కన్నీళ్లగా మిగిలిన కలలు


శ్రీకాకుళం న్యూకాలనీ: రెండేళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరువలె మిగిలిపోయింది. ఇంటర్మీడియెట్ పూర్తిచేసి నాణ్యమైన ఇంజనీరింగ్ కళాశాలల్లో సీటు సంపాదించి తద్వారా మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని భావించిన ఆ విద్యార్థుల కలలు కన్నీళ్లుగానే మిగిలిపోయాయి. ఎంసెట్ పరీక్షకు ఆలస్యంగా హాజరైన బాధిత విద్యార్థులు మరో ఏడాది పాటు నిరీక్షించాల్సిందే. జిల్లాలో శుక్రవారం ఎంసెట్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ఉదయం 10 నుంచి ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి మెడిసిన్ పరీక్ష మూడేసి గంటల చొప్పున జరిగాయి. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షకు అనుమతించరు. శ్రీకాకుళం జిల్లా మందస ఏపీఎస్‌డబ్ల్యూ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ చేసిన 14 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ పరీక్ష రాసేందుకు నిర్ణీత సమయానికి చేరుకోలేక పరీక్ష కేంద్రాల నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం... ఎందుకు ఆలస్యమైంది? అసలేం జరిగింది? వివరాలు ఇలా ఉన్నాయి.

 

 ఓ ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్ మాయ

 విశాఖపట్నంలో మధురవాడకు సమీపంలో బాబా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ కళాశాల ఉంది. ఈ ఏడాది ఇంజినీరింగ్ విద్యార్థుల అడ్మిషన్లను పెంచుకునే దిశగా ఎంసెట్ ఉచిత శిక్షణ పేరిట ఇంటర్మీడియెట్ పరీక్షలు పూర్తై విద్యార్థులను వివిధ మార్గాల్లో ఎరవేసింది. పొరుగు జిల్లాలతో పాటు శ్రీకాకుళం జిల్లాకు చెందిన విద్యార్థులను సేకరించారు. వీరికి గత కొద్ది రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. శుక్రవారం నాటి ఎంసెట్ పరీక్షకు నిర్ణీత సమయానికి కేంద్రాల వద్దకు చేర్చుతామంటూ(విద్యార్థుల వద్ద మెప్పు పొంది అడ్మిషన్లగా మరల్చకునే ప్రయత్నంలో) ప్రగల్బాలు పలికారు.

 

 విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వచ్చే మార్గంలో దారిపొడవునా ఉన్న పరీక్ష కేంద్రాల వద్ద శుక్రవారం ఉదయం విద్యార్థులను దింపుకుంటూ వచ్చారు. సమయం దగ్గర పడుతుండడంతో శ్రీకాకుళం కేంద్రంగా పరీక్ష రాసే విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. పరీక్షకు సమయం మించిపోతుందని తొందరగా వెళ్లమని ఎంతమొత్తుకున్నా వీరి గాధ వినలేదు. మేమున్నామంటూ.. మాయ మాటలతో పొరుగు జిల్లా విద్యార్థులను సైతం ప్రధాన రహదారికి సమీపంలోని కేంద్రాల్లో దింపుకుంటూ శ్రీకాకుళం వచ్చేసరికి 10.20 నిమిషాలు అయింది. నిర్ణీత పరీక్ష సమయం(ఉదయం 10గంటలు) దాటిపోవడంతో ఈ విద్యార్థులను అధికారులు లోపలికి అనుమతించేలేదు.

 

 ఆరు కేంద్రాల్లో రాయాల్సి ఉంది

 జిల్లాలోని శ్రీకాకుళం పురుషులు, శ్రీకాకుళం మహిళలు, శ్రీకాకుళం రూరల్ పరిధిలోని గాయిత్రి, వైష్ణవి, శారద, వెంకటేశ్వర కళాశాలల ఆరు కేంద్రాల్లో ఇద్దరేసి చొప్పున(మహిళా కళాశాలలో నలుగురు) మొత్తం 14 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉంది. ఆలస్యంగా కేంద్రాలకు హాజరుకావడంతో పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు. బాబా ఇనిస్టిట్యూట్‌ని నమ్మి నిలువునా మోసపోయామని, కనీసం పరీక్ష రాసేందుకు కూడా మాకు అవకాశం లేకుండా చేశారని శ్రీకాకుళం పురుషుల కళాశాల కేంద్రంలో పరీక్ష రాయకుండా వెనుదిరిగిన రోహిణి, యోగిత ధీనంగా చెప్పారు. రోహిణిది పర్లాకిమిడి వద్ద పుడిగాం గ్రామం కాగా, యోగితది మందస మండలం ఆర్‌కె పురం గ్రామం. ఎంసెట్ పరీక్ష కోసం గత రెండేళ్లగా ఎదురుచూశామని, మాతోపాటు మరో 12 మంది కూడా పరీక్ష రాయలేకపోయారని వాపోయారు. ఏది ఏమైనా విద్యార్థిలోకానికి ఇదొక చెంప పెట్టు వంటిది. జీవితమనే పరీక్షల్లో ఒకరిపై ఆధారపడితే ఏం జరుగుతుందో చెప్పడానికి ఇదొక నీతి వాఖ్యంగా భావించాలి.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top