కృష్ణాకు ఇరువైపులా బీచ్‌రోడ్లు, రిసార్టులు

కృష్ణాకు ఇరువైపులా బీచ్‌రోడ్లు, రిసార్టులు

  • ప్రకాశం రిజర్వాయర్‌లో వాటర్‌బోట్లు, స్పీడ్‌బోట్లు

  •  భవానీ ద్వీపంతో పాటు మరో 4 ద్వీపాల్లోనూ థీమ్‌పార్కులు

  •  మాస్టర్‌ప్లాన్‌లో రిక్రియేషన్ జోన్ ఏర్పాటు ఆవశ్యకత

  •  బ్లూ ప్రింట్ వచ్చాక టూరిజం కొత్త ప్రాజెక్టులపై డీపీఆర్

  • సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రకాశం బ్యారేజీకి ఎగువన, కృష్ణానదికి ఇరువైపులా ఐదు కిలోమీటర్ల మేర బీచ్‌రోడ్లు, రిసార్టులను నిర్మించి భారీసంఖ్యలో పర్యాటకులను ఆకట్టుకునేందుకు రాష్ట్ర పర్యాటకశాఖ ప్రతిపాదనలు తయారు చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన రిసార్టులు, థీమ్‌పార్కులు, బోటింగ్ యూనిట్ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది.



    రాజధాని మాస్టర్‌ప్లాన్‌కు సంబంధించిన బ్లూ ప్రింట్ వచ్చాక క్యాపిటల్ ఏరియాలో టూరిజం సర్క్యూట్ల అభివృద్ధికి సమగ్ర వివరాలతో కూడిన ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసేందుకు టూరిజం శాఖ ఉన్నతాధికారులు సమాయత్తమవుతున్నారు. సింగపూర్ కార్పొరేట్ సంస్థలు తయారు చేసిన మాస్టర్‌ప్లాన్‌లో కృష్ణానదికి ఇరువైపులా రిక్రియేషన్ జోన్ అభివృద్ధి చేయాల్సి ఉంది. దీన్లో భాగంగా రెండు వైపులా ఐదు కిలోమీటర్ల మేర విశాలమైన బీచ్‌రోడ్లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు.

     

    నదీ ముఖ రాజధాని నగర నిర్మాణంపై ప్రభుత్వం మొదటి నుంచి ఆసక్తి చూపుతోంది. మాస్టర్‌ప్లాన్ తయారు చేసే సంస్థలకు సైతం ముందే ఈ విషయాన్ని వివరించింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న మాస్టర్‌ప్లాన్ తయారీ సంస్థలు ప్రకాశం బ్యారేజీకి ఎగువన నదికి రెండు వైపులా పర్యాటకుల కోసం విహార, వినోద ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సూచించాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం 60 అడుగుల వెడల్పులో బీచ్‌రోడ్లను నిర్మించడంతో పాటు దేశ, విదేశాలనుంచి వచ్చే పర్యాటకులు సేద తీరేందుకు వీలుగా విలాసవంతమైన రిసార్టులు నిర్మించనుంది.



    రిజర్వాయర్‌లో పూడికమట్టిని తొలగించి 20 కిలోమీటర్ల మేర ఎగువకు న దికి మధ్య భాగాన ప్రత్యేక కాలువ నిర్మించాలని ఆలోచిస్తోంది. నదికి మధ్యలో ఉన్న భవానీ ద్వీపం చుట్టూ పర్యాటకులు విహరించేందుకు వీలుగా వాటర్‌బోట్లు, వాటర్‌స్పోర్ట్స్‌కు అనుకూలంగా స్పీడ్‌బోట్లు, జెట్‌స్కీలను ఏర్పాటు చేయడం వల్ల ఆదాయం మరింత పెరిగే వీలుందని పర్యాటక శాఖ భావిస్తోంది. ప్రస్తుతం విజయవాడలోని బరంపార్కు నుంచి భవానీ ద్వీపం ప్రాంతాలకు రాకపోకలు సాగించే పర్యాటకుల కోసం 150 సీట్ల సామర్థ్యమున్న 10 ఏసీ డబుల్ డెకర్ బోట్లు, అప్పర్ డెకర్ బోట్లు (బోధిసిరి), 50 సీట్ల కెపాసిటీవి మూడు, 30 మంది ప్రయాణించేందుకు వీలుగా రెండు ఫంటూన్‌లు, రెండు స్పీడ్‌బోట్లు ఉన్నాయి. భవానీ ఐల్యాండ్‌లో 34, బరంపార్కు దగ్గర 20 రిసార్టులున్నాయి.



    రాజధాని ప్రాంతం అభివృద్ధి జరిగి కొత్త నగరం ఏర్పాటు జరిగితే ఇక్కడికొచ్చే పర్యాటకులు 50 శాతం పెరిగే వీలుందని, ఈ నేపథ్యంలో వీరికి అనుగుణంగా రిసార్టుల సంఖ్య పెంచాలని యోచిస్తోంది. భవానీ ద్వీపంతో పాటు పక్కనే ఉన్న నాలుగు ద్వీపాల్లో థీమ్‌పార్కులు, రెస్టారెంట్లు, లైటింగ్ హౌస్‌లు నిర్మించాలని, ఇక్కడి ద్వీపాలను సింగపూర్‌లోని ‘సెంటోసా ద్వీపం’ మాదిరిగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు తయారు చేస్తోంది. ఇందుకోసం మొత్తం రూ.150 కోట్లకు పైగా వెచ్చించేందుకు అంచనాలు తయారు చేస్తోందని టూరిజం శాఖ అధికారవర్గాలు చెబుతున్నాయి.

     

    లే అవుట్ అభివృద్ధి తరువాతే..



    రాజధాని ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి సంబంధించిన పనులన్నీ రాజధాని మాస్టర్‌ప్లాన్ బ్లూ ప్రింట్ సిద్ధమై, లే అవుట్ అభివృద్ధి జరిగాకనే చేపడతామని ఏపీటీడీసీ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ ఈడీ అమరేందర్‌కుమార్ చెప్పారు. భవానీ ద్వీపాన్ని ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో సెంటోసా ద్వీపం మాదిరిగా అభివృద్ధి చేసేందుకు కన్సల్‌టెంటును ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి ఆమోదం లభించాక ప్రతిపాదనల ప్రకారం పనులు చేపడతామని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top