ప్రాంతంలో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, రైల్వే సిబ్బంది కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎస్‌బీసీ ఫాస్ట్ ప్యాసింజర్ రైలు ఆదివారం రాత్రి ఏడు గంటలకు రాయదుర్గం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది.
 
 ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత ఉన్నట్టుండి పెద్ద శబ్దం వచ్చింది. కింది భాగంలో నిప్పురవ్వలు కన్పించాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై ఒక్కసారిగా అరుపులు, కేకలు వేశారు. ఇవి విన్న డ్రైవర్ రైలు వేగాన్ని తగ్గించారు. దీంతో దాదాపు 200 మంది ప్రయాణికులు కిందకు దూకేశారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. వారంతా సమీపంలోని రోడ్డుపైకి పరుగులు తీశారు. కాసేపటి తర్వాత రైలు ఆగిపోయింది. రైల్వే సిబ్బంది రైలును ఆసాంతం తనిఖీ చేశారు.
 
 ఎక్కడా సాంకేతిక లోపం లేదని తేలింది. ఆ ప్రాంతంలో ప్యాకింగ్ పనులు జరగడం వల్లే పెద్ద శబ్దం వచ్చినట్లు గుర్తించారు. అరగంట తర్వాత రైలు అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే.. కిందకు దూకేసిన ప్రయాణికులు ఎటూ వెళ్లలేని స్థితిలో చిక్కుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి భారతి రాత్రి 8.30 గంటలకు సంఘటన స్థలానికి వెళ్లారు. ప్రయాణికులను పరామర్శించారు. ఆర్టీసీ డీఎం మల్లికార్జునయ్య సహకారంతో ప్రత్యేక బస్సును అక్కడికి రప్పించారు. ఎమ్మెల్యే కూడా బాధితులతో పాటే ఆర్టీసీ బస్సులో ప్రయాణించి రాయదుర్గం చేరుకున్నారు.
 
 అనంతరం ప్రయాణికులను ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్‌లకు చేర్చి.. గమ్యస్థానాలకు పంపారు. బెంగళూరుకు వెళ్లేందుకు డబ్బులు లేవని తెలిపిన 20 మందికి చార్జీలు ఇచ్చి పంపారు. పట్టణ సమీపంలోని బానేపల్లికి చెందిన వారికి స్వయంగా ఆటో ఏర్పాటు చేసి గ్రామానికి చేర్చారు. బళ్లారికి సమీపంలోని యర్రగుడికి చెందిన తిప్పేస్వామి, బొమ్మనహాళ్ మండలం దేవగిరికి చెందిన రామాంజినేయులు, చెళికెరకు చెందిన ముంతాజ్, బానేపల్లి గ్రామస్తులు మాట్లాడుతూ తాము జీవనోపాధి కోసం బెంగళూరుకు వలస వెళుతున్నామని,  రైలులో ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో భయపడి దూకేశామని తెలిపారు. చంటిపిల్లలతో సహా ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని దూకేసినట్లు చెప్పారు. తమను ఎమ్మెల్యే ఆదుకుని ఆపద్బాంధవుడిలా నిలిచారని కొనియాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement