జిల్లా గృహ నిర్మాణ శాఖలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు?


విజయనగరం క్రైం:  జిల్లా గృహ నిర్మాణ శాఖలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించనున్నారు.  ఈ మేరకు   ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు  సమాచారం. ప్రస్తుతం  గృహ నిర్మాణ శాఖలో 119 మంది  అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తుండగా ఇందులో 86 మంది జేఈలున్నారు. వీరిలో కొంతమంది తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మండలానికి ప్రభుత్వ, అవుట్ సోర్సింగ్ జేఈలు ఇద్దరు మాత్రమే ఉండాలని నిర్ణయించారు. మండలానికి ఇద్దరు చొప్పున అంటే 34మండలాలకు 68 మంది జేఈలు ఉండాలి. ఇందులో ప్రస్తుతం పర్మినెంట్ జేఈలు 17మంది ఉన్నారు. మిగతా  51 పోస్టులను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తారు. ప్రస్తుతం అవుట్ సోర్సింగ్‌లో 86 మంది జేఈలు పనిచేస్తుండగా వీరిలో 35 మందిని తొలగించే అవకాశం ఉంది. పదేళ్లుగా పనిచేస్తున్న వీరు ప్రభుత్వ నిర్ణయంతో  రోడ్డున పడనున్నారు.

 

 జిల్లా గృహ నిర్మాణ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించాలని జూన్ నెలాఖరున ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అప్పటి నుంచి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నెలకుపైగా  రిలే నిరాహార దీక్షలు చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి వీరిని డిసెంబర్ నెలాఖరు వరకు కొనసాగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఎప్పటి నుంచి వీరిని తొలగిస్తారనేది స్పష్టంగా చెప్ప డం లేదు. పదేళ్లుగా వీరు అందించిన సేవలను పరిగణనలోకి తీసుకుని తొలగింపులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని జిల్లా గృహ నిర్మాణ సంస్థ  ప్రాజెక్టు డెరైక్టర్ కుమార్ వద్ద ప్రస్తావించగా మండలానికి ఇద్దరు జేఈలు ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన మాట వాస్తవమేనన్నారు. దీన్ని బట్టి అవుట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న 86 మంది జేఈల నుంచి 51 మందిని తీసుకునే అవకాశం ఉందని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top