ప్రజాస్వామ్యం.. అపహాస్యం

ప్రజాస్వామ్యం.. అపహాస్యం - Sakshi


అధికార పార్టీ నైజం మరోసారి బయటపడింది. ఓ ఎమ్మెల్యేగా ప్రజల సమస్యలను వినిపించే ప్రయత్నం చేయడమే ఆయన తప్పయింది. నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సీపీకి ప్రజలు పట్టం కట్టినా.. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో ఉందనే అండతో టీడీపీ దౌర్జన్యకాండకు తెగబడింది. ఎమ్మెల్యే మాట్లాడితే వినాల్సిన పని లేదన్నారు.. మున్సిపల్ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగిసిందని ప్రకటించేశారు.. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించబోయిన వైఎస్‌ఆర్‌సీపీ కౌన్సిలర్లపై టీడీపీ కౌన్సిలర్లు ఒంటికాలిపై లేచారు.



రెచ్చగొట్టి దాడికి పాల్పడ్డారు. పరిస్థితి చేయిదాటి.. పర స్పరం కొట్టుకునే వరకు వెళ్లడంతో ఇరు పార్టీలకు చెందిన నలుగురు కౌన్సిలర్లు గాయపడ్డారు. గొడవకు కారణమైన టీడీపీ నేతలే.. పరిస్థితిని అదుపు చేయబోయిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అరెస్టుకు ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చారు. మరి నంద్యాలలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా.. లేనట్టా? టీడీపీ నేతలు సమాధానం చెప్పాలి.

 


 సాక్షి ప్రతినిధి, కర్నూలు:

     ఒకవైపు తెల్లారితే వైఎస్సార్‌సీపీ జిల్లాస్థాయి విస్తృత సమావేశం!

     పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ వచ్చి జిల్లా కమిటీని ప్రకటించడంతో పాటు వివిధ ప్రజా సమస్యలపై పోరాట కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమవుతుండటం!!

     మరోవైపు జిల్లావ్యాప్తంగా లక్షలాది ఫించన్లు, తెల్లరేషన్ కార్డుల తొలగింపుతో ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకత!

     }Oశెలం రిజర్వాయర్‌లో నీటి మట్టం 854కు చేరుకుంటుండటంతో జిల్లాలో ఏకంగా లక్షా 20 వేల ఎకరాలకు పైగా పంటలు ఎండిపోయే దుస్థితి!!

     అధికారం అండతో రెచ్చిపోతున్న తెలుగు ‘తమ్ముళ్ల’ దెబ్బకు రోజురోజుకీ క్షీణిస్తున్న పార్టీ ప్రతిష్ట!!!

 

 వెరసి ఎలాగైనా జిల్లాలో రోజురోజుకీ బలపడుతున్న వైఎస్సార్‌పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో పార్టీకి మొదటి నుంచి అండగా ఉంటున్న భూమా నాగిరెడ్డిని అరెస్టు చేయడం ద్వారా మానసికంగా వైఎస్సార్ శ్రేణులను కుంగదీసేందుకు నంద్యాల పురపాలక సంఘం సమావేశాన్ని అధికార పార్టీ వేదిక చేసుకుంది. ఇందుకోసం మొదటి నుంచీ ప్రణాళిక బద్ధంగా, పక్కాగా స్కెచ్ వేసి పావులు కదిపింది. ఏకంగా ఎమ్మెల్యేపై హత్యాయత్నం, దాడి కేసులను పెట్టి అరెస్టుకు శుక్రవారం అర్ధరాత్రి వరకు అధికార పార్టీ నంద్యాలలో హైడ్రామాను నడిపించింది.



 స్కెచ్ నడిపారిలా...!

 నంద్యాల పురపాలక సంఘం సమావేశంలో ఎజెండాలోని అంశాలను చైర్‌పర్సన్ సులోచన చదివి వినిపించి మమ అనిపించారు. ఇదేసమయంలో ప్రజా సమస్యలపై తన వాణిని వినిపించేందుకు స్థానిక ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ప్రయత్నించగానే తమ పథకాన్ని అమలు చేయడం అధికార పార్టీ షురూ చేసింది. ఎమ్మెల్యే ప్రసంగం వినాల్సిన అవసరం లేదంటూ టీడీపీ సభ్యులు దూకుడు ప్రదర్శించారు. ప్రజా సమస్యలపై తన ప్రసంగాన్ని వినాల్సిందేనని.... గేట్లు వేయాలని టీడీపీ సభ్యులను ఉద్దేశించి సైగ చేశారు.



ఇదే సమయంలో ఇరు పార్టీ సభ్యుల మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరు కొట్టుకున్నారు. ఇక్కడే అధికార పార్టీ తన కుటిల నీతిని ప్రదర్శించింది. భూమా సైగ చేసినందువల్లే గొడవ జరిగిందంటూ ఏకంగా ఆయనపై హత్యాయత్నం, దాడి కేసు బనాయించింది. వెంటనే పోలీసు ఉన్నతాధికారులను ఉసిగొల్పింది. ఇందులో భాగంగానే ఎస్పీ, నంద్యాలలో ఉన్న అడిషనల్ ఎస్పీ రంగంలోని దిగారు. ఘటన జరిగిన రెండు గంటల్లోగా ఏకంగా ఎస్పీ నంద్యాలకు వెళ్లారంటే అధికారబలాన్ని ఇట్టే అర్థమవుతోంది.



ఏకంగా అరెస్టు వారెంట్‌తో ఏదో యుద్ధానికి దిగుతున్నట్టు 300 మంది పోలీసులతో రాత్రి భూమా నాగిరెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో... ఇంట్లోకి ప్రవేశించి అణువణువూ గాలించారు. ఆయన ఇంట్లో లేకపోయినప్పటికీ ఎస్పీ, అడిషనల్ ఎస్పీలు ఆయన ఇంటి వద్దే శుక్రవారం రాత్రి పొద్దుపోయేదాకా ఉండటాన్ని గమనిస్తే... పోలీసులపై అధికార పార్టీ ఎంత ఒత్తిడి తెస్తుందో అర్థమవుతోంది.

 

 లొంగిపోండంటూ ఎస్పీ పిలుపు

 ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి లొంగిపోవాలంటూ ఎస్పీ రవికృష్ణ పిలుపునిచ్చారు. ఆయనపై రెండు కేసులు బనాయించామని నంద్యాలలో రాత్రి ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిపద్ధతి కాదని హితవు పలకడం గమనార్హం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top