తిరిగి కడలి కడుపులోకి చిరుమీనాలు


ఒడిశా ముఠాలపై చర్యలకు పూనుకున్న అధికారులు

అనుచితంగా వ్యవహరించిన కొందరు మత్స్యకార నేతలు




 కొత్తపల్లి : జిల్లాలోని తీరప్రాంతంలో తిష్టవేసి, సముద్రంలో చేపపిల్లలను వేటాడి, సీడ్‌గా అమ్ముకుంటున్న ఒడిశా ముఠాలపై మత్స్యశాఖ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఆ ముఠాల కార్యకలాపాలపైనా, వారికి స్థానిక మత్స్యకార నాయకుల్లో కొందరు సహకరిస్తున్న వైనం పైనా సోమవారం ‘సాక్షి’లో  ‘చిరు మీనాలపై పొరుగు వల’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. కాగా కలెక్టర్ అరుణ్‌కుమార్ ఆదేశాల మేరకు మత్స్యశాఖ అధికారులు కొత్తపల్లి మండలం మూలపేట చిప్పలేరు వద్ద జరుగుతున్న చేపపిల్లల విక్రయూల్ని అడ్డుకున్నారు. వాటిని నిల్వ చేసిన ప్రాంతాల్లో దాడి చేసి, చేపపిల్లలను సముద్రంలో విడిచిపెట్టారు.

 

 ఒడిశా ముఠాలకు అండగా నిలుస్తున్న మత్స్యకార నాయకులు అధికారులను అడ్డగించడంతో పాటు వార్తాసేకరణకు వెళ్లిన విలేకరులను దుర్భాషలాడుతూ, కెమెరాలు లాక్కుంటూ దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల రంగప్రవేశంతో వారు వెనక్కు తగ్గారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ డీడీ కల్యాణ్ మాట్లాడుతూ జీవనోపాధికి మూలమైన చేపపిల్లలను =మత్స్యకారులే అమ్ముకోవడం బాధాకరమన్నారు. చేప పిల్లలను పట్టుకోవడం చట్టరీత్యా నేరమని, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నివేదికను కలెక్టర్‌కు అందిస్తామన్నారు. ఆయన వెంట ఏడీ కనకరాజు, స్థానిక మత్స్యశాఖాధికారి పవన్‌కుమార్ ఉన్నారు.

 

 అవగాహన సదస్సుల నిర్వహణ: ఎమ్మెల్యే వర్మ

 సొమ్ములకు ఆశపడి చేపపిల్లలను అమ్మడం నేరమని స్థానిక ఎమ్మెల్యే వర్మ అన్నారు. చేపపిల్లల అక్రమ తరలింపుపై సోమవారం పత్రికల్లో ప్రచురించిన కథనాలకు స్పందించిన ఎమ్మెల్యే వర్మ సోమవారం ఉదయం కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

 అనంతరం ఆయన స్థానిక విలేకరులతో ఫోన్లో మాట్లాడుతూ కొందరు మత్స్యకారులకు అవగాహన లేక, కొందరు నాయకులు డబ్బులకు ఆశపడి చేపపిల్లల వేట, తరలింపులకు సహకరిస్తున్నా అది నేరమన్నారు. దీనిపై అవగాహన సదస్సులను ఏర్పాటు చే స్తామని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top