లూటీలో పోటీ!

లూటీలో పోటీ! - Sakshi

  • గ్రావెల్ అక్రమ తవ్వకాల్లో

  •  తెలుగు తమ్ముళ్ల మధ్య పోరు

  •  సర్దుబాటు చేసిన మరో నేత

  •  ఇష్టారాజ్యంగా తరలింపు

  •  పట్టించుకోని అధికారులు

  • విశాలమైన భూగర్భ నిక్షేపాలున్న అనకాపల్లి మండలంలో గ్రావెల్‌ను లూటీ చేసేందుకు తెలుగు తమ్ముళ్లు పోటీ పడుతున్నారు. అనకాపల్లి పరిసరాల్లో ఏర్పాటు చేస్తున్న లే-అవుట్‌తో పాటు రాంబిల్లి, బుచ్చియ్యపేట ప్రాంతాల్లో జరుగుతున్న నిర్మాణాల కోసం అవసరమైన గ్రావెల్ కాంట్రాక్టు దక్కించుకునేందుకు పోటీ పడుతున్న వీరు అనుమతి వచ్చే లోపు అందినకాడికి తవ్వి తరలించేస్తున్నారు.

     

    అనకాపల్లి : భూగర్భగనుల శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో తమ్ముళ్లు కొండలను ఓ పట్టు పట్టేస్తున్నారు. తవ్వుకున్న వారికి తవ్వుకున్నంతగా గ్రావెల్ దక్కుతోంది. ఎదుటివారిది అక్రమమని అధికారులకు ఫిర్యాదు చేస్తూ తాము మాత్రం నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. గత ఆదివారం అనకాపల్లి మండలంలోని సుందరయ్యపేట పంచాయతీ పరిధిలో గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తున్నారంటూ ఒక తెలుగు తమ్ముడు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికార గణం రంగంలోకి దిగింది. అయితే గ్రావెల్ తవ్వకం జరుపుతున్న నిర్వాహకుడు కూడా తెలుగుదేశం నేత కావడంతో విషయం ఆసక్తిగా మారింది.



    ఇంకేముంది మండల పరిషత్ కార్యాలయంలో ఒక గది కేంద్రంగా తెలుగు తమ్ముళ్ల కుస్తీకి తెరదిం చేందుకు దేశం పార్టీ కోర్ కమిటీ సభ్యుడొకరు రంగంలోకి దిగారు. చివరకు అప్పటి వరకూ తవ్వకాలకు అనుమతి లేదని చెప్పి హడావిడి చేసిన తెలుగు తమ్ముడు శాంతించాడు. దీంతో గ్రావెల్ అక్రమ తవ్వకం యధావిధిగా సాగిపోతోంది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన భూగర్భగనుల శాఖధికారులు సైతం మౌనముద్ర దాల్చారు.

     

    అధికారుల ఉదాసీనత : అనకాపల్లి మండలంలోని గ్రావెల్ పెద్దఎత్తున తరలిపోతున్నా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విశేషం. తాజాగా మెట్టపాలెం శివారు జగన్నాథపురం, రేబాక, మొండిపాలెం, కొప్పాక, వేటజంగాల పాలెం, కుంచంగి, సీతానగరం గ్రామాల కొండల నుంచి గ్రావెల్ అక్రమంగా తరలిపోతోంది.



    ఈ విషయంలో పలు శాఖలకు చెందిన అధికారుల ఉదాసీనతపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న అధికారుల బదిలీ సమయాన్ని సొమ్ము చేసుకునేందుకు ఇప్పటికే కొందరు దళారులు రంగంలోకి దిగగా, ఆయా ప్రాంతాల్లోని పంచాయతీలకు సెస్సు చెల్లించకుండా జరుపుతున్న అక్రమ తవ్వకాల వెనుక తెలుగు తమ్ముళ్ల పాత్ర చాలా ఎక్కువగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top